Darshan: ప్రమాదం ఉంది.. అయిన సరే వినలేదు
ABN , Publish Date - Jan 22 , 2025 | 08:56 AM
Darshan: "దర్శన్ అభిమాని అయిన రేణుకస్వామి, భార్య ఉండగా మళ్లీ ప్రియురాలు ఎందుకంటూ ప్రశ్నించిన పాపానికి.. అతనిని కిడ్నాప్ చేసి దారుణంగా హింసించడమే కాకుండా.. శాఖాహారం మాత్రమే తీసుకొనే రేణుకా స్వామి నోట్లో మాంసం ఎముక పెట్టి.."
చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renuka Swamy) హత్యకేసులో రెండో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్(Hero Darshan) తుపాకీ లైసెన్స్‌ను పోలీసులు రద్దు చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న దర్శన్ తుపాకీ లైసెన్స్‌ను పునరుద్ధరించాలని ఇటీవల పోలీసులను కోరారు. అయితే దీనిని పోలీసుశాఖ నిరాకరించింది. దర్శన్(Darshan)ను అరెస్టు చేసినప్పుడు అతడి వద్ద ఉండే తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చానని, తానో సినిమా సెలబ్రిటీ అని, ప్రాణానికి ప్రమాదం ఉందని విన్నవించినా పోలీసుశాఖ అంగీకరించలేదు. తీవ్రమైన నేర చరిత్ర కల్గినవారికి తుపాకీ లైసెన్స్ కొనసాగించలేమని నగర పోలీస్ కమిషనర్ దయానంద్ మంగళవారం తెలిపారు. ఆ వ్యక్తి నేరంలో భాగస్వామ్యులయ్యారని, నేర చరిత్ర ఉన్నప్పుడు లైసెన్స్ కొనసాగించలేమన్నారు.
ఏం జరిగిందంటే..
అసలేం జరిగిందంటే.. దర్శన్ అభిమాని అయిన రేణుకస్వామి, భార్య ఉండగా మళ్లీ ప్రియురాలు ఎందుకంటూ ప్రశ్నించిన పాపానికి.. అతనిని కిడ్నాప్ చేసి దారుణంగా హింసించడమే కాకుండా.. శాఖాహారం మాత్రమే తీసుకొనే రేణుకా స్వామి నోట్లో మాంసం ఎముక పెట్టి కొట్టినట్లుగా విచారణలో తెలిసింది. మాంసం తింటే నీకు దెబ్బలను ఓర్చుకొనే శక్తి వస్తుందని శారీరకంగా హింసించి.. చర్మం చిట్లిపోయి ఊడిపోయే విధంగా కొట్టారని.. దాంతో అతడు మరణించాడు అనే విషయం విచారణలో వెలుగు చూసింది. రేణుకాస్వామి (29) హత్యకేసులో ప్రధాన నిందితులుగా నటుడు దర్శన్, పవిత్రగౌడ సుమారు ఆరు నెలల పాటు జైల్లో ఉండి ఇటీవల బయటకు వచ్చారు. రేణుకాస్వామి హత్యకు సంబంధించి దర్శన్ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడను ఏ1 అని పోలీసులు పేర్కొన్నారు.