Ram Charan: 'గేమ్ ఛేంజర్' పై కార్తిక్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 24 , 2025 | 10:48 AM

'గేమ్ ఛేంజర్'కు కథను అందించిన కార్తీక్ సుబ్బరాజు యూ టర్న్ తీసుకున్నారు. బేసిక్ పాయింట్ మాత్రమే తనదని, దానిని శంకర్ టీమ్ డెవలప్ చేసిందని తెలిపాడు.

సక్సెస్ ను ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకుంటారు. అదే పరాజయాన్ని మాత్రం పక్కవారి మీదకు తోసేస్తుంటారు. సహజంగా ఏదైనా సినిమా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ లో అత్యధిక శాతం హీరోకు దక్కుతుంది. ఆ తర్వాత దర్శకుడికి, చివరకు నిర్మాతకు. కానీ చిత్రంగా సినిమా ఫెయిల్ అయితే అత్యధికంగా నష్టపోయేది మాత్రం నిర్మాతే. మంచి కథను ఎంచుకున్నా, దానికి తగ్గ తారాగణాన్ని తీసుకున్నా... దర్శకుడు దానికి సరిగా టేకిల్ చేయకపోతే పరాజయం తప్పదు. నిర్మాత కోట్లు ఖర్చుపెట్టినా... అదంతా బూడిదలో పోసిన పన్నేరే అవుతుంది.


శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మించిన 'గేమ్ ఛేంజర్' విషయంలో అదే జరిగింది. అప్పుడెప్పుడో సంక్రాంతికి వచ్చిన సినిమా గురించి ఇప్పుడీ ఉపోద్ఘాతం ఎందుకనే సందేహం కొందరికి రావచ్చు. దానికి కారణం ఈ చిత్ర కథకుడు, ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చేసిన వ్యాఖ్యలు. 'గేమ్ ఛేంజర్' కథను కార్తీక్ సుబ్బరాజే ఇచ్చాడు. ఈ విషయాన్ని మూవీ ప్రమోషన్స్ లో మేకర్స్ పదే పదే చెప్పారు. శంకర్ శిష్యుడైన కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాత కూడా. అతను తన తొలి చిత్రం 'పిజ్జా'తోనే అందరినీ ఆకట్టుకున్నాడు. అలానే రెండో సినిమా 'జిగర్తాండ'తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. రజనీకాంత్ లాంటి వాడు సైతం పిలిచి 'పేట' మూవీ చేసే ఛాన్స్ ఇచ్చారు. అలాంటి కార్తీక్ సుబ్బరాజు తన గురువు శంకర్ కు ఓ కథ ఇచ్చాడంటే అది ఎంత గొప్పగా ఉండి ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ 'గేమ్ ఛేంజర్' మూవీ చూసిన తర్వాత ఇంత పాత చింతకాయ పచ్చడి లాంటి కథను శంకర్ వండి వార్చాడేమిటీ అని విమర్శించారు.


'గేమ్ ఛేంజర్' పరాజయం తర్వాత తొలిసారి కార్తీక్ సుబ్బరాజ్ తన గళాన్ని విప్పాడు. నిజానికి ఆ సినిమాకు బేసిక్ పాయింట్ మాత్రమే తనదని చెప్పారు. ఓ ఐఎఎస్ అధికారి కొన్ని కారణాల వల్ల రాజకీయనాయకుడు అయితే ఎలా ఉంటుందనే అంశాన్ని మాత్రమే తను శంకర్ కు చెప్పారని, అది నచ్చి ఆయన సినిమాగా మలచడానికి ఆసక్తి చూపించారని అన్నాడు. అయితే... తన పాయింట్ ను శంకర్ దగ్గర ఉండే బృందం సినిమాగా డెవలప్ చేసింది... ఆ క్రమంలో అది కాస్త బలహీన పడిపోయిందని వ్యాఖ్యానించాడు. మొత్తం మీద 'గేమ్ ఛేంజర్' పరాజయంతో తనకు అస్సలు సంబంధం లేదని కార్తీక్ సుబ్బరాజ్ చెప్పకనే చెప్పేశాడు. ఇదిలా ఉంటే... కార్తీక్ సుబ్బరాజ్ తాజా చిత్రం 'రెట్రో' మే 1న జనం ముందుకు రాబోతోంది. సూర్య, పూజా హెగ్డే ఇందులో జంటగా నటించారు. మరి ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

Also Read: Aha: ఓటీటీలో హన్సిక మోత్వానీ గార్డియన్...

Also Read: Rohit Setty: కాప్ యూనివర్స్ లో రెండు సీక్వెల్స్

Also Read: Janhvi Kapoor: వెండితెర నుండి వెబ్ సీరిస్ కు....

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 24 , 2025 | 10:49 AM