Ajith Kumar: సందిగ్థంలో డైరెక్టర్ శంకర్!
ABN , Publish Date - Feb 27 , 2025 | 04:24 PM
వరుసగా రెండు భారీ చిత్రాలు పరాజయం పాలు కావడంతో ప్రముఖ దర్శకుడు శంకర్ డైలమాలో పడ్డారు. 'భారతీయుడు -3'ని విడుదల చేయకుండా అజిత్ చిత్రం చేయడం ఎలా అనేది ఆయనను వెంటాడుతోంది.
గతంలో స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) తో సినిమా చేయడానికి యువ కథానాయకులు ఉవ్విళ్ళూరే వాళ్ళు. స్టార్ హీరోలైతే... ఆయన నుండి పిలుపు కోసం వేచి ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. శంకర్ ఎవరితో అయినా సినిమా చేస్తాను అంటే... సదరు హీరోలు ఏదో ఒక వంక చెప్పి తప్పించుకునే పరిస్థితి వచ్చేసింది. భారీ అంచనాలతో రూపుదిద్దుకున్న 'ఇండియన్ -2' (Indian -2) తో పాటు దాని వెనుకే వచ్చిన రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' (Game Changer) దారుణంగా పరాజయం పాలు కావడమే దానికి కారణం.
పరాజయాల పలకరింపుకు తోడు... శంకర్ ను కాపీ రైట్ యాక్ట్ సైతం చాలా ఉక్కిరి బిక్కిరి చేసింది. దాదాపు పది కోట్ల విలువైన ఆయన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దీనికి తగ్గట్టుగా శంకర్ ఇప్పుడు వాట్ నెక్ట్స్ అనేది తేల్చుకోలేకుండా ఉన్నాడట. 'ఇండియన్ -2' చిత్రాన్ని తీస్తున్నప్పుడే దానికి మరో భాగంగా 'ఇండియన్ -3' ని తెరకెక్కించాడు. కొద్ది రోజుల షూటింగ్ మినహా ఈ సినిమా పూర్తయిపోయింది. అయితే 'ఇండియన్ -2' ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈ భాగాన్ని ఓటీటీలో విడుదల చేస్తారన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ 'గేమ్ ఛేంజర్' రిలీజ్ కు ముందు... ఓటీటీలో కాదు థియేటర్లలోనే 'ఇండియన్ -3' వస్తుందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ సినిమా గురించిన ఊసే లేదు. ఎప్పటిలానే... ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్... తాజాగా అజిత్ మూవీ 'విడా ముయార్చి'ని విడుదల చేసి, మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. చిత్రం ఏమంటే... అజిత్ (Ajith) తోనే ఇప్పుడు శంకర్ సినిమా చేయాలని అనుకుంటున్నాడట. తమిళ చారిత్రక నవల 'వేల్పారి' ఆధారంగా ఓ చిత్రం రూపొందించాలని శంకర్ కొంతకాలంగా భావిస్తున్నాడు. అదే అజిత్ తో చేస్తాడా? లేక అజిత్ కోసం వేరే కథ తయారు చేస్తాడో తెలియదు. ఇదిలా ఉంటే అజిత్ ప్రస్తుతం స్పెయిన్ లో కార్ రేసింగ్ కాంపిటీషన్ లో బిజీగా ఉన్నాడు. అక్కడ నుండి వచ్చిన తర్వాత శంకర్ కథ నచ్చితే అజిత్ డేట్స్ ఇవ్వొచ్చు. కానీ ఇవాళ శంకర్ ఉన్న పరిస్థితుల్లో అజిత్ డేట్స్ ఇస్తాడా? లేదా? అనేది కూడా ప్రశ్నార్థకమే!
Also Read: Vishwak Sen: కాయదు లోహర్ పంట పండింది...
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి