Viduthalai Part 2: తీవ్రవాదం.. రెండు కోణాల్లో!
ABN , Publish Date - Feb 09 , 2025 | 04:13 PM
ఉగ్రవాదంపై గతంలో కూడా కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ వాటికి మించి సమస్య మూలాల్లోకి వెళ్ళడానికి దర్శకుడు వెట్రిమారన్ ఒక మంచి ప్రయత్నం చేశాడనే చెప్పాలి. ఆయన దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘విడుదలై పార్ట్ 2’. ఈ సినిమా రిపోర్ట్ ఏమిటంటే..
నలిగిన దారుల్లో నడక సుఖంగా, సులభంగా ఉంటుంది. నలగని దారుల్లో నడకకు అడుగడుగునా ఆటంకాలే. ఆ దారులు అడవిబాట పట్టినప్పుడు నడక మరింత కష్టమనిపిస్తుంది. ఎవరు ఏ దారి ఎంచుకుంటారనేది ఒక్కోసారి జీవితాల్ని, జీవిత పథాన్ని నిర్ణయించే శక్తిగా మారుతుంది. భద్రమైన జీవితాన్ని కాదనుకుని నమ్మిన సిద్ధాంతాల కోసం అడవుల బాట పట్టిన పోరాట వీరుల కథే ‘విడుదల 2’. బి. జయమోహన్ రచించిన ‘తునైవాన్’కు చిత్రరూపమిది.
తీవ్రవాద నాయకుడైన పెరుమాళ్‌ను పోలీసులు నిర్బంధించడంతో ‘విడుదల’ మొదటి భాగం ముగుస్తుంది. అయితే అరెస్టు విషయం బయటకు పొక్కడంతో అతనిని రహస్యంగా వేరేచోటుకి తరలించాలని అనుకుంటారు. ఒక పోలీసు అధికారి నాయకత్వంలో కొంతమంది సాయుధ పోలీసులు అతనికి సంకెళ్ళు వేసి, అడవిదారి గుండా చెక్‌పోస్టుకు చేర్చడానికి బయలు దేరతారు. దారిలో ఒక కానిస్టేబుల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పెరుమాళ్ ఒక సాధారణ స్కూలు టీచరైన తాను విప్లవ నాయకుడిగా ఎదిగిన క్రమాన్ని చెబుతూ వస్తాడు. తీవ్రవాదులంటే పోలీసులకున్న దురభిప్రాయాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. రైల్వే బ్రిడ్జిని పేల్చడం, ఫ్యాక్టరీ యజమానుల్ని, భూస్వామిని హత్య చేయడానికి దారితీసిన పరిస్థితులు వివరించి తను చెబుతున్న విషయం గురించి ఒక్కసారి ఆలోచించి చూడమని అంటాడు. సమాజంలోని ఆర్థిక అసమానతలు, కుల వ్యవస్థ, గనుల తవ్వకం పేరిట జరుగుతున్న ప్రకృతి విధ్వంసం తనలాంటి తీవ్రవాదులు తయారవడానికి కారణమవుతున్నాయని చెబుతాడు. ఉద్యమానికి ఎంతోమంది యువకులు బలిదానం అవడంపై కూడా విచారం వ్యక్తం చేస్తాడు.
ఈలోగా అతని తీవ్రవాద సహచరులు రెండు గ్రూపులుగా విడిపోయి పోలీసుల నిర్బంధం నుంచి పెరుమాళ్‌ను తప్పించడానికి వ్యూహం పన్ని అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. పెరుమాళ్‌ను అరెస్టు చేశామని చెబితే కేంద్రం నుంచి మూడు రోజుల్లో రానున్న నిధులు ఆగిపోతాయేమోనన్న కారణంతో అతని అరెస్టును దాచిపెట్టడానికి ఓ వైపు అధికార యంత్రాంగం సమాలోచన చేస్తుంటుంది. పెరుమాళ్‌ను అతని సహచరులు పోలీసుల నుంచి తప్పించ గలిగారా? చివరకు పెరుమాళ్ ఏమయ్యాడనేది మిగిలిన కథ.
