Kollywood Directors: బాలీవుడ్‌లో కోలీవుడ్ దర్శకుల హవా..
ABN , Publish Date - Feb 02 , 2025 | 05:18 PM
ఒకప్పుడు బాలీవుడ్ అంటే గొప్ప పేరుండేది. కానీ ఈ మధ్యకాలంలో బాలీవుడ్ పరిస్థితి ఎలా తయారైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడి స్టార్ హీరోలంతా ఇప్పుడు సౌత్ దర్శకులని నమ్ముకుని వారితోనే సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సౌత్‌లో టాలీవుడ్, కోలీవుడ్‌లకు చెందిన దర్శకులు.. బాలీవుడ్‌లో చక్రం తిప్పుతుండటం విశేషం. అసలు విషయంలోకి వస్తే..
ఇటీవల కోలీవుడ్ దర్శకులకు బాలీవుడ్‌లో అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయి. గతంలో తమిళ చిత్రపరిశ్రమకు చెందిన దర్శకుడు భీమ్‌సింగ్, కె.బాల చందర్, భారతీరాజా, మణిరత్నం, అట్లీ వంటివారు హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇపుడు యంగ్ జనరేషన్ దర్శకులకు కూడా హిందీ నిర్మాతలు అవకాశాలు ఇస్తున్నారు. షారూక్ ఖాన్ హీరోగా అట్లీ ‘జవాన్’ చిత్రాన్ని తెరకెక్కించి, కలెక్షన్లపరంగా సరికొత్త రికార్డులు నెలకొల్పారు. అలాగే, బాలీవుడ్ అగ్రహీరోలు అమీర్‌ఖాన్, అక్షయ్ కుమార్ హీరోలను కోలీవుడ్ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్ట్ చేశారు.
Also Read- Janhvi Kapoor: జాన్వీ కపూర్ కండోమ్ యాడ్‌కు పర్ఫెక్ట్.. కండోమ్ సంస్థ అధినేత
ఇపుడు సల్మాన్‌ఖాన్ హీరోగా ‘సికిందర్’ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్. అలాగే, రజనీకాంత్‌తో ‘కూలీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న లోకేష్ కనకరాజ్.. తన తదపరి చిత్రాన్ని అమీర్‌ఖాన్‌తో తీయబోతున్నారనే ప్రచారం సాగుతుంది. అయితే, తమిళంలో ఇప్పటికే ఈయన కమిట్ అయిన చిత్రాలను పూర్తి చేసిన తర్వాతే బాలీవుడ్ ప్రాజెక్టుపై దృష్టిసారించే అవకాశం ఉంది. అదేవిధంగా ‘రాకీ’, ‘సానికాయితం’, ‘కెప్టెన్ మిల్లర్’ వంటి చిత్రాలను రూపొందించిన అరుణ్ మాధేశ్వరన్ ప్రస్తుతం ధనుష్ హీరోగా సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత హిందీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
ఇంకా ‘అమరన్’ ఫేం రాజ్‌కుమార్ పెరియసామి, ‘షేర్‌షా’ ఫేం విష్ణువర్ధన్ కూడా బాలీవుడ్‌లో ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఒక్క తమిళ దర్శకులకే కాకుండా, దక్షిణాదిలోని ఇతర భాషలకు చెందిన దర్శకులకు కూడా బాలీవుడ్‌లో అవకాశాలు వస్తుండటం గమనార్హం. ముఖ్యంగా టాలీవుడ్ నుండి సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే అక్కడ సుస్థిర స్థానం పదిలపర్చుకోగా.. ‘వీరసింహారెడ్డి’ దర్శకుడు గోపీచంద్ మలినేని ‘జాట్’తో బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి, క్రిష్ వంటి వారు ఇప్పటికే అక్కడ సినిమాలు చేసి ఉన్నారు.