Ajith And Dhanush: అజిత్ కి దారిచ్చిన ధనుష్
ABN , Publish Date - Mar 04 , 2025 | 03:16 PM
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు ఈ మధ్య టైం కాస్త బ్యాడ్‌గా నడుస్తోంది. కష్టపడి సినిమాలు చేస్తున్నా ఆశించిన ఫలితం దక్కడం లేదు. హీరోగా చేసినవే కాదు..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు (Dhanush) ఈ మధ్య టైం కాస్త బ్యాడ్‌గా నడుస్తోంది. కష్టపడి సినిమాలు చేస్తున్నా ఆశించిన ఫలితం దక్కడం లేదు. హీరోగా చేసినవే కాదు.. ఇటీవల దర్శకత్వం వహించిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా' (Jabilamma neeku antha kopama) సినిమా విషయంలో అదే జరిగింది. ఈ మూవీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది కానీ వాణిజ్యపరంగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ధనుష్ నుంచి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఆశిస్తున్నారు అభిమానులు. కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా మారిపోతున్నాయి. (good bad Ugly)
ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని కసి మీద ఉన్నాడు ధనుష్. ఈ క్రమంలో తన నెక్ట్స్ మూవీ 'ఇడ్లీ కడై' (Idly kadai) పైనే ఆశలుపెట్టుకున్నాడు. అటు పరిశ్రమలో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అందుకు కారణం ఈ సినిమాలో అతను హీరో మాత్రమే కాదు... డైరెక్టర్ కూడా. పైగా ధనుష్ తో 'తిరు' చిత్రంలో జోడీ కట్టి, ఏకంగా బెస్ట్ యాక్ట్రస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న నిత్యా మీనన్ ఇందులో హీరోయిన్. అయితే... ఇప్పుడు దీనికి సినిమా కష్టాలు మొదలయ్యాయి. ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయాలని అనుకున్నారు. ఆ రకంగా అధికారిక ప్రకటనా ఇచ్చారు. కానీ ఇప్పుడు అది జరిగేలా కనిపించడం లేదు. షూటింగ్ పార్ట్ ఇంకా బాలెన్స్ ఉండటంతో ఈ మూవీ ఆగస్టు లేదా సెప్టెంబర్‌కు వాయిదా పడే అవకాశం ఉంది. అయితే ఈ వాయిదా మరో హీరోకు కలిసిరానుంది.
నిజానికి హీరో అజిత్ పరిస్థితి కూడా కొంతకాలంగా గడ్డుగానే ఉంది. అతని తాజా చిత్రం 'విడాముయార్చి' ఘోర పరాజయం పాలైంది. తెలుగులోనూ 'పట్టుదల'గా డబ్ అయ్యింది కానీ ఇక్కడా అదే ఫలితం ఎదురైంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికే రావాల్సి అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ ఏప్రిల్ 10న రాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఒకవేళ... అజిత్, ధనుష్ సినిమాలు ఒకే రోజున అంటే ఏప్రిల్ 10నే విడుదలై ఉంటే... ఈ రెండు సినిమాల కలెక్షన్స్ మీద ఆ ప్రభావం పడి ఉండేది. కానీ ఇప్పుడు కారణం ఏదైనా ధనుష్ మూవీ విడుదల వాయిదా పడటం అజిత్ కు కలిసొచ్చినట్టే! ఆ రకంగా ఇటు అజిత్, అటు ధనుష్ అభిమానులు ఇద్దరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.