Vijay: రీ-రిలీజ్ లో సచిన్ నయా రికార్డ్...
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:01 PM
దళపతి విజయ్ ఇరవై యేళ్ళ క్రితం చేసిన 'సచిన్' మూవీ తాజాగా రీ-రిలీజ్ అయ్యింది. ఈ సినిమా నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 15 కోట్ల గ్రాస్ ను వసులు చేసిందని నిర్మాత కలైపులి ఎస్ థాను తెలిపారు.
దళపతి విజయ్ (Vijay) కొత్త సినిమాలే కాదు... పాత సినిమాలు సైతం రీ-రిలీజ్ లో తమ సత్తాను చాటుతున్నాయి. నయా రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. తెలుగులో మహేశ్ బాబు (Maheshbabu), ప్రభాస్ (Prabhas) సినిమాలకు రీ-రిలీజ్ ఉంటున్న క్రేజ్ తమిళనాట విజయ్ సినిమాలకు దక్కుతోంది. మహేశ్ బాబు సినిమాలు గత యేడాది కాలంగా విపరీతంగా రీ-రిలీజ్ అవుతున్నాయి. అలానే ప్రభాస్ సినిమాలు వస్తున్నాయి. ఇదే దారిలో ఇతర స్టార్ హీరోల సినిమాలను అభిమానుల కోసం రిలీజ్ చేస్తున్నారు. అయితే రీ-రిలీజ్ సమయంలో ఎక్కువ థియేటర్ల జోలికి పోకుండా, ఎక్కువ కేంద్రాలలో విడుదల చేయకుండా ఎంపిక చేసిన థియేటర్లలోనే వీలైనంత వరకూ సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్నారు. అయినా వాటికి మంచి ఆదరణే లభిస్తోంది. మహేశ్ బాబు, రాజమౌళి (Rajamouli) సినిమాకు కమిట్ అయిన దగ్గర నుండి తమ అభిమాన హీరో సినిమాను ఎన్ని సంవత్సరాలకు చూస్తామో అనే బెంగ అభిమానుల్లో పెరిగిపోయింది. దీనిని సాకుగా తీసుకుని పరాజయం పాలైన 'బ్రహ్మోత్సవం' సినిమాను సైతం విడుదల చేయడానికి మేకర్స్ సిద్థపడుతున్నారు.
ఇదిలా ఉంటే... ఇక్కడ మహేశ్ కు ఉన్న క్రేజే తమిళనాట విజయ్ కూ ఉంది. విజయ్ ఇకపై సినిమాలకు స్వస్తి పలికి రాజకీయాలపై పూర్తి దృష్టి పెట్టబోతున్నట్టు ప్రకటించాడు. అతని చివరి సినిమా 'జన నాయగన్' (Jana Nayagan) వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఇక విజయ్ నటించిన సినిమా 'గోట్' (Goat) లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 5న విడుదలైంది. ఈ యేడాది అతని చిత్రమేదీ విడుదల కావడం లేదు. ఆ లోటును తీర్చడానికి విజయ్ పాత సినిమాలను విడుదల చేస్తున్నారు నిర్మాతలు. అందులో భాగంగానే ప్రముఖ నిర్మాత కలై పులి ఎస్ థాను 2005లో తాను విజయ్ తో తీసిన 'సచిన్' చిత్రాన్ని ఏప్రిల్ 18న రీ-రిలీజ్ చేశారు.
'సచిన్' సినిమా విషయానికి వస్తే... ప్రముఖ తమిళ రచయిత, దర్శకుడు మహేంద్రన్ కొడుకు జాన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా తెలుగులో వచ్చిన 'నాతో' సినిమాకు రీమేక్. ఈ సినిమాలో కె. రాఘవేంద్రరావు తనయుడు సూర్యప్రకాశ్ హీరోగా నటించాడు. రామోజీరావు ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతం అందించాడు. ఇదే సినిమాను కొన్ని మార్పులు చేర్పులతో 'సచిన్'గా తమిళంలో రీమేక్ చేసినప్పుడు దేవిశ్రీ ప్రసాద్ అక్కడ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాతో బిపాసా బసు కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఏప్రిల్ 14, 2005లో విడుదలైన 'సచిన్' ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఆ చిత్రం విడుదలై ఇరవై సంవత్సరాలు అయిన సందర్భంగా కలైపులి ఎస్ థాను రీ-రిలీజ్ చేస్తే... ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా రూ. 15 కోట్ల గ్రాస్ ను వరల్డ్ వైడ్ కలెక్ట్ చేసింది. రెండోవారం కూడా ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితం కాబోతోందని కలైపులి ఎస్ థాను తెలిపారు. మొత్తానికి ఇరవై యేళ్ళ నాటి విజయ్ సినిమాలను కూడా జనాలు ఆదరిస్తూనే ఉన్నారు.
Also Read: Ajith: కార్ రేసర్ గా ద్వితీయస్థానంలో...
Also Read: AISF: అల్లు అర్జున్, శ్రీలీలపై క్రిమినల్ కేసులు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి