Kamal Haasan: విశ్వనాయకుడిని ఆదుకున్న ఇళయరాజా
ABN , Publish Date - Feb 18 , 2025 | 01:33 PM
ఇసై జ్ఞాని ఇళయరాజా (Ilayaraja)ను బహుముఖ ప్రజ్ఞాశాలి. కమల్ హాసన్ (Kamal Haasan) సొంత అన్నలాగా భావిస్తారు. కమల్ హాసన్ స్టార్ గా ఎదిగే క్రమంలో ఘనవిజయం సాధించిన అనేక చిత్రాలు ఇళయరాజా స్వరకల్పనలో వెలుగు చూశాయి.
ఇసై జ్ఞాని ఇళయరాజా (Ilayaraja)ను బహుముఖ ప్రజ్ఞాశాలి. కమల్ హాసన్ (Kamal Haasan) సొంత అన్నలాగా భావిస్తారు. కమల్ హాసన్ స్టార్ గా ఎదిగే క్రమంలో ఘనవిజయం సాధించిన అనేక చిత్రాలు ఇళయరాజా స్వరకల్పనలో వెలుగు చూశాయి. కమల్ హాసన్ తమ 'రాజ్ కమల్' బ్యానర్ పై రూపొందించిన పలు చిత్రాలకు ఇళయరాజా స్వరాలతోనే సాగారు. కమల్ నిర్మాతగా రూపొందిన తొలి చిత్రం 'రాజాపారవై' (Raja Paravai)కి, ఆ సినిమా తెలుగు వర్షన్ 'అమవాస్య చంద్రుడు' (Amavasya Chandrudu)కు కూడా ఇళయరాజానే స్వరకల్పన చేశారు. ఆ తరువాత కమల్ నిర్మించిన చిత్రాలలో 'సతి లీలావతి' (Sati Leelavathi) వరకు ఇళయరాజానే బాణీలు కట్టారు. 'ద్రోహి (Drohi), చాచి 420 (Chachi 420)' సినిమాలకు కమల్ వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ తో సాగారు. అలాగే తన దర్శకత్వంలో నిర్మించి, నటించిన 'హే రామ్' చిత్రానికి తొలుత ప్రఖ్యాత వయొలినిస్ట్ ఎల్.సుబ్రహ్మణ్యంతో మ్యూజిక్ కంపోజ్ చేయించారు కమల్. మరి టైటిల్స్ లో ఇళయరాజా పేరు కనిపిస్తుంది కదా! అదెలా అంటే అక్కడే ఉంది అసలు కథ.
ఇంతకూ ఏం జరిగిందంటే,
కమల్ హాసన్ సూచనల మేరకు ఎల్.సుబ్రహ్మణ్యం 'హే రామ్'కు బాణీలు కట్టారు. సుబ్రహ్మణ్యం స్వరాలతోనే సాగిన పాటలను కూడా చిత్రీకరించారు. అయితే ఫైనల్ సౌండ్ మిక్సింగ్ కు వచ్చే సరికి సుబ్రహ్మణ్యం పేచి పెట్టారు. తనకు కోటి రూపాయలు ఇస్తేనే చేస్తానని అన్నారు. సినిమా పూర్తయ్యే సమయానికి అంత సొమ్మును ఒక్క సంగీత దర్శకునికే చెల్లించే పరిస్థితి కమల్ వద్ద లేదు. దాంతో తాను అన్నగా అభిమానించే ఇళయరాజా వద్దకు వెళ్ళారు కమల్. సుబ్రహ్మణ్యం బాణీలతో రూపొందిన పాటల చిత్రీకరణ కూడా పూర్తయిందని, వాటిని తొలగించి, ఇళయరాజా ట్యూన్స్ తో రూపొందే పాటలను మళ్ళీ షూట్ చేస్తానని కమల్ అన్నారు. అయితే మళ్ళీ అది కమల్ కు ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది కదా అని ఇళయరాజా ఓ ఆలోచన చేశారు. తెరకెక్కించిన ఆ పాటలను తొలగించకుండానే, సుబ్రహ్మణ్యం మ్యూజిక్ ఉపయోగించకుండా తన స్వరాలతో పాటలు కంపోజ్ చేస్తానని ఇళయరాజా తెలిపారు. అలా కమల్ కు ఖర్చు పెరగకుండా ఇళయరాజా ఆదుకున్నారు. ఇంతకూ సుబ్రహ్మణ్యం ఆ రోజుల్లోనే కోటి రూపాయలు డిమాండ్ చేసేంత క్రేజ్ లేకపోయినా, ఎందుకలా అన్నారు? ఈ ప్రశ్నకు సుబ్రహ్మణ్యం తరువాతి రోజుల్లో సమాధానం చెప్పారు. అదేంటంటే - 'హే రామ్'లోని అంశం హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని భావించి, తనను ఎవరైనా ఏమైనా చేస్తారేమో అనే భయంతోనే అలా అన్నానని వివరించారు. ఏమైతేనేం, ఇళయరాజా పాటలు, నేపథ్య సంగీతంతోనే 'హే రామ్' వెలుగు చూసింది. పాతికేళ్ళ క్రితం 'హే రామ్' ఆడియో అలరించింది కానీ, సినిమా ఆకట్టుకోలేక పోయింది.