Pattudala: ఓటీటీలోనూ అజిత్ సినిమాకు అదే రిజల్ట్!

ABN , Publish Date - Mar 03 , 2025 | 06:35 PM

అజిత్ కుమార్ తాజా చిత్రం 'పట్టుదల' థియేటర్లలో విడుదలై నెల రోజులు గడవకముందే... ఓటీటీలో వచ్చేసింది. అక్కడ కూడా ఈ సినిమాకు ఏమంత ఆదరణ లభించడం లేదు.

గత పదేళ్ళ కాలంలో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) ఎన్నడూ చూడని పరాజయాన్ని 'విడాముయర్చి' (Vidaamuyarchi) తో మూటకట్టుకున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 6వ తేదీన విడుదలయింది. నెల కూడా దాటక ముందే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో మార్చి 3వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతోంది. కర్ట్ రస్సెల్ నటించిన హాలీవుడ్ మూవీ 'బ్రేక్ డౌన్' ఆధారంగా ఈ 'విడాముయర్చి' తెరకెక్కింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లోనూ 'విడాముయర్చి' నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.


అజిత్ స్థాయి స్టార్ హీరో ఇలాంటి చిత్రాలలో నటించకూడదని ఆయన అభిమానులు 'విడాముయర్చి' విడుదలైనప్పుడే అన్నారు. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ చిత్రాన్ని చూడటానికి మనసు రావడం లేదని పలువురు డైహార్డ్ ఫ్యాన్సే అంటున్నారు. రిజల్ట్ కూడా అలాగే ఉంది. ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు కమల్ హాసన్, శంకర్ సినిమా 'భారతీయుడు-2' కు కూడా ఎదురైంది. యాక్షన్ హీరో అర్జున్, త్రిష, రెజీనా కసాండ్రా ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా మగిళ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కింది. అనిరుధ్ రవిచందర్ స్వరకల్పనలో ఈ మధ్య పలు చిత్రాలు విజయతీరాలకు పరుగులు తీశాయి. కానీ, అజిత్ లాంటి స్టార్ హీరో నటించినప్పటికీ 'విడాముయర్చి' అనిరుధ్ బాణీల్లో మురిపించలేకపోవడం శోచనీయం!


'విడాముయర్చి' పరాజయం అజిత్ రాబోయే చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'పై ప్రభావం పడుతుందని మేకర్స్ భయపడుతున్నారు. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) ఏప్రిల్ 10వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ అధినేతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మాణ భాగస్వాములుగా రూపొందుతోంది. ఇందులోనూ త్రిష కథానాయికగా నటించడం గమనార్హం! అయితే ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ‘విడాముయర్చి’లా కాకుండా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తప్పకుండా అలరిస్తుందని అభిమానుల ఆశ. వారి ఆశలు నెరవేరాలని కోరుకుందాం.

Also Read: 97th OSCARS: అప్పుడు వాల్ట్ డిస్నీ.. ఇప్పుడు  షాన్ బేకర్ సరికొత్త రికార్డు 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 03 , 2025 | 06:35 PM