Dhanush – Karthi : మల్టీస్టారర్ మూవీకి నిర్మాత కరువు

ABN , Publish Date - Apr 07 , 2025 | 06:03 PM

'యుగానికి ఒక్కడు' మూవీ సీక్వెల్ కు దర్శకుడు సెల్వ రాఘవన్ కథను తయారు చేసినా... ఈ మల్టీస్టారర్ మూవీకి నిర్మాత దొరకడం లేదట!

ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలోనైనా మల్టీస్టారర్​ సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే కొందరు హీరోలు కలిసి సినిమాలు చేయగా, మరికొందరు మేము కూడా రెడీ అనే సంకేతాలు ఇస్తున్నారు. 'ఆర్.ఆర్.ఆర్' (RRR) లో రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR) ఏ రేంజ్ లో పోటాపోటీగా నటించి ఆకట్టుకున్నారో బిగ్ స్క్రీన్ పై ప్రపంచమంతా చూసింది. ఎవరు బాగా చేశారో కూడా చెప్పలేనంతగా ఇద్దరు తమ నటనతో సినీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు. బాలీవుడ్ లో అలాంటి కాంబినేషన్ లో వచ్చిన పలు సినిమాలు హిట్ గా నిలిచాయి. అయితే ఇప్పుడు అలాంటి రేర్ కాంబినేషనే కోలీవుడ్ లో సిద్దమవుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.


కోలీవుడ్ కు చెందిన హీరో ధనుష్ (Dhanush), కార్తీ (Karthi) కలిసి నటిస్తే ఆ లెక్క వేరు ఉంటుంది. బాక్సాఫీస్ బద్దలైపోతోంది. పైగా ఈ ఇద్దరు హీరోలకు అటు తెలుగులో ఇటు తమిళ్ లో మంచి మార్కెట్ ఉంది. అందుకే అలాంటి క్రేజీ కాంబినేషన్ సెట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇద్దరు హీరోలను కలుపుతూ ఓ భారీ మల్టీస్టారర్‌ మూవీకి ప్లాన్‌ చేస్తున్నారట. అయితే ఇక్కడే ఓ బిగ్ ట్విస్ట్ ఉంది. స్టార్ హీరోలు, స్టోరీ రెడీ గా ఉన్నా ఈ ప్రాజెక్ట్ కు ప్రొడ్యూసర్ దొరక్కపోవడం షాక్ కు గురిచేస్తోంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సెల్వ రాఘవన్ (Selva Raghavan) పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నాడు.

సెల్వ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన 'యుగానికి ఒక్కడు' (Yuganiki Okkadu) సినిమా సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంది. కార్తీతో పాటు ఆండ్రియా, రీమాసేన్‌ నటించిన ఈ మూవీ విజువల్ వండర్ గా నిలిచింది. ‘రేయ్ ఎవర్రా మీరంతా’ అంటూ కార్తీ పలికిన డైలాగ్స్ ఇప్పటికి ఫేమస్. అయితే తాజాగా డైరెక్టర్ ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలను తెలిపాడు. 2010లో విడుదలైన ఈ సినిమాకు ఖచ్చితంగా సీక్వెల్ ఉంటుందని... ఇది తన డ్రీమ్ అని... త్వరలో అధికారిక ప్రకటన వస్తుందన్నారు సెల్వ రాఘవన్. అయితే మెయిన్ హీరోగా ధనుష్ కనిపించనున్నాడట. సీక్వెల్ లో కార్తీ కూడా కొన్ని సీన్లలో కనిపించనున్నాడట. సినిమాకే హైలెట్ గా నిలిచే రోల్ లో కార్తీ కనిపిస్తాడని చెప్పుకొచ్చాడు.


'యుగానికి ఒక్కడు' మూవీ ఎక్కడ ఎండ్ అయిందో సీక్వెల్ అక్కడి నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ మూవీకి మంచి నిర్మాత దొరకడం లేదని, అందుకే సీక్వెల్ ఆలస్యమవుతుందన్నారు సెల్వరాఘవన్. స్టార్ హీరోలు నటిస్తున్న ఈ మూవీకి నిర్మాత దొరక్కపోవడంతో అటు ధనుష్... ఇటు కార్తీ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సినిమా వస్తే.... ఇద్దరు హీరోలు తెరపై ఎలా కనిపిస్తారోనన్న క్యూరియాసిటి ఫ్యాన్స్ లో ఇప్పటినుండే నెలకొంది. మరి 'యుగానికి ఒక్కడు' మూవీకి సీక్వెల్ వస్తుందా రాదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Updated Date - Apr 07 , 2025 | 06:03 PM