Karnataka DCM: నటీనటుల తీరు మారకపోతే..  ఎలా సరిచేయాలో తెలుసు..

ABN , Publish Date - Mar 03 , 2025 | 07:07 PM

నేషనల్‌ క్రష్‌ రష్మికపై కర్ణాటకలోని మండ్యాకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రవి గనిగ ఫైర్‌ అయ్యారు, ఆమె తీరును విమర్శిస్తూ తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో పలు వ్యాఖ్యలు చేశారు.


నేషనల్‌ క్రష్‌ రష్మికపై (Rashmika) కర్ణాటకలోని మండ్యాకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రవి గనిగ ఫైర్‌ (Congress Mla Fire) అయ్యారు, ఆమె తీరును విమర్శిస్తూ తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో పలు వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఆమె అంగీకరించలేదని ఆరోపించారు. ఆమెకు సరైన గుణపాఠం చెప్పాలని అన్నారు. కెరీర్‌ను ఇచ్చిన ఇండస్ర్టీని గౌరవించడం ఆమె తెలుసుకోవాలని ఆయన అన్నారు.  

‘‘కిరిక్‌ పార్టీ’ సినిమాతో కెరీర్‌ ప్రారంభించారు నటి రష్మిక. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు హాజరు కావాలని కోరుతూ గతేడాది మేము ఎన్నోసార్లు ఆమెను సంప్రదించాం. ఆమె రానని.. కర్ణాటక వచ్చేంత సమయం తనకు లేదని చెప్పింది. అంతేకాకుండా, మా ఇల్లు హైదరాబాద్‌లో ఉంది. కర్ణాటక ఎక్కడో నాకు తెలియదు అన్నట్లు ఆమె మాట్లాడింది. నాకు తెలిసిన మరి కొంత మంది కూడా సుమారు పది సార్లు ఆమెను కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కానీ ఆమె మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. కన్నడ చిత్ర పరిశ్రమ భాష పట్ల ఆమె అగౌరవంగా వ్యవహరిస్తున్నారు. ఆమెకు సరైన పాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?’’ అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

బెంగళూరు వేదికగా జరుగుతోన్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ప్రారంభోత్సవం కార్యక్రమంలో నటీనటులు పాల్గొనకపోవడంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నటీనటులు దర్శక నిర్మాతలు ఒకే తాటి మీదకు రావాలి. రాష్ట్రంలో జరిగిన కీలక కార్యక్రమాల్లో పాల్గొనాలి. అలా కానిపక్షంలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం వల్ల ప్రయోజనం ఏమిటి? సినిమా పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు కూడా ఎంతో అవసరం అని అందరూ గుర్తుంచుకోవాలి’’ అని వ్యాఖ్యలు చేశారు. నటీనటుల తీరు మారకపోతే వారిని ఏ విధంగా సరిచేయాలో కూడా తనకు తెలుసన్నారు ముఖ్యమంత్రి.

Updated Date - Mar 03 , 2025 | 07:31 PM