L2 Empuraan Writer: ఎవరికి నచ్చింది వాళ్లు మాట్లాడుకోండి..

ABN , Publish Date - Mar 29 , 2025 | 05:18 PM

మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎల్‌2: ఎంపురాన్‌’. ఈ సినిమాలోని పలు సన్నివేశాలు వివాదానికి దారి  తీశాయి.

మోహన్‌లాల్‌(Mohan Lal) ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Pruthviraj Sukumaran) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎల్‌2: ఎంపురాన్‌’ (L2 Empuraan) . ఈ సినిమాలోని పలు సన్నివేశాలు వివాదానికి దారి  తీశాయి. దీనిపై తాజాగా చిత్ర రచయిత మురళీ గోపీ (Murali Gopi) స్పందించారు. ‘‘ఈ కాంట్రవర్సీ గురించి నేను పూర్తిగా మౌనంగా ఉండాలనుకుంటున్నా. వాళ్లకు నచ్చిన విధంగా అనుకోనివ్వండి. ఒక సినిమాని తమకు నచ్చిన విధంగా ఊహించుకునే హక్కు ప్రతిఒక్కరికీ ఉంది. కాబట్టి.. వాళ్లకు నచ్చిన విధంగా ఊహించుకోనివ్వంచిడి. నేను మాత్రం మౌనంగానే ఉంటాను’’ అని అన్నారు. అదే విధంగా ఆయన వామపక్ష  భావజాలం ఉన్న సంస్థలపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  2019లో విడుదలైన ‘లూసిఫర్‌’లో భాగంగా ‘ఎల్‌ 2: ఎంపురాన్‌’ సిద్థమైంది. స్టీఫెన్‌ గట్టుపల్లిగా మోహన్‌లాల్‌, జతిన్‌ రామ్‌దాస్‌గా టొవినో థామస్‌, బాబా  భజరంగీగా అభిమన్యు సింగ్‌ నటించారు. ఎన్నో అంచనాల మధ్య గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఇందులో పలు సన్నివేశాలు విషయంలో  తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది.

2002లో గుజరాత్‌లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఇందులో కీలక సన్నివేశాలుగా చూపించారు. అల్లర్ల సమయంలో సయ్యద్‌ మసూద్‌ కుటుంబాన్ని ఒక వర్గానికి చెందిన నాయకుడు దారుణంగా హత్య చేయడం.. కొంతకాలానికి అతడే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం వంటి అంశాలతో సాగిన ఈ సన్నివేశాలను పలువురు తప్పుపడుతున్నారు. ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపించేలా ఈ సీన్స్‌ ఉన్నాయని కామెంట్‌ చేస్తున్నారు. పృథ్వీరాజ్‌ దర్శకత్వాన్ని విమర్శిస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిలిపివేయాలని వామపక్ష వాదులు డిమాండ్‌ చేస్తున్నారు. ‘ఎల్‌2: ఎంపురాన్‌’ కలెక్షన్ల పరంగానూ 48 గంటల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించిందని టీమ్‌ పేర్కొంది.  మోహన్‌లాల్‌ ఈ విషయాన్ని తాజాగా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. 

Updated Date - Mar 29 , 2025 | 05:19 PM