Pradeep Ranganathan: వైరల్ గా మారిన 'డ్రాగన్' ప్రదీప్ ట్వీట్!
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:37 PM
ఎనిమిదేళ్ళ క్రితం తాను తీసిన షార్ట్ ఫిల్మ్ ను చూడమంటూ ధనుష్ కు ట్వీట్ చేశాడు ప్రదీప్ రంగనాథన్. ఇవాళ అతను హీరోగా నటించిన 'డ్రాగన్' మూవీ, ధనుష్ డైరెక్ట్ చేసిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా'కు గట్టి పోటీని ఇచ్చి, పైచేయి సాధించింది.
ప్రదీప్ రంగనాథన్... (Pradeep Ranganathan) ఈ పేరు కోలీవుడ్ లో కొంతకాలం పాటు యాదికుంటాది. ఎందుకంటే... షార్ట్ ఫిల్మ్ మేకర్ గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత దర్శకుడిగా ఎదిగాడు ప్రదీప్ రంగనాథన్. అంతేకాదు... తన రెండో సినిమాకే స్వీయ దర్శకత్వంలో హీరోగానూ నటించాడు. ఆ సినిమా తెలుగులో డబ్ కావడమే కాదు... హిందీలో రీమేక్ అయ్యింది. విశేషం ఏమంటే... ఆ హిందీ మూవీలో అటు ఆమీర్ ఖాన్ కొడుకు, ఇటు శ్రీదేవి కూతురు హీరోహీరోయిన్లుగా నటించారు. అదే 'లవ్ యాపా' (Loveyapa).
ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా 'కోమలి' (Comali). రవి మోహన్ (Ravi Mohan) హీరోగా నటించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) హీరోయిన్. ఇది మంచి విజయం సాధించింది. దర్శకుడు ప్రదీప్ లో మంచి నటుడు కూడా ఉన్నాడు. అందుకే రెండో సినిమా 'లవ్ టుడే' (Love today) లో తనే హీరోగా నటించాడు. అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దాంతో తెలుగులో డబ్ చేయడంతో పాటు, దానిని హిందీలో 'లవ్ యాపా' రీమేక్ చేశారు. హిందీ మూవీకి ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించకపోయినా... నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. బట్... ఈ మూవీ ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. సో... నిర్మాతగా ప్రదీప్ ఫెయిల్యూర్ ను మూటగట్టుకున్నాడు. చిత్రం ఏమిటంటే... ఆ తర్వాత రెండు వారాలకే వచ్చిన 'డ్రాగన్'లో ప్రదీప్ రంగనాథన్ తిరిగి హీరోగా నటించాడు. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఒకేరోజు విడుదలై, సూపర్ డూపర్ రెస్పాన్స్ సంపాదించుకుంది. సో... 'లవ్ యాపా' ఫెయిల్యూర్ ను మర్చిపోతూ ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.
వైరల్ గా మారిన ప్రదీప్ రంగనాథన్ ఓల్డ్ ట్వీట్!
చిత్రం ఏమంటే... ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమా విజయాన్ని ఆస్వాదించడం వెనుక మరో ప్రత్యేక కారణం ఉంది. అది ధనుష్ (Dhanush) తో లింక్ అయ్యి ఉంది. ప్రదీప్ రంగనాథన్ కు నటుడు ధనుష్ అంటే ఎంతో అభిమానం. తను కెరీర్ ప్రారంభంలో తీసిన షార్ట్ ఫిల్మ్ ను ధనుష్ కు చూపించాలని తాపత్రయపడుతుండే వాడు. ఏడేళ్ళ క్రితం హీరో సూర్య (Surya) కు చెందిన 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పెడితే, అందులో ప్రదీప్ రంగనాథన్ పాల్గొని, విన్నర్ గా నిలిచాడు. ఆ షార్ట్ ఫిల్మ్ ను చూడాల్సిందిగా ట్విట్టర్ వేదికగా ధనుష్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. దానిని ధనుష్ చూశాడా, చూసి స్పందించాడా? లేదా? అనేది తెలియదు కానీ... ఇవాళ ధనుష్ డైరెక్ట్ చేసిన మూవీకే ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన మూవీ గట్టి పోటీ ఇచ్చింది. అంతేకాదు... దానిపైన పైచేయిని సాధించింది.
'పా పాండి, రాయన్' చిత్రాలను డైరెక్ట్ చేసిన ధనుష్... మూడో డైరెక్టోరియల్ వెంచర్ గా 'నిలవుకు ఎన్ మెల్ ఎన్నడి కోబం' మూవీని తీశాడు. దీనితో తన మేనల్లుడు పవిష్ ను హీరోగా పరిచయం చేశాడు. ధనుష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫిబ్రవరి 21న తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. ప్రదీప్ రంగనాథన్ నటించిన 'డ్రాగన్' మూవీ కూడా అదే రోజు రిలీజ్ అయ్యింది. అంటే ధనుష్, ప్రదీప్ రంగనాథన్ మూవీస్ ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయన్నమాట. ఈ రెండు సినిమాలకూ పాజిటివ్ టాక్ వచ్చినా... ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా, అశ్వత్ మరిముత్తు డైరెక్ట్ చేసిన 'డ్రాగన్'దే కలెక్షన్స్ విషయంలో అగ్రస్థానంలో నిలిచింది. సో... నిజంగా ఇది ప్రదీప్ రంగనాథన్ కు హైటైమ్ అని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అప్పట్లో ధనుష్ ను ఉద్దేశిస్తూ, ప్రదీప్ రంగనాథన్ పెట్టిన ట్వీట్ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.