నక్సలిజం అనేది ఒక ప్రధానమైన, సున్నితమైన అంశం. అలాంటి సున్నితమైన అంశాన్ని తీసుకుని ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పకుండా అటు పోలీసుల దృక్కోణం నుంచి, ఇటు తీవ్రవాదుల దృక్కోణం నుంచి వివరించడానికి ప్రయత్నించడం అనేది సాహసంతో కూడినపని. అయితే ఆ పనిని దర్శకుడు వెట్రిమారన్ సమర్థవంతంగా నిర్వహించాడు. పోలీసు వ్యవస్థలోని లోపాలు, వైఫల్యాలు, డొల్లతనం, అమానవీయతను కళ్ళకు కట్టినట్టు చూపించడంలో వెట్రిమారన్ సఫలీకృతుడయ్యాడు.
Also Read- Chiranjeevi: ఓ మహిళ చెడమడా తిట్టేశారు.. ఎవరా అని ఆరా తీస్తే?
ఒక నక్సలైటుని పట్టుకోడానికి అవసరమయే ‘మోడస్ ఆపరండీ’ని దాని అనంతర పరిణామాలను, ఎన్‌కౌంటర్ల తీరుతెన్నులను చాలావరకు వాస్తవంగా చూపించడం ఒక సాహసం. దానికి వెట్రిమారన్‌ను ప్రత్యేకంగా అభినందించాలి. ఇక పెరుమాళ్‌గా విజయ్ సేతుపతి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక పరిణతి చెందిన నక్సలైటు నాయకుడిని సజీవంగా మన కళ్ళెదుట నిలిపాడు. ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు అడవి దారిలో పోలీసులతో సంభాషించే సందర్భంలోనూ పెరుమాళ్ తప్ప ఎక్కడా విజయ సేతుపతి కనిపించడు. కుమరేశన్‌గా సూరికి మొదటి భాగంలో ఉన్న ప్రాధాన్యత తగ్గినప్పటికీ బాగా నటించాడు. పెరుమాళ్ భార్యగా మంజువారియర్ కూడా అలరించింది. పోలీసు అధికారులుగా గౌతమ్ వాసుదేవ మీనన్, చేతన్, ప్రభుత్వ అధికారిగా రాజీవ్ మీనన్ ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు.
‘ఉద్యమాన్ని నడిపించేది నాయకులు కాదు. నాయకులు లేకపోయినా సిద్ధాంతాలు ఉద్యమాన్ని నడిపిస్తాయి’’ లాంటి పదునైన సంభాషణలు చిత్రం అంతటా వినిపిస్తూ ఆలోచింపజేస్తాయి. నక్సలైట్ల జీవనశైలిలోని కష్టనష్టాలను, నమ్మిన సిద్ధాంతాల కోసం వాళ్లు చేస్తున్న త్యాగాలను పెరుమాళ్, అతని భార్య మధ్య జరిగిన సంభాషణల ద్వారా అర్థం చేయించే ప్రయత్నం చేస్తారు వెట్రిమారన్. ఉగ్రవాదంపై గతంలో కూడా కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ వాటికి మించి సమస్య మూలాల్లోకి వెళ్ళడానికి దర్శకుడు ఒక మంచి ప్రయత్నం చేశారనే చెప్పాలి. మొదటి భాగంతో పోలిస్తే.. రెండో భాగం ఫ్యాక్టరీ కార్మికులు, కమ్యూనిస్ట్ నాయకుల పోరాట దృశ్యాలు, సుదీర్ఘమైన అడవి ప్రయాణం ద్వారా కొంచెం సాగదీసినట్టు, మొదటి భాగంలోని ఉత్కంఠ తగ్గినట్టు అనిపించినా ఆలోచింపచేస్తుంది.
- జి.లక్ష్మి