Jani Master: కన్నీళ్ళు పెట్టుకున్న జానీ మాస్టర్!
ABN , Publish Date - Feb 25 , 2025 | 10:17 AM
పోక్సా కేసును ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. తనపై వస్తున్న విమర్శలను పక్కన పెట్టి, తిరిగి జానీ మాస్టర్ కెరీర్ పై దృష్టిపెట్టారు.
చీకటి వెనుక వెలుతురు, కష్టం వెనుక సుఖం ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తాయని కొందరు నమ్ముతారు. అలాంటి ఆశావాహులే జీవితంలో ముందుకు ధైర్యంగా సాగుతారు. స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) కూడా ఆ సిద్ధాంతాన్నే నమ్ముతున్నట్టుగా అనిపిస్తోంది. టాలీవుడ్ లో అంచెలంచెలుగా ఎదిగి తారాస్థాయిని చేరుకున్న జానీ మాస్టర్ తన శిష్యురాలు చేసిన ఒకే ఒక్క ఆరోపణతో అధః పాతాళానికి పడిపోయారు. డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుండి వైదొలగారు, పోలీసు కేసులలో చిక్కుకున్నారు. తనపై పెట్టిన పోక్సా కేసు కారణంగా వచ్చిన జాతీయ అవార్డును సైతం అందుకోలేక పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో బెయిల్ పై విడుదలైన జానీ మాస్టర్ తిరిగి తన కెరియర్ పై దృష్టిపెట్టారు. తాజాగా ఓ కన్నడ చిత్రానికి ఆయన కొరియోగ్రఫీ అందించారు.
సీనియర్ నటుడు రమేశ్ అరవింద్ (Ramesh Aravind), గోల్డెన్ స్టార్ గణేశ్ (Golden Star Ganesh) లీడ్ రోల్స్ చేస్తున్న సినిమాకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. 'యువర్స్ సిన్సియర్లీ రామ్' అనే ఈ మూవీని ఎ.ఆర్. విఖ్యాత్ డైరెక్ట్ చేస్తున్నాడు. నిష్వికా నాయుడు (Nishwika Naidu) హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల గణేశ్, నిష్వికా నాయుడు పై చిత్రీకరించిన ఓ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. ఈ సినిమా సెట్ లోకి వెళ్ళినప్పుడు తనను టీమ్ ఆదరించిన తీరుకు జానీ మాస్టర్ కన్నీళ్ళు పెట్టుకున్నారు. పాట చిత్రీకరణ పూర్తయిన తర్వాత అదే విషయాన్ని ఆయన ఫోటోలతో సహా తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశారు. ప్రతిభావంతులైన బృందంతో పనిచేయడం ఆనందంగా ఉందని, తన పట్ల వారు చూపించిన ప్రేమ మర్చిపోలేనని జానీ మాస్టర్ పేర్కొన్నారు. మొత్తానికీ కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే విషయాన్ని పక్కన పెడితే... జానీ మాస్టర్ మాత్రం నిదానంగా తన స్థానాన్ని తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని సిన్సియర్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది.