Sundar C: వినోదాన్ని పంచుతున్న గ్యాంగర్స్ ట్రైలర్...
ABN , Publish Date - Apr 02 , 2025 | 01:59 PM
సుందర్ సి., వడివేలు దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన 'గ్యాంగర్స్' మూవీ ఈ నెల 24న విడుదల కాబోతోంది.
ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు సుందర్ సి. ప్రస్తుతం 'గ్యాంగర్స్' (Gangers) మూవీలో హీరోగా నటిస్తున్నాడు. విశేషం ఏమంటే... 'గ్యాంగర్స్' మూవీలో సుందర్ సి (Sundar C)తో పాటు వడివేలు సైతం కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒకప్పుడు సుందర్ సి దర్శకత్వంలో పలు చిత్రాలలో నటించిన వడివేలు దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత అతనితో చేస్తున్న సినిమా ఇది. వీరిద్దరూ చివరగా 2010 లో 'నగరం మారుపక్కం'లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. దీనికి ముందు సుందర్ సి తొలిసారి లీడ్ రోల్ చేసిన 'తలై నగరం'లో కలిసి నటించారు. ఇక సుందర్ సి. డైరెక్షన్ లో వడివేలు 'విన్నర్, గిరి, లండన్, చిన్నా' తదిదర చిత్రాలు చేశారు. ఇంతకాలానికి వీరు కలిసి నటించిన 'గ్యాంగర్స్' మూవీ ఏప్రిల్ 24న రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
'గ్యాంగర్స్' మూవీలో పీటీ మాస్టర్ గా సుందర్ సి నటిస్తుంటే... అదే పాఠశాలలో అతనికి సీనియర్ గా వడివేలు నటించారు. కేథరిన్ థెస్రా (Catherine Tresa), భగవతి పెరుమాళ్, మైమ్ గోపీ, హరీశ్ పేరడి ఇతర కీలక పాత్రలను చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే... తొంభైలనాటి కామెడీ మూవీస్ గుర్తొస్తున్నాయి. ప్రధాన పాత్రధారులు సుందర్ సి, వడివేలు ఇద్దరూ రకరకాల గెటప్స్ లో కనిపించి ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. ఈ సినిమాను ఎ.సి.ఎస్. అరుణ్ కుమార్ సమర్పణలో కుష్భూ నిర్మిస్తోంది. గత యేడాది వచ్చిన సి. సుందర్ అరణ్మణై -4 (తెలుగులో 'బాక్') రూ. 100 కోట్ల గ్రాస్ ను సాధించి హిట్ చిత్రంగా నిలిచింది. ఇక అప్పుడెప్పుడో విడుదల కావాల్సి ఆగిపోయిన 'మదగజరాజా' మూవీ సైతం ఈ యేడాది సంక్రాంతికి విడుదలై సక్సెస్ అయ్యింది. దాంతో సుందర్ సి 'గ్యాంగర్స్' మీద భారీ ఆశలే నెలకొన్నాయి. ఇదిలా ఉంటే... సుందర్ సి. ప్రస్తుతం నయనతార నాయికగా 'మూకుతి అమ్మన్ -2' సినిమాను చేస్తున్నాడు.
Also Read: Payal Rajput: సెక్సీ హీరోయిన్ మనోవేదన...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి