Mysskin: మిష్కిన్ ఓ నకిలీ మేధావి.. నటుడు సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 26 , 2025 | 03:43 PM
దర్శకుడు మిష్కిన్‌పై ఓ నటుడు విరుచుకుపడ్డాడు. అతనొక నకిలీ మేధావి అని, ఆయన మాట్లాడే మాటలు, మాట తీరు తనకసలు నచ్చవంటూ సదరు నటుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇప్పుడిదొక కాంట్రవర్సీగా మారింది. ఇంతకీ ఆ నటుడు ఎవరు? ఏమా కథ? అనే వివరాల్లోకి వెళితే..
సినీ దర్శకుడు మిష్కిన్‌పై నటుడు అరుల్‌దాస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మిష్కిన్ ఓ నకిలీ మేధావి అని ఆరోపించారు. హాలీవుడ్ చిత్రాల్లోని సన్నివేశాలను కాపీకొట్టి వాటితో సినిమాలను రూపొందించే నకిలీ మేధావి అని మండిపడ్డారు. పలు సినిమా ఆడియో, ట్రైలర్ వేడుకల్లో పాల్గొనే దర్శకుడు మిష్కిన్ ఇతర నటీనటులు, దర్శకులను సంస్కారహీనంగా మాట్లాడుతుంటారనే ప్రచారం ఉంది. దీనిపై అరుల్‌దాస్ చెన్నై నగరంలో జరిగిన ఓ ఆడియో ఫంక్షన్‌లో పాల్గొని తీవ్రంగా ఖండించడంతో పాటు మిష్కిన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు.
Aslo Read- విమర్శల్ని పట్టించుకోను: ‘గేమ్ చేంజర్’ హీరోయిన్
‘‘ప్రసాద్ ల్యాబ్‌లో అనేక సినీ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రపంచంలోని గొప్ప గొప్ప కళాకారులు ఈ వేదికపై ప్రసంగించివుంటారు. వారంతా మిష్కిన్‌లా మాట్లాడివుండరు. ఎందుకంటే సభా మర్యాద అని ఒకటి ఉందనే విషయం వారికి బాగా తెలుసు. కానీ, మిష్కిన్‌కు ఇది తెలియదు. అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఇటీవల కూడా ‘అవన్‌దాన్ ఇళయరాజా’ (అతనే ఇళయరాజా) అంటూ వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడేందుకు మిష్కిన్‌కు ఉన్న అర్హత ఏంటి? తమిళ చిత్రపరిశ్రమంలో మీరు అంత గొప్పనటులా? ఒక నకిలీ మేధావి.
మిష్కిన్ మాట్లాడిన మాటలు, మాట్లాడే తీరు నాకు ఏమాత్రం నచ్చలేదు. మంచి చిత్రాలను తెరకెక్కించిన ఆయన దర్శకుడుగా గుర్తింపు పొందలేదు. ఇంగ్లీష్ చిత్రాల్లోని సన్నివేశాలు, కంటెంట్‌ను కాపీకొట్టిన సూడో మేధావి మిష్కిన్. ఇది నా మనోవేదన. మిష్కిన్ మాటతీరును తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని నటుడు అరుల్‌దాస్ పేర్కొన్నారు. ఇప్పుడాయన మాటలు కోలీవుడ్‌లో సంచలనంగా మారాయి. అరుల్‌దాస్ వ్యాఖ్యలకు కొందరు సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు నువ్వు కూడా ఇలా ఒక దర్శకుడిని స్టేజ్‌పై అవమానించి.. ఆయనలానే బిహేవ్ చేశావంటూ కామెంట్స్ చేస్తున్నారు.