Chhaava: ఛావా సక్సెస్ తో ఆ వెబ్ సీరీస్ కు క్రేజ్!
ABN , Publish Date - Feb 25 , 2025 | 01:01 PM
'ఛావా' చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ తరహా సినిమాలు, వెబ్ సీరిస్ లపై వీక్షకులు దృష్టిపెడుతున్నారు. అంతేకాదు... చారిత్రక చిత్రాల పుస్తకాల పఠనం కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది.
కొన్ని సినిమాలకు, కొన్ని వెబ్ సీరిస్ కు ఎప్పుడు ఎలా క్రేజ్ వస్తుందో చెప్పలేం. అలా ఇప్పుడో వెబ్ సీరిస్ పై ప్రతి ఒక్కరూ దృష్టి పెడుతున్నారు, అదీ 'ఛావా' (Chhaava) చిత్రం ఘనవిజయం సాధించిన తర్వాత. ఇటీవల జియో హాట్ స్టార్ 'ది సీక్రెట్స్ ఆఫ్ ది శిలేదార్స్' (The Secret of the Shiledars) అనే వెబ్ సీరిస్ స్ట్రీమింగ్ అయ్యింది. రాజీవ్ ఖండేల్వాల్, గౌరవ్ అమ్లానీ, సాయి తమంకర్, ఆశిష్ విద్యార్థి తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. శివాజీ (Shivaji) సింహాసనం, నిధి అన్వేషణ నేపథ్యంలో దీనిని ఆదిత్య సర్ఫోద్థార్ తెరకెక్కించారు. నిజానికి ఈ వెబ్ సీరిస్ స్ట్రీమింగ్ అయినప్పుడు పెద్దంత క్రేజ్ రాలేదు. ఎప్పుడైతే శివాజీ మహారాజ్ తనయుడైన శంభాజీ బయోపిక్ 'ఛావా'కు విశేష ఆదరణ లభించిందో అందరూ ఈ వెబ్ సీరిస్ మీద దృష్టి పెట్టారు.
చిత్రం ఏమంటే... కేవలం ఇలా సినిమాలు, వెబ్ సీరిస్ పైనే కాదు... జాతీయ స్థాయిలో లక్షలాది మంది శివాజీ మహారాజ్ జీవితచరిత్రను, శంభాజీ (Sambhaji) జీవితాన్ని తెలియచేసే పుస్తకాల మీద ఆసక్తి కనబరుస్తున్నారు. ఎప్పుడైతే 'ఛావా' సినిమా చక్కని విజయాన్ని అందుకుందో... కమ్యూనిస్టులు దీనిలోని మరో కోణాన్ని వెలికి తీశారు. శివాజీ మహారాజ్ శూద్రుడని, ఆయన్ని ఛతప్రతిగా అప్పటి పీష్వాలు అంగీకరించలేదని, దాంతో కోల్ కతా నుండి ఓ బ్రాహ్మణ పండితుడ్ని శివాజీ పిలిపించుకున్నాడని, ఆయన కూడా తన కాలి వేలితో శివాజీ నుదుట తిలకం దిద్దాడంటూ తమ పార్టీ ఆఫీసుల దగ్గర వినైల్ హోర్డింగ్స్ పెట్టారు. దీనిని జాతీయ వాదులు ఖండిస్తున్నారు. శివాజీ హిందు ధర్మ కోసం పోరాడిన వీరుడని, ఆయనకు అనవసరంగా కులం అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో శివాజీ, ఆయన కుమారుడు శంభాజీ, ఆయన భార్య యేసుబాయ్ కు సంబంధించిన చారిత్రక పుస్తకాలకు డిమాండ్ పెరిగిపోయింది. అన్నాదురై రాసిన నాటకం ఆధారంగా కమ్యూనిస్టులు హిందువులపై దాడి చేస్తున్నారు తప్పితే... అందులో వాస్తవం లేదని, అన్నాదురై ద్రవిడవాదాన్ని బలపర్చడం కోసం తనకు నచ్చిన రీతిలో చరిత్రను వక్రీకరించారని మరికొందరు అంటున్నారు.
ఇక 'ది సీక్రెట్స్ ఆఫ్ శిలేదార్స్' వెబ్ సీరిస్ విషయానికి వస్తే... నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే ఇలాంటి వెబ్ సీరీస్ కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుందని, అలానే దీనిని కూడా కొంతమంది ఆదరించారని, కానీ 'ఛావా' విజయం తర్వాత శివాజీ సింహాసనం, అప్పటి నిధి అన్వేషణ నేపథ్యంలో ఈ వెబ్ సీరిస్ ఉందని తెలియడంతో ఇంకొంతమంది దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. గతంలోనూ కీరవాణి (Keeravani) తండ్రి శివశక్తి దత్తా దర్శకత్వంలో హరినాథ్ పొలిచర్ల ఓ సినిమాను నిర్మించారు. అందులో ఆయనే హీరోగా నటించారు. ఛత్రపతి శివాజీ ఖడ్గం పేరు 'చంద్రహాస్' (Chandrahas) ను ఈ సినిమాకు పెట్టారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు కృష్ణ (Superstar Krishna) సైతం శివాజీ పాత్రలో కనిపించడం విశేషం. ఇలాంటి సినిమాలను ఇప్పుడు రీ-రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.