Malayali Writer: ట్రిపుల్ ఆర్ రైటర్ మృతి... రాజమౌళి సంతాపం
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:42 AM
ప్రముఖ మలయాళీ గీత, సంభాషణల రచయిత గోపాలకృష్ణన్ అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల మలయాళ వర్షన్స్ కు ఆయన రచన చేశారు.
ప్రముఖ మలయాళీ గీత రచయిత మంకొంబు గోపాలకృష్ణన్ (Mankombu Gopalakrishna) (78) అనారోగ్యంతో మార్చి 17వ తేదీ కొచ్చిలో కన్నుమూశారు. దాదాపు 200 చిత్రాలలో ఆయన 700లకు పైగా పాటలను రాశారు. అలానే పలు చిత్రాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. వివిధ భాషల నుండి మలయాళంలోకి అనువాదమైన చిత్రాలకు ఆయన ఎక్కువ పని చేశారు.
మంకొంబు గోపాలకృష్ణన్ మృతి పట్ల ప్రముఖ దర్శకులు రాజమౌళి (Rajamouli) సంతాపం వ్యక్తం చేశారు. రాజమౌళి రూపొందించిన 'ఈగ (Eega), బాహుబలి (Baahubali), ట్రిపుల్ ఆర్ (RRR)'' వంటి చిత్రాల మలయాళ వర్షన్ కు గోపాలకృష్ణన్ మాటలు, కొన్ని పాటలు రాశారు. 1976లో ఎమర్జెన్సీ సమయంలో ఆయన రాసిన ఓ పాట కారణంగా అరెస్ట్ కు గురవుతానేమోనని ఆయన భయపడ్డారట. అయితే అదే సమయంలో సినిమా రంగానికి చెందిన ఓ మిత్రుడి సలహాతో ఇందిరాగాంధీ ప్రవేశ పెట్టిన 20 సూత్రాల ఆర్థిక పధకం మీద కూడా పాట రాయడంతో ఆయన అరెస్ట్ కాకుండా తప్పించుకోగలిగారని సన్నిహితులు చెబుతుంటారు.
Also Read: Megastar: చిరంజీవికి ముద్దులతో స్వాగతం!
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి