The Pride Of Bharat: జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ పోస్టర్
ABN , Publish Date - Feb 19 , 2025 | 04:47 PM
గత యేడాది చివరిలో ఛత్రపతి శివాజీ చిత్రంలో తాను నటిస్తున్నట్టు కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి ప్రకటించాడు. తాజాగా శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని మరో పోస్టర్ ను రిలీజ్ చేశాడు.
'కాంతార' (Kantara) చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి (Rishab Shetty). అంతేకాదు... జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగానూ అవార్డును అందుకున్నాడు. ప్రస్తుతం 'కాంతార' ప్రీక్వెల్ తో పాటు, 'జై హానుమాన్' (Jai Hanuman) చిత్రాలను చేస్తున్నాడు. వీటితో పాటు గత యేడాది 'ద ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్' (Chhatrapati Shivaji Maharaj) చిత్రాన్ని చేయబోతున్నట్టు తెలిపాడు. ఫిబ్రవరి 19 ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి కావడంతో ఈ సందర్భంగా ఆ సినిమా నుండి నయా పోస్టర్ ను విడుదల చేశారు. సందీప్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోబోతోందని తెలుస్తోంది. మూవీని అనౌన్స్ చేసిన రోజునే రిషభ్ శెట్టి దీనిని 2027 జనవరి 21న విడుదల చేస్తున్నట్టుగా తెలిపాడు. తాజాగా అష్టభుజాదేవి భారీ విగ్రహం ముందు వీరఖడ్గంతో శివాజీ ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఫిబ్రవరి 14న హిందీ చిత్రం 'ఛావా' (Chhaava) విడుదలై విజయకేతనం ఎగరేస్తోంది. శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ జీవిత గాథ ఆధారంగా 'ఛావా'ను లక్ష్మణ్ ఊటేకర్ రూపొదించారు. ఈ సినిమా ఉత్తరాదినే కాదు... దక్షిణాదిన సైతం చక్కని ఆదరణ పొందుతోంది. జాతీయ స్థాయిలో సినిమా వాళ్ళే కాకుండా వివిధ రంగాలకు చెందిన వారు సైతం 'ఛావా' చిత్రాన్ని మెచ్చుకుంటున్నారు. అందులో శంభాజీ పాత్రకు జీవం పోసిన విక్కీ కౌశల్ (Vicky Kaushal) ను అభినయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిషభ్ శెట్టి 'శివాజీ మహారాజ్' జీవిత గాధను తెరకెక్కించడమనేది మరింత ఆసక్తిదాయకంగా మారింది. రిషభ్ శెట్టి బృందం మీద 'ఛావా' విజయం మరింత బరువు బాధ్యతలను పెట్టిందనే అనుకోవాలి. ఈ సినిమా ఏకంగా ఏడు భారతీయ భాషల్లో విడుదల కానుంది.