Prithviraj Sukumaran Mother: నా బిడ్డను బలిపశువును చేయాలని చూస్తున్నారు..
ABN , Publish Date - Mar 31 , 2025 | 05:25 PM
తాజాగా దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక ఈ వివాదంపై స్పందించారు. తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
మలయాళ హిట్ చిత్రం 'లూసిఫర్'కు కొనసాగింపుగా వచ్చిన చిత్రం ‘ఎల్2: ఎంపురాన్’ (L2: empuraan) . మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj sukumaran) దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన రోజు నుంచే వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే హీరో మోహన్‌లాల్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పారు. తాజాగా దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక (Prithviraj sukumaran Mother Mallika) ఈ వివాదంపై స్పందించారు. తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
‘‘ఈ విషయంపై స్పందించకూడదనుకున్నాడు. నా బిడ్డని కించపరిచేలా తప్పుడు కథనాలు చూసి బాధతో పోస్ట్ పెట్టాను. ఎల్2:ఎంపురాన్’ తెర వెనక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలుసు. పృథ్వీరాజ్ సుకుమారన్‌ను అన్యాయంగా నిందిస్తున్నారు. తప్పుడు కథనాలు రాస్తున్నారు. వాటిని చూసి ఓ తల్లిగా ఆవేదన చెందుతున్నా. మోహన్‌లాల్, చిత్ర నిర్మాతలు ఎవరూ తమను పృథ్వీరాజ్ మోసం చేశాడని చెప్పలేదు. మోహన్‌లాల్ నాకు ఎన్నో రోజులుగా తెలుసు. తను నా తమ్ముడితో సమానం. నా కుమారుడిని ఎన్నో సందర్భాల్లో ప్రశంసించాడు. ఇప్పుడు ఆయనకు, నిర్మాతలకు తెలియకుండా కొందరు నా కుమారుడిని బలిపశువును చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అతడు ఎవరినీ మోసం చేయలేదు.
ఈ సినిమాలో సమస్యలు ఉన్నాయంటే ఇందులో భాగమైన అందరికీ బాధ్యత ఉంటుంది. వారంతా కథ చదివారు. చిత్రీకరణ సమయంలో ఉన్నారు. అందరి ఆమోదంతోనే సినిమాగా తీశారు. రచయిత కూడా ఎప్పుడూ పక్కనే ఉన్నారు. అవసరమైతే డైలాగుల్లో మార్పులు చేసేవారు. కానీ, సినిమా విడుదలయ్యాక పృథ్వీరాజ్ మాత్రమే జవాబుదారీ ఎలా అవుతాడు?. మోహన్‌లాల్‌కు తెలియకుండా ఇందులో కొన్ని సన్నివేశాలు జోడించారంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఆయన కూడా సినిమా చూశారు. నా కుమారుడు ఎప్పుడూ ఎవరి వ్యక్తిగత నమ్మకాలను వ్యతిరేకించలేదు.. అలా ఎప్పటికీ చేయడు. నా బిడ్డ ఏంటో నాకు తెలుసు’’ అని మల్లిక పోస్ట్‌లో పేర్కొన్నారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది.