Pushpa 2: 'పుష్ప2' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

ABN , Publish Date - Jan 27 , 2025 | 02:49 PM

డిసెంబరు 5న 3 గంటల 20 నిమిషాల నిడివితో విడుదలైన ‘పుష్ప2’కు  అదనంగా మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు. దీంతో సినిమా నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలు అయింది.  ఓటీటీ వెర్షన్ కూడా ఇదే నిడివితో రాబోతుంది.

‘పుష్ప2: ది రూల్‌’ (Pushpa 2 ott release) ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ రీలోడెడ్‌ వెర్షన్‌తో  ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తుంది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (pushpa 2 Ott) వేదికగా అందుబాటులో ఉండనుంది. 

అల్లు అర్జున్‌, రష్మిక జంటగా  సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్లతో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్‌ వద్ద రూ.1896 కోట్లు (pushpa 2 collection) వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. డిసెంబరు 5న 3.20 నిమిషాల నిడివితో విడుదలైన ‘పుష్ప2’కు  అదనంగా మరో 20 నిమిషాల సన్నివేశాలను జోడించారు. ఓటీటీ వెర్షన్ కూడా ఇదే నిడివితో రాబోతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

కథ: 

శేషాచలం అడవుల్లో  కూలీగా ప్రయాణం మొదలుపెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌ను నడిపే నాయకుడిగా ఎదుగుతాడు పుష్ప అలియాస్ పుష్పరాజ్ (అల్లు అర్జున్). తన దారికి ఎవ్వరు ఎదురొచ్చినా సరే తగ్గేదేలే అంటూ ఢీ కొట్టడమే అతడికి తెలుసు.   ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజిల్)తో వైరం పెరిగి పెద్దదవుతుంది. మరోవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకీ విస్తరించడంపై దృష్టిపెడతాడు. పుష్ప బయట ఫైర్ కానీ... ఇంట్లో మాత్రం పెళ్లాం శ్రీవల్లి (రష్మిక మందన్న) మాట జవదాటడు. తన భర్త సీఎంతో కలిసి ఫొటో తీసుకుంటే చూసుకోవాలనేది ఆమె ఆశ. కోట్లకు పడగలెత్తిన పుష్ప పెళ్లాం చెప్పింది కదాని.. ఎమ్మెల్యే సిద్ధప్ప నాయుడు (రావు రమేష్)తో కలిసి సీఎం దగ్గరికి వెళతాడు. అక్కడికి వెళ్లాక ఏం జరిగింది? షెకావత్‌ని ఢీ కొంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు? ఆ వ్యాపారం రాజకీయాల్ని ఎలా శాసించింది? కేంద్రమంత్రి వీర ప్రతాప్ రెడ్డి (జగపతిబాబు)కీ, పుష్పకీ సంబంధం ఏంటి? అన్నది సినిమా. 

Updated Date - Jan 27 , 2025 | 02:49 PM