Nayanthara: కమల్, అజిత్ ను ఫాలో అవుతున్న నయన్!

ABN , Publish Date - Mar 05 , 2025 | 03:03 PM

పేరు ముందు బిరుదులు పెట్టుకోవడాన్ని కొందరు ఆస్వాదిస్తారు. కానీ కొందరైతే... అలాంటి బిరుదుల పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు. మొన్న కమల్, నిన్న అజిత్, నేడు నయన్. అదే బాటలో సాగుతున్నారు.

ఒకప్పుడు నటీనటులకు తమకు పెద్దవారు ఇచ్చే బిరుదులను ఆదరంగా స్వీకరించి, గొప్పగా చెప్పుకునే వారు. ఆ తర్వాత అభిమానులు ప్రేమతో ఇచ్చే బిరుదులనూ స్వీకరించడం మొదలు పెట్టారు. కొందరైతే దర్శక నిర్మాతలకు సూచన చేసి మరీ బిరుదులను పొందిన వారూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సినిమా రంగంలో సేవ చేసిన వారికి గుర్తింపుగా పద్మశ్రీ (Padmasri) పురస్కారాలను ప్రకటిస్తూ ఉంటుంది. అయితే అది బిరుదు కాదనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. సినిమా టైటిల్స్ కార్డుల్లో పేరు ముందు పద్మశ్రీ అనే పదాన్ని బిరుదులా ఉపయోగించడం నిషిద్థం. కావాలనుకుంటే సదరు వ్యక్తి 'పద్మశ్రీ పురస్కార గ్రహీత' అని పేరు ముందు వేసుకోవచ్చు. అయితే... ప్రభుత్వం ఇచ్చే పద్మ పురస్కారాల కంటే... స్టార్ హీరోలకు, హీరోయిన్లకు, దర్శకులకు అభిమానులు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇచ్చే బిరుదులంటే భలే ఇష్టం. ఎలాంటి సంకోచం లేకుండా ఆ బిరుదులను సినిమా టైటిల్స్ కార్డుల్లోనూ, మీడియాకు ఇచ్చే ప్రెస్ నోట్స్ లోనూ వాడేసుకుంటారు.

ఇటీవల ఇలాంటి బిరుదల పట్ల, అభిమానులు తమ పేర్ల ముందు చేర్చుతున్న విశేషణాల పట్ల కొందరు నటీనటులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. తమను పేరుతో సంభోదిస్తే చాలని, ప్రత్యేకమైన బిరుదలను పెట్టవద్దని బహిరంగంగా అభిమానులను వేడుకుంటున్నారు. ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత కమల్ హాసన్ (Kamal Hassan) ను కొంతకాలంగా ఉళగనాయకన్ అనే పేరుతో సంభోదిస్తు్న్నారు. అయితే... తనకు అలాంటి బిరుదులు తగిలించుకోవడం ఇష్టం లేదని కమల్ హాసన్ ఇటీవల స్పష్టం చేశారు. అలానే తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith) ను ఫ్యాన్స్ ప్రేమతో 'తల' అని పిలుస్తుంటారు. అజిత్ కూడా ఇటీవల అభిమానులకు ఓ ఓపెన్ లెటర్ రాసి... అతను అజిత్ అని పిలిస్తే చాలని అన్నారు.


ఇప్పుడు అదే బాటలో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) కూడా నడుస్తోంది. గత కొంతకాలంగా సౌతిండియన్ సూపర్ స్టార్ అనే పేరును నయన్ కు విశేషణంగా తగిలించారు. ఆమె ఇటీవల ఉత్తరాదిలోకీ అడుగుపెట్టి, అక్కడా 'జవాన్' సినిమాతో తన సత్తాను చాటింది. దాంతో ఉత్తరాది వారు సైతం నయన్ ను 'లేడీ సూపర్ స్టార్' అనడం మొదలైంది. అయితే... తన పేరు ముందు ఇలాంటివేవీ ఇక మీద పెట్టవద్దని నయనతార ఓ బహిరంగ లేఖను విడుదల చేసింది. నయన్ అనే పేరే తన మనసుకు ఎంతో దగ్గరగా ఉంటుందని, అందువల్ల అదే పేరుతో తనను సంభోదించమని ఆమె కోరింది. ''రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ అభిమానుల ప్రేమ నాకు ఎప్పుడూ ఉంటుందని భావిస్తున్నాను. వారికి వినోదం పంచడానికి నేను ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉంటాను. సినిమా అనేది మనందరినీ కలిపింది. దానిని అందరం కలిసి ఆస్వాదిద్దాం' అని నయన్ ఆ లేఖలో పేర్కొంది. ఇక సినిమాల విషయానికి వస్తే నయనతార 'ముక్కుత్తి అమ్మన్ -2 (Mookuthi Amman 2) , రక్కాయి (Rakkayie), మన్నన్గట్టి సిన్స్ 1960, టెస్ట్' తదితర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది.

Also Read: Sandeep Reddy: కన్సీవ్ సమస్యతో సంతాన ప్రాప్తిరస్తు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 05 , 2025 | 03:03 PM