Sandal wood: సినిమా రంగంపై సీఎం ఇలా... డిప్యూటీ అలా...

ABN , Publish Date - Mar 07 , 2025 | 02:27 PM

కర్ణాటక డిప్యూటీ సీఎం సినిమా రంగం వాళ్ళ నట్లు, బోల్ట్ లు బిగిస్తామని ప్రకటించిన రెండు మూడు రోజులకే అక్కడ మల్టిప్లెక్స్ థియేటర్ల టిక్కెట్ రేట్లను గరిష్ఠంగా రూ. 200 ఉండేలా సీఎం చర్యలు తీసుకుంటున్నారు.

తాజాగా కర్ణాటక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సినిమా రంగానికి మేలు చేస్తాయో కీడు చేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. కొద్ది రోజుల క్రితం కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ అక్కడ జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కన్నడ నటీనటులు పాల్గొనకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వం చేసే ఉద్యమాలలో కూడా నటీనటులు పాల్గొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కొనసాగితే... నటీనటుల నట్లు, బోల్టులు బిగిస్తానని హెచ్చరించారు. దీనికి పై సినిమా రంగం నుండి పలు విమర్శలు వచ్చాయి. ఆహ్వానం లేకుండా ఆ వేడుకకు తాను ఎలా హాజరు కాగలనంటూ రశ్మిక మందణ్ణ (Rashkmika Mandanna) ప్రశ్నించింది. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు అర్థరహితమని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు నరసింహులు ఖండించారు. ఇదిలా ఉంటే తాజాగా కర్ణాటక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సీఎం సిద్ధరామయ్య (Siddharamaiah) సినిమా రంగంపై వరాల జల్లు కురిపించారు.


కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సినిమా రంగం అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అసెంబ్లీలో తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మైసూర్ లో ఫిల్మ్ సిటీ నిర్మించడం కోసం 150 ఏకరాల భూమిని ఇస్తున్నట్టు చెప్పారు. దీని నిర్మాణం కోసం బడ్జెట్ లో రూ. 500 కోట్లను కేటాయించారు. అంతేకాదు... సినిమాలను ప్రమోట్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. ఇవాళ బెంగళూరులో సినిమా టిక్కెట్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని అందరూ భావిస్తున్నారు. దాంతో మల్టిప్లెక్స్ థియేటర్లలో ఏ షో అయినా... టిక్కెట్ ధర గరిష్ఠంగా రూ. 200 ఉండేలా నిర్ణయం తీసుకుంటున్నట్టు సిద్ధరామయ్య ప్రకటించారు. ఇలా చేయడం వల్ల సామాన్యులకు సైతం టిక్కెట్ రేట్లు అందుబాటులో తెచ్చినట్టు అవుతుందని అన్నారు. అయితే... టిక్కెట్ రేట్లలో కోత పెట్టడం అంటే... సినిమా రంగం నట్లను, బోల్టులను ఓ రకంగా బిగించడమే అని సినిమా రంగానికి చెందిన కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్టు ప్రకటిస్తూనే... కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కనిపించని విధంగా వాత కూడా పెట్టారు.

Also Read: Reba Vs Ketika: అందాల భామల హాట్ సాంగ్స్

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 07 , 2025 | 02:27 PM