Black White and Gray: అలరిస్తున్న 'బ్లాక్ వైట్ అండ్ గ్రే - లవ్ కిల్స్' ట్రైలర్
ABN , Publish Date - Apr 14 , 2025 | 07:44 PM
'బ్లాక్ వైట్ అండ్ గ్రే - లవ్ కిల్స్' ట్రైలర్ వచ్చేసింది. సోనీ లీవ్ నిర్మించినఈ డాక్యు డ్రామా మే 2వ తేదీ నుండి సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కానుంది.
అందులో 'ప్రేమ ఓ నాటకం', 'చావడం ఓ బూటకం', మరి 'నిజమేంటి? - 'లవ్, లైస్ అండ్ ట్రూత్' అన్న అంశాలను చాటుతూ ఓ ట్రైలర్ జనం ముందు నిలచింది. సోనీ లీవ్ నిర్మించిన 'బ్లాక్, వైట్ అండ్ గ్రే - లవ్ కిల్స్' (Black White and Gray - Love Kills) అనే డాక్యు-డ్రామాకు సంబంధించినదే ఈ ట్రైలర్. ఆరు ఎపిసోడ్స్ లో రూపొందిన ఈ డాక్యు డ్రామా మే 2వ తేదీ నుండి సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రేమకథలన్నీ చరిత్ర సృష్టించలేవు, కొన్ని నేరపూరితంగానూ ఉంటాయని ఈ ట్రైలర్ చెప్పకనే చెబుతుంది. ట్రైలర్ లోనే పలు ఆసక్తికరమైన అంశాలను మనల్ని కట్టి పడేస్తాయి. ఎప్పుడెప్పుడు ఈ సిరీస్ ను చూసేద్దామా అనిపిస్తుంది.
'బ్లాక్, వైట్ అండ్ గ్రే - లవ్ కిల్స్ ' సిరీస్ లో డేనియల్ గ్రే (Daniel Gray) అనే జర్నలిస్ట్ వరుస హత్యల వెనుక దాగిన మిస్టరీని ఛేదించే మిషన్ పై వెళతాడు. పరిశోధించే కొద్దీ అందులో పలు రాజకీయ, సామాజిక, ఆర్థిక పరమైన కోణాలు కనిపిస్తాయి. బోల్డ్ గా న్యూ జనరేషన్ ను కట్టిపడేసే అంశాలతో ఈ సిరీస్ రూపొందింది. చివరకు నిజం ఎలా బయట పడింది. న్యాయం గెలిచిందా అన్న ఆసక్తికరమైన అంశాలు మనల్ని వెంటాడుతాయి. తిగ్మన్షు ధులియా (Tigmanshu Dhuliya) కీలక పాత్ర పోషించిన ఈ సిరీస్ లో మయూర్ మోరే (Mayur More), పాలక్ జైస్వాల్ (Palak Jaiswal) , దేవేన భోజాని (Devena Bhojani), ఎడ్వర్డ్ సన్నెన్ బ్లిక్, హకీమ్ షాజహాన్, అనంత్ జోగ్, కమలేశ్ సావంత్ ఇతర పాత్రధారులు. ఇందులోని కథలో పలు లేయర్స్ ఉన్నాయని అన్నీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయని మయూర్ మోర్ అంటున్నారు. స్వరూప్ సంపత్, హేమల్ ఎ. థక్కర్ నిర్మించిన ఈ సిరీస్ పుష్కర్ సునీల్ మహబాలమ్ (Pushkar Suneel Mahabalm) దర్శకత్వంలో రూపొందింది. మరి ఈ థ్రిల్లర్ జనాన్ని ఏ రీతిన మెప్పిస్తుందో తెలియాలంటే మే 2 దాకా ఆగాల్సిందే.