OTT Movies: అగ్రతారలతో ఓటీటీ మోతెక్కిపోవాల్సిందే
ABN , Publish Date - Feb 04 , 2025 | 05:36 PM
థియేటర్‌లోలాగే ఓటీటీలొ కూడా వారంవారం కొత్తకొత్త సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతుంటాయి. అగ్ర తారలు సైతం ఓటీటీ సిరీస్‌లు చేయడానికి ముందడుగు వేస్తున్నారు. ఆ బాటలోనే పలువురు తారలు విభిన్నమైన చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికగా అలరించడానికి సిద్థమయ్యారు.
ఓటీటీ (Netflix OTT)అందుబాటులోకి వచ్చాక ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవే లేదు. సినిమా థియేటర్‌కే వెళ్లి సినిమా చూడాలన్న రూలూ లేదు. అరచేతిలో ప్రపంచ సినిమా చూసేయొచ్చు. అంతా డిజిటల్‌లో ఓటీటీ విస్తరించింది. థియేటర్‌లోలాగే ఓటీటీలొ కూడా వారంవారం కొత్తకొత్త సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతుంటాయి. అగ్ర తారలు సైతం ఓటీటీ సిరీస్‌లు చేయడానికి ముందడుగు వేస్తున్నారు. ఆ బాటలోనే పలువురు తారలు విభిన్నమైన చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికగా అలరించడానికి సిద్థమయ్యారు. ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వివరాల్ని ప్రకటించి టీజర్‌ను విడుదల చేసింది.
విధ్వంసం మొదలవబోతుంది మామ
‘‘రానాను ఆపగలిగేది అతని తండ్రి మాత్రమే’’ అంటూ ‘రానా నాయుడు’ (Rana Naidu) మరోసారి ఓటీటీ వీక్షకులు ముందుకు రానున్నారు. క్రేౖమ్, యాక్షన్ నేపథ్యంలో రూపొంది విజయవంతమైన వెబ్‌సిరీస్ ‘రానా నాయుడు’. వెంకటేశ్(Venkatesh), రానా ప్రధానా పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఎన్ని విమర్శలు ఎదురైనా ఓటీటీలో సత్తా చాటింది. దీనికి కొనసాగింపుగా సీజన్ 2 రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘రానా నాయుడు 2’ను అధికారికంగా ప్రకటిస్తూ.. ఇన్‌స్టా వేదికగా టీజర్‌ను విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్. ‘‘ఇప్పుడు విధ్వంసం మొదలవబోతుంది మామ. ఎందుకంటే ఇది రానా నాయుడు స్టైల్’’ అని వాఖ్యల్ని జోడించింది. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ రూపొందిస్తున్న సిరీస్ ఇది.
వజ్రం దోపిడి.. (Jewel thief)
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif ali khan) ఓ దొంