Bad Girl Controversy: వివాదంలో ‘బ్యాడ్‌గర్ల్’.. నిషేధించాలంటూ డిమాండ్లు
ABN , Publish Date - Feb 04 , 2025 | 05:18 PM
దర్శకుడు వెట్రిమారన్ - బాలీవుడ్ దర్శక నిర్మాత, నటుడు అనురాగ్ కశ్యప్ నిర్మాణంలో వర్షా భరత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘బ్యాడ్‌గర్ల్’ మూవీ కాంట్రవర్సీలో చిక్కుకుంది. ఈ సినిమా టీజర్ విడుదల తర్వాత ఒక్కసారిగా సినిమాపై అంతా మండిపడుతున్నారు. ఈ సినిమా విడుదల కాకుండా బ్యాన్ చేయాలంటూ కోలీవుడ్‌లో డిమాండ్స్ ఎక్కువయ్యాయి. విషయం ఏమిటంటే..
గ్రాస్ రూట్ బ్యానర్‌పై దర్శకుడు వెట్రిమారన్ - బాలీవుడ్ దర్శక నిర్మాత నటుడు అనురాగ్ కశ్యప్ నిర్మాణంలో వర్షా భరత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్యాడ్‌గర్ల్’ మూవీని నిషేధించాలన్న డిమాండ్లు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా, తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటుంది. టీజర్‌లోనే అనేక వివాదాస్పద అంశాలను పొందుపరిచారని, సినిమాలో ఎలాంటి సన్నివేశాలుంటాయోనన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Also Read- Nagarjuna: నిరాశలో అక్కినేని అభిమానులు
మరీ ముఖ్యంగా బ్రాహ్మణుల సంప్రదాయాలను కించపరిచేలా, పాఠశాలలో చదువుకునే ఓ విద్యార్థిని సహ విద్యార్థులను ఉద్దేశించి కామెంట్స్ చేయడం వంటి అంశాలు ఈ టీజర్‌లో ఉన్నాయంటున్నారు. అలాగే, శృంగారంలో 18 ఏళ్లు నిండిన పాఠశాల విద్యార్థులకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, బాలికల ఆత్మహత్యా బెదిరింపులు వంటి అనేక వివాదాస్పద సన్నివేశాలతో ఈ టీజర్ ఉంది. ఇలాంటి చిత్రంపై దర్శకులు వెట్రిమారన్, పా.రంజిత్, నటుడు విజయ్ సేతుపతి మాట్లాడుతూ, మహిళలకు స్వేచ్ఛ అనే పేరుతో వచ్చిన ఈ మూవీ ఒక విప్లవాత్మక సినిమాగా పేర్కొనడాన్ని కూడా పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఇలాంటి సినిమా నిర్మించిన, నటించిన దర్శకనిర్మాతలు, నటీనటులు వారి వారిళ్లల్లో ఉండే ఆడపిల్లలు చెడు తిరుగుళ్ళు తిరిగితే అంగీకరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. కుటుంబ వ్యవస్థతో పాటు తల్లిదండ్రులు - పిల్లల మధ్య సంబంధాలకు హాని కలిగించేలా పాఠశాల, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందంటున్నారు. అందువల్ల ఈ సినిమా విడుదలకాకుండా నిషేధించాలని అనేక మంది డిమాండ్ చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉండటంతో ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. మరి ఈ వివాదంపై మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.