Ram Charan: ఇదీ అసలైన గేమ్ ఛేంజర్
ABN , Publish Date - Jan 01 , 2025 | 12:47 AM
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్)పై రామ్ చరణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(MODI) ప్రకటించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్-Waves 2025)పై రామ్ చరణ్ (Ram charan) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ప్ఘ్రభుత్వం.. మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలను ప్రోత్సహించడం ఆనందంగా ఉంది. చిత్ర పరిశ్రమ సహకారానికి ‘వేవ్స్ 2025’ అసలైన గేమ్ ఛేంజర్ కానుంది’’ అని పేర్కొన్నారు. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ను 2025లో నిర్వహించునున్నట్టు ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో ప్రఽధాని తెలిపారు. ఈ సమావేశాల్లో ప్రపంచ దేశాల మీడియా , వినోద రంగాల ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు. ఇప్పటికే భారతీయ చలన చిత్ర పరిశ్రమ వైపు ప్రపంచమంతా చూస్తోందన్నారు. భారతదేశాన్ని ప్రపంచానికే ఓ కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో ఏర్పాటు కానున్న వేవ్స్‌పై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. అది అద్భుతమైన ఆలోచన అని, మీడియా, వినోద రంగాన్ని ప్రోత్సహించడం పట్ల ప్రధాని దార్శనికత అభినందించదగ్గది అని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. ‘ఆ వేడుకకు ప్రపంచం కలిసి రావడాన్ని చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని అనిల్ కపూర్ అన్నారు. చిత్ర పరిశ్రమలో వేవ్స్ మరో మైలురాయి అంటూ ఖుష్బూ, సంజయ్ దత్, ఏక్తా కపూర్ తదితరులు మోదీని కొనియాడారు. 2025 ఫిబ్రవరి 5నుంచి 9 వరకు వేవ్స్ నిర్వహించనున్నారు. ఢిల్లీ వేదిక కానుంది.