Ajith Kumar Movie: పాలాభిషేకాలతో ఫ్యాన్స్ ‘విడాముయర్చి’ సంబరాలు
ABN , Publish Date - Feb 07 , 2025 | 05:32 PM
రెండేళ్ల తర్వాత అజిత్ కుమార్ నటించిన సినిమా థియేటర్లలోకి వచ్చింది. దీంతో అభిమానులు థియేటర్ల వద్ద పాలాభిషేకాలతో సందడిసందడి చేశారు. గురువారం విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌కు పరిమితమైనప్పటికీ కోలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదల రోజు ప్రభుత్వం కూడా ఈ సినిమాకు సపోర్ట్ అందించింది.
తమ అభిమాన హీరో అజిత్‌కుమార్ నటించిన చిత్రం రెండేళ్ల తర్వాత విడుదల కావడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సినిమా విడుదలైన థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. అజిత్ నటించిన ‘విడాముయర్చి’ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దీంతో థియేటర్ల వద్ద అజిత్ ఫ్యాన్స్ భారీ కటౌట్లు, బ్యానర్లు కట్లి పాలాభిషేకాలు చేశారు. మరికొందరు అభిమానులు సినిమా హిట్ కావాలని కోరుతూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అజిత్ నటించిన ‘తుణివు’ 2023లో విడుదలైంది. గత యేడాది ఒక్క సినిమా కూడా విడుదలకాలేదు.
దీంతో తమ హీరో సినిమా ఎప్పుడు విడదలవుతుందా అంటూ అభిమానుల ఎదురు చూపులకు ఎట్టకేలకు తెరపడింది. ఈ సినిమా మొదటి ఆటను గురువారం తమిళనాడులో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9 గంటలకు ప్రదర్శించారు. ఉదయం 8 గంటలకే థియేటర్లకు చేరుకున్న అభిమానులు బాణసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు.
Also Read- Sankranthiki Vasthunam OTT: ఓటీటీలోకి 'సంక్రాంతికి వస్తున్నాం' ఎక్కడ, ఎప్పుడంటే..
ప్రేక్షకులతో సినిమా చూసిన త్రిష
ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన త్రిష.. చెన్నైలోని ఓ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. అలాగే, మరో హీరోయిన్ రెజీనా కెసాండ్రా, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో పాటు అజిత్ తదుపరి చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’కి దర్శకత్వం వహిస్తున్న ఆధిక్ రవిచంద్రన్, ఈ సినిమాలో మరో కీలక పాత్రను పోషించిన అర్జున్ దాస్ సినిమాను చూసిన వారిలో ఉన్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చితానికి మగిళ్ తిరుమేని దర్శకుడు. యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన విలన్‌గా నటించగా ఆయన ప్రియురాలిగా రెజీనా, సభ్యుడిగా ఆరవ్ నటించారు.
‘విడాముయర్చి’ స్పెషల్ షో’లకు అనుమతి
గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రత్యేక ఆట (స్పెషల్ షో)కు తమిళనాడు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో తొలి ఆటను గురువారం ఉదయం 9 గంటల నుంచి ప్రదర్శించారు. ఫిబ్రవరి 6వ తేదీ మాత్రం 5 ఆటలు ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. హాలీవుడ్ మూవీ ‘బ్రేక్‌డౌన్’కు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు.