Kamal Haasan: మణిరత్నం కొత్త నిర్వచనం ఇవ్వబోతున్నాడు..

ABN , Publish Date - Mar 18 , 2025 | 06:38 PM

‘థగ్‌లైఫ్‌’తో దర్శకుడు మణిరత్నం మల్టీస్టారర్‌కు కొత్త నిర్వచనం చెప్పబోతున్నారని విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ అన్నారు.

‘థగ్‌లైఫ్‌’తో (Thug life) దర్శకుడు మణిరత్నం (Mani ratnam) మల్టీస్టారర్‌కు కొత్త నిర్వచనం చెప్పబోతున్నారని విశ్వనాయకుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan) అన్నారు. ఇటీవల జరిగీన ఎఫ్‌సీసీఐ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన రాబోయే గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘థగ్‌లైఫ్‌’ ఓ మల్టీస్టారర్‌. ఇందులో చేస్తున్న నటీనటులు భవిష్యత్‌లో గొప్ప స్టార్స్‌ అవుతారు. అలాంటివాళ్లను ఈ మూవీలో భాగం చేయడం వల్లే ఇది మల్టీస్టారర్‌ అయింది. ఇలా అగ్ర నటులు, యువ నటులు కలయికగా సినిమా తీయాలన్నది మణిరత్నం ఆలోచన. దానిని నాతో పంచుకున్న వెంటనే నాకూ నచ్చింది. అందుకే ఇది కార్యరూపం దాల్చింది. ఇక ఇందులో చాలా పాత్రలున్నాయి. మలయాళం, హిందీ, తెలుగు సినిమాల్లోని విలక్షణ నటుల ఇందులో కీలక పాత్రల్లో కనిపిస్తారు. అద్భుతమైన ప్రతిభ కలిగిన నటులు మనకు ఉన్నారు. ప్రతి ఒక్కరిలో ఒక్కో టాలెంట్‌ ఉంటుంది. అది వారికే సొంతం’’ అని కమల్‌హాసన్‌ పేర్కొన్నారు.



1987లో కమల్‌హాసన్‌ - మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన ‘నాయకన్‌’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. మళ్లీ 38 ఏళ్ల తర్వాత ఇద్దరూ కలిసి ‘థగ్‌లైఫ్‌’ కోసం పనిచేస్తున్నారు. శింబు, త్రిష, నాజర్‌, అభిరామి, జోజూజార్జ్‌, అశోక్‌ సెల్వన్‌, ఐశ్వర్య లక్ష్మి, మహేశ్‌ మంజ్రేకర్‌, అలీ ఫజల్‌  కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. వేసవి కానుకగా జూన్‌ 5న మూవీ విడుదల చేయనున్నారు.

Updated Date - Mar 18 , 2025 | 06:39 PM