Sanvi Sudeep: డాడీ ప్లేస్ భర్తీ చేయబోతున్న స్టార్ డాటర్

ABN , Publish Date - Mar 15 , 2025 | 12:21 PM

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇక నటనకు స్వస్తి చెప్పాలని భావిస్తున్నాడు. అయితే అతని స్థానాన్ని భర్తీ చేసే పనిలో సుదీప్ కూతురు సాన్వీ ఉంది. నటిగా తన అదృష్టం పరీక్షించుకోవాలని సాన్వీ తహతహలాడుతోంది.

పాలిటిక్స్, బిజినెస్ తర్వాత వారసులు ఎక్కువగా ఉండేది సినిమా రంగంలోనే! అయితే ఈ మూడు చోట్ల కూడా కఠోర శ్రమ చేసే వారే విజయపథంలోకి అడుగుపెడతారు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ డాటర్ కూడా ఇప్పుడు తండ్రి అడుగు జాడల్లో సినిమా రంగంలోకి అడుగు పెట్టబోతోంది. చిత్రం ఏమంటే... ఇటీవలే సుదీప్ (Sudeep) తన తాజా చిత్రం ప్రమోషన్స్ టైమ్ లో 'తాను సినిమా రంగం నుండి వైదొలుగుతాన'ని చెప్పాడు. మరీ ముఖ్యంగా నటనకు స్వస్తి చెబుతానన్నాడు. అతను నటించిన 'మ్యాక్స్' (Max) సినిమా ప్రమోషన్స్ లో సుదీప్ ఈ మాట చెప్పాడు. నిజానికి తాను అలసిపోలేదని, కానీ ఏదో ఒక రోజు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే కదా! అంటూ మాట్లాడాడు. అయితే అతని విరమణ వార్త వైరల్ అయిన నేపథ్యంలో సుదీప్ తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చని కొందరు సన్నిహితులు చెబుతున్నారు. సుదీప్ యధాలాపంగా అన్న ఆ మాటలను మరీ అంత సీరియస్ గా తీసుకోనక్కర్లేదని, అతనికి ఏమంత వయసు మీద పడలేదని అభిమానులూ అభిప్రాయపడుతున్నారు.


ఇదిలా ఉంటే... సుదీప్ ను రీప్లేస్ చేసే పని అతని కూతురు సాన్వీ (Sanvi) చేయబోతోంది. నిజానికి సాన్వీకి తాను 'సుదీప్ డాటర్' అనే ట్యాగ్ లైన్ వేసుకోవడం ఇష్టం ఉండదు. తనకంటూ ఓ గుర్తింపు లభించాలని, తన వ్యక్తిగత ప్రతిభను జనాలు గుర్తించాలని కోరిక. ఆ ఉద్దేశ్యంతోనే కొన్ని నెలల పాటు హైదరాబాద్ లోనే ఫిల్మ్ మేకింగ్ అండ్ యాక్టింగ్ కు సంబంధించిన వర్క్ షాప్ లోనూ పాల్గొన్నదట. సాన్వీకి కేవలం నటిగా మారాలనో, హీరోయిన్ అయిపోవాలనో కోరిక లేదట. తాను చాలా లావుగా ఉంటానని, తెర మీద అందంగా కనిపించడం కోసం కొద్ది రోజులుగా డైటింగ్ చేస్తున్నానని తెలిపింది. నటనకు ప్రాధాన్యం ఉన్న ఏ పాత్ర అయినా చేస్తానని చెబుతున్న సాన్వీ కెమెరా ముందే కాకుండా వెనుక సైతం పనిచేయాలని తాపత్రయపడుతోంది. అందులో భాగంగా దర్శకత్వ శాఖపైనా దృష్టి పెట్టింది. ఏదేమైనా... నటిగా వచ్చే గుర్తింపు వేరు అనే విషయం ఆమెకు తెలియనిది కాదు... పైగా తండ్రి సుదీప్ స్టార్ డమ్ ను చాలా దగ్గరగా చూసిన వ్యక్తి. సో... ఫైనల్ గా సాన్వీ వెండితెర మీదనే అలరిస్తుందని అంతా అనుకుంటున్నారు. ఇప్పటికే సుదీప్ అభిమానులు ఆమెను ప్రేమతో చిత్రసీమలోకి స్వాగతం పలుకుతున్నారు. మరి తండ్రి ఆశీస్సులతో సాన్వీ ఎప్పుడు తెరంగేట్రమ్ చేస్తుందో చూడాలి.

Also Read: Sunny Deol: ఆ ఇద్దరు నిర్మాతలకు చెయ్యిచ్చిన సన్నీ డియోల్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 15 , 2025 | 12:22 PM