HBD Siva Karthikeyan: శివకార్తికేయన్ బహుముఖ ప్రజ్ఞ

ABN , Publish Date - Feb 17 , 2025 | 04:14 PM

శివకార్తికేయన్ కు సినిమా బ్యాగ్రౌండ్ ఏమీ లేదు. సినిమాల పట్ల ఆసక్తితో చిన్నప్పటి నుంచీ మిమిక్రీ చేస్తూ స్కూల్ లో ఆకట్టుకున్నాడు. తరువాత అదే అతనికి చిత్రసీమలో ఆదరువు అయింది.

ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టుకు వచ్చి పట్టం కట్టడంలో ముందుంటారు తెలుగువారు. అలా ఈ మధ్యకాలంలో తెలుగువారి అభిమానం చూరగొన్న తమిళ హీరో ఎవరంటే శివకార్తికేయన్ అనే చెప్పాలి. గత యేడాది శివకార్తికేయన్ నటించిన 'అమరన్' (Amaran) తమిళంతో పాటు తెలుగులోనూ విజయఢంకా మోగించింది. అలాగే తెలుగు చిత్రం 'కౌసల్యా కృష్ణమూర్తి' (Kausalya Krishnamurthy) లో కీలక పాత్ర ధరించారు శివకార్తికేయన్.  'అమరన్' చిత్రం 300 కోట్లు పోగేయడంతో తమిళ టాప్ స్టార్స్ సరసన చేరిపోయారు శివ కార్తికేయన్. ఫిబ్రవరి 17న నలభై ఏళ్ళు పూర్తి చేసుకున్న శివకార్తికేయన్ పట్టుదల చూస్తే అది భావితరాలకు ఓ స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.


Shiva-karthikeyana-BDay.jpg

ఇంతకూ కథేమిటంటే - శివకార్తికేయన్ కు సినిమా బ్యాగ్రౌండ్ ఏమీ లేదు. సినిమాల పట్ల ఆసక్తితో చిన్నప్పటి నుంచీ మిమిక్రీ చేస్తూ స్కూల్ లో ఆకట్టుకున్నాడు. తరువాత అదే అతనికి చిత్రసీమలో ఆదరువు అయింది. కొందరు స్టార్స్ కు తమిళంలో డబ్బింగ్ చెప్పారు. ఆ పై నటునిగా ప్రయత్నం చేస్తే కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో మిస్ అయ్యాయి. కొన్నిట్లో ఏదో చిన్న రోల్ అయినా చేద్దామని ఆశిస్తే, సదరు చిత్రాల్లోని క్యారెక్టర్స్ ఎడిటింగ్ కత్తెరకు గురయ్యాయి. అయినా పట్టువదలని విక్రమార్కునిలా ముందుకు సాగి యాంకర్ గా తమిళ ప్రేక్షకుల మన్ననలు పొందిన శివ కార్తికేయన్ ప్రస్తుతం తన బహుముఖ ప్రజ్ఞతో అలరిస్తున్నారు. తొలిసారి 'మెరీనా' సినిమాతో తెరపై కనిపించిన శివకార్తికేయన్ 'రెమో' డబ్బింగ్ మూవీతో తెలుగువారిని ఆకట్టుకున్నారు. అప్పటినుంచీ తెలుగులోనూ మెల్లగా తన మార్కెట్ పెంచుకుంటూ వస్తున్నారు శివకార్తికేయన్. నటునిగా పదమూడేళ్ళ ప్రయాణం పూర్తి చేసుకున్న శివకార్తికేయన్ గాయకునిగా, గీత రచయితగా, నిర్మాతగా విజయం సాధించారు. త్వరలోనే మెగాఫోన్ పట్టే ప్రయత్నంలోనూ శివ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 200 కోట్ల బడ్జెట్ తో మురుగుదాస్ దర్శకత్వంలో ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న 'మదరాసి' సినిమాలో నటిస్తున్నాడు.  అలాగే సుధ కొంగర దర్శకత్వంలో 'పరాశక్తి'లోనూ నటిస్తున్నాడు. ఫిబ్రవరి 17న బర్త్ డే జరుపుకున్న శివ కార్తికేయన్ పై అభినందన జల్లులు కురిశాయి. ఆ జల్లుల్లో కమల్ హాసన్ ఆశీస్సులూ ఉండడం విశేషం! పలువురు తెలుగు చిత్రసీమ ప్రముఖులు సైతం శివకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. మరి రాబోయే రోజుల్లో శివ ఏ తెలుగు సినిమాతో ముందుగా పలకరిస్తారో చూడాలి. ఏ చిత్రంతో దర్శకునిగా జనాన్ని మెప్పిస్తారో చూద్దాం.

Updated Date - Feb 17 , 2025 | 04:15 PM