Kollywood: కార్తీ చేతిలో ఆరు చిత్రాలు...

ABN , Publish Date - Apr 19 , 2025 | 01:18 PM

తమిళ స్టార్ హీరో కార్తీ వేగాన్ని పెంచాడు. అతని చేతిలో ఇప్పుడు ఏకంగా ఆరు చిత్రాలు ఉన్నాయి. తాజాగా సుందర్ సి దర్శకత్వంలోనూ మూవీ చేయడానికి కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

తమిళ యువ కథానాయకుడు కార్తీ వేగం పెంచాడు. జయాపజయాలతో నిమిత్తం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ మధ్య కార్తీ సినిమాలో ఆశించిన స్థాయిలో ఆడలేదు కానీ 'పొన్నియన్ సెల్వన్ 1, 2' చిత్రాలతో పాటు 'సర్దార్', 'మెయ్యళగన్' బాగానే ఆడాయి. ఈ మధ్యలో వచ్చిన కార్తీ 25వ చిత్రం 'జపాన్' మాత్రం నిరాశకు గురిచేసింది. ప్రస్తుతం కార్తీ నాలుగు చిత్రాలను లైన్ లో పెట్టాడు. అందులో 'వా వాతియార్' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. కార్తీ నెక్ట్స్ రిలీజ్ ఇదే. అలానే 'సర్దార్'తో మంచి విజయాన్ని అందుకున్న కార్తీ ఇప్పుడు దానికి సీక్వెల్ మూవీ చేస్తున్నాడు. ఈ మధ్య దాని గ్లింప్స్ కూడా వచ్చింది. 'సర్దార్ -2' షూటింగ్ తుది దశకు చేరుకుంది. దీని తర్వాత తమిళ దర్శకత్వంలో కార్తీ ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ పైన లోకేశ్‌ కనకరాజ్ తో కార్తీ 'ఖైదీ -2' చేస్తాడు. ఈ సినిమాలతో పాటు కార్తీ తాజాగా మరో సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అదే సుందర్ సి మూవీ.


దర్శకనిర్మాత, నటుడు సుందర్ సి 'అరణ్మనై' ఫ్రాంచైజ్ లో వరుసగా సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉండి పోయిన సుందర్ సి 'మదగజరాజా' సైతం ఈ పొంగల్ కు విడుదలైంది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ బరిలో ఫర్వాలేదనిపించింది. సుందర్, వడివేలు నటించిన 'గ్యాంగర్స్' విడుదల కావాల్సి ఉంది. ఇక దర్శకుడిగా సుందర్ సి. నయనతార నాయికగా 'మూకుతి అమ్మన్ -2' మూవీని చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత కార్తీతో సుందర్ సి సినిమా ఉంటుందని కోలీవుడ్ వర్గాలలో చర్చ సాగుతోంది. సుందర్ సి చెప్పిన స్టోరీ లైన్ నచ్చి కార్తీ ఈ ప్రాజెక్ట్ కు పచ్చజెండా ఊపాడని అంటున్నారు. విశేషం ఏమంటే... నాని 'హిట్ -3' లోనూ కార్తీ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడని, 'హిట్ -4'కు అతనే హీరో అనే వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ రకంగా చేస్తూ కార్తీ చేతిలో ఇప్పుడు ఏకంగా ఆరు చిత్రాలు ఉన్నట్టు!

Also Read: Chiranjeevi: మెగా డ్యాన్స్ పోటీల సంబరాలు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 19 , 2025 | 01:18 PM