Suzhal: లాయర్ హత్య, 8 మంది మహిళా అనుమానితులు
ABN , Publish Date - Feb 20 , 2025 | 06:39 PM
ఐశ్వర్య రాజేశ్, శ్రియా రెడ్డి, కధిర్ కీలక పాత్రలు పోషించిన తమిళ వెబ్ సీరిస్ 'సుజల్' 2022లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. దాంతో ఇప్పుడు దాని సీజన్ -2 రూపుదిద్దుకుంది.
కథిర్ (Kathir) , ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh), గోపిక రామేశ్, పార్దీబన్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించిన 'సుజల్: ది వోర్టెక్స్' (Suzhal) వెబ్ సీరిస్ 2022లో వచ్చింది. పుష్కర్, గాయత్రి దంపతులు క్రియేటర్స్ గా వ్యవహరించిన ఈ వెబ్ సీరిస్ ను జి. బ్రహ్మ, అనుచరణ్ మురుగేయన్ డైరెక్ట్ చేశారు. తమిళనాడులోని ఓ ఊహాజనిత కుగ్రామంలో జరిగే మర్డర్ మిస్టరీ కథతో 'సుజల్' రూపుదిద్దుకుంది. వెబ్ సీరిస్ అంతా తమిళ వాసనలు కొట్టినా.... ఇతర భాషల్లలోనూ అప్పట్లో అమెజాన్ ప్రైమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. సామ్ సిఎస్ (Sam CS) నేపథ్యం సంగీతంతో సన్నివేశాలను రక్తికట్టించాడు. దాంతో దీనికి అప్పట్లో మంచి క్రేజ్ వచ్చింది. గడిచిన మూడు సంవత్సరాలలో ఐశ్వర్యా రాజేశ్ కు అటు తమిళనాడులోనే కాదు... ఇటు తెలుగులోనూ అభిమానులు పెరిగారు. దాంతో ఇప్పుడీ వెబ్ సీరిస్ సీజన్ 2 స్ట్రీమింగ్ కు మేకర్స్ రెడీ అయ్యారు. తాజా దీనికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు.
తన చెల్లిని చంపినందుకు ప్రతీకారంగా తాను మర్డర్ చేశానని నందిని అంగీకరించి జైలుకు వెళ్ళడంతో ఈ ట్రైలర్ మొదలైంది. అయితే నందిని విడిపించి తీరతానని లాయర్ చెల్లప్ప చెబుతాడు. అంతలోనే అతను హత్యకు గురౌతాడు. ఈ హత్య ఎవరు చేశారో తెలుసుకోవడమే సబ్ ఇన్ స్పెక్టర్ సక్కారాయ్ లక్ష్యంగా మారుతుంది. చెల్లప్ప హత్యలో ఎనిమిది యువతుల ప్రమేయం ఉందని ప్రాధమిక విచారణంలో తెలుస్తుంది. మరి వారిలో హంతకురాలు ఎవరు, లేకపోతే ఎనిమిది మంది కుట్రపన్ని ఈ హత్య చేశారా అనేదే కీలకాంశం. ఈ రెండో సీజన్ లో లాల్ (Lal), శరవణన్, గౌరీ కృష్ణన్, సంయుక్త విశ్వనాథన్, మోనీషా బ్లెస్సీ కీలక పాత్రలు పోషించారు. అలానే మంజిమా మోహన్, కాయల్ చంద్రన్ అతిథి పాత్రలలో మెరిశారు. ఈ సెకండ్ సీజన్ ను జి. బ్రహ్మతో పాటు సర్జున్ కె.ఎం. డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 28 నుండి ఈ వెబ్ సీరిస్ ప్రైమ్ వీడియో (Prime Video) లో స్ట్రీమింగ్ కాబోతోంది.