Suzhal : The Vortex: పట్టు సడలిన 'సుళల్ - సీజన్ - 2'

ABN , Publish Date - Feb 28 , 2025 | 05:03 PM

ఐశ్వర్య రాజేశ్, కదిర్, లాల్ కీలక పాత్రలు పోషించిన క్రైమ్ థ్రిల్లర్ 'సుళల్' సీజన్ 2 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. మరి సీజన్ 1 స్థాయిలో ఇది మెప్పించిందా!?

ఓటీటీల్లో సీజన్స్ సైతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వాటిలో తమిళంలో తెరకెక్కిన 'సుళల్- ద వర్టెక్స్' సీజన్ 1లో జనాన్ని భలేగా మురిపించింది. 2022లో ఎనిమిది ఎపిసోడ్స్ లో అలరించిన 'సుళల్' ఇప్పుడు మరో ఎనిమిది ఎపిసోడ్స్ తో ఫిబ్రవరి 28న జనం ముందు నిలచింది. ఎప్పటిలాగే పలు భారతీయ భాషల్లో ఈ సిరీస్ ను వీక్షించే వీలుంది. అప్పుడు ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కు అమేజాన్ ప్రైమ్ వీడియో వేదికగా నిలచింది. పుష్కర్-గాయత్రి (Pushkar-Gayatri) తమ రచనతో క్రియేట్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ బ్రమ్మ.జి (Bramma G), అనుచరణ్ మురుగైయన్ (Anucharan Murugaiyan) దర్శకత్వంలో రూపొందింది.

సంబలూర్ అనే గ్రామవాసులు ఏడాదికి ఓ సారి పది రోజుల పాటు అంకాళమ్మ ఉత్సవాలు నిర్వహిస్తూంటారు. ఆ ఉత్సవాల పదిరోజుల్లోనే కథ సాగేలా సీజన్ 1 రూపొందింది. మూడేళ్ళ క్రితం జనం ముందు నిలచిన 'సుళల్' విశేషాదరణ చూరగొంది. అందువల్ల ఇప్పుడు సీజన్ 2ను కూడా వీక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. తన చెల్లెలి జీవితం నాశనం చేసిన వాడిని ఇన్ స్పెక్టర్ చక్రవర్తి రివాల్వర్ తీసుకొని నందిని అంతం చేస్తుంది. ఆమెను అరెస్ట్ చేయడంతో సీజన్ 1లోని చివరి భాగం ముగుస్తుంది.


సీజన్ 2 మొదటి భాగంలోనే కాళీపట్నం సెంట్రల్ జైలులో నందిని (ఐశ్వర్య రాజేశ్‌) జీవనంతో మొదలవుతుంది. ఆమెను ఎలాగైనా బయటకు తీసుకురావాలని చక్రవర్తి (కదిర్) ఆశిస్తూంటాడు. తన చెల్లిని నాశనం చేసిన వాడిని ఆమె చంపడంలో తప్పు లేదన్నది అతని భావన. చక్రవర్తిని కన్నతండ్రిలా చూసుకొనే లాయర్ చెల్లప్ప (లాల్) తాను నందిని తరపున వాదించి, ఆమెను ఎలాగైనా బయటకు తీసుకు వస్తానని చెబుతాడు. ఆశ్చర్యంగా చెల్లప్ప హత్యకు గురవుతాడు. ముత్తు అనే ఆమె దగ్గర హత్యాయుధం లభించడంతో చక్రవర్తి, మరికొందరు పోలీసులతో ఆమెను అరెస్ట్ చేస్తాడు. అయితే వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఏడు మంది అమ్మాయిలు చెల్లప్పను నేను చంపానంటే కాదు నేను చంపానంటూ వస్తారు. మరి ఇంతకూ చెల్లప్పను చంపింది ఎవరు? వివిధ ప్రాంతాలకు చెందిన ఎనిమిదిమంది అమ్మాయిలకు, చెల్లప్ప హత్యకు సంబంధమేంటన్నదే మిగిలిన కథ.


సీజన్ 1లో లాగే, సీజన్ 2లో ఆరంభం నుంచీ 'సుళల్' ఆకట్టుకుంటూ సాగింది. అయితే మొదటి నాలుడు ఎపిసోడ్స్ ఎంతో రంజుగా సాగడంతో స్పీడుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ తరువాతి ఎపిసోడ్స్ చూసేవారి సహనాన్ని పరీక్షించేలా రూపొందాయి. దర్శకులు బ్రమ్మ, అనుచరణ్ టేకింగ్ కు వంక పెట్టలేం కానీ, చివరి నాలుగు ఎపిసోడ్స్ లో కథనం మరీ పేలవంగా ఉండడంతో నత్తనడకలా అనిపిస్తుంది. అంతేకాదు పలు సన్నివేశాల్లో పలు లూప్ హోల్స్ కనిపిస్తూంటాయి. ప్రధాన పాత్రధారులు నందినిగా నటించిన ఐశ్వర్యా రాజేశ్ (Aishwarya Rajesh), చక్రవర్తిగా కనిపించిన కదీర్ (Kathir) ఎప్పటి లాగే ఆకట్టుకున్నారు. సీజన్ 1లో ఎంతో గ్రిప్పింగ్ గా సాగిన కథ, ఈ సారి ఆ పట్టు చూపించలేక పోయిందనే చెప్పాలి.

Also Read: Kunchacko Boban: ప్రియమణితో కలిసి వస్తున్న ఆఫీసర్

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 28 , 2025 | 05:27 PM