Pushpalatha: సీనియర్ నటి పుష్పలత కన్నుమూత
ABN , Publish Date - Feb 04 , 2025 | 11:08 PM
లెజెండ్ నందమూరి తారక రామారావు సరసన ‘రాము’ సినిమాలో నటించిన నటి పుష్పలత కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు వృద్దాప్య సమస్యలు కూడా తోడవడంతో.. మంగళవారం చెన్నైలో ఆమె మృతిచెందారు. ఆమె మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.
ప్రముఖ నటి పుష్పలత (Pushpalatha) ఇక లేరు. నటుడు ఏవీఎం రాజన్ భార్య, ప్రముఖ నటి అయిన పుష్పలత (87) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, మంగళవారం సాయంత్రం చెన్నైలో కన్నుమూసినట్లు సమాచారం. పుష్పలత ‘కొంగు నాడు తంగం’ చిత్రంతో కథానాయికగా తెరంగేట్రం చేశారు. ఆయన ఎంజీఆర్, శివాజీ గణేషన్ వంటి ఆ కాలంలోని ప్రముఖ హీరోలతో నటించడం గమనార్హం. తెలుగులో వచ్చిన ‘రాము’ సినిమాలో ఆమె ఎన్టీఆర్ సరసన నటించారు. ‘యుగపురుషుడు’లో ఎన్టీఆర్ మదర్‌గా, ‘వేటగాడు’ సినిమాలో శ్రీదేవి మదర్‌గా నటించిన ‘పుష్పలత’ టాలీవుడ్‌లోనూ నటిగా మంచి గుర్తింపును పొందారు.
‘శారద, బార్ మగలే బార్, నౌమోన్ ఒరు పెన్, యరుక్కు సొండం, తాయే ఉనక్క’ వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. ఆమె తమిళంలోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అనేక చిత్రాలలో కథానాయికగా మరియు సహాయ పాత్రల్లో నటించారు. అప్పటి స్టార్ హీరోలందరి సినిమాలలో నటించిన పుష్పలత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘నాన్ అడుంబు అయిలి’ చిత్రంలో రజనీకాంత్ అత్తగా ప్రతినాయక పాత్రను పోషించారు.
87 ఏళ్ల పుష్పలత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, అందుకు వృద్ధాప్య సమస్యలు కూడా తోడవడంతో ఆమె ఏ పరిస్థితుల్లోనూ కోలుకోలేకపోయారు. ఆమె మృతితో తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పుష్పలత మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పుష్పలత కుమార్తె మహాలక్ష్మి.. జంధ్యాల ‘రెండు జెళ్ల సీత’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ‘మాయదారి మరిది, ఆనంద భైరవి’ చిత్రాల్లో నటించిన మహాలక్ష్మి.. ఆ తర్వాత మతం మార్చుకుని సిస్టర్ రేచల్‌గా పేరు మార్చుకున్నారు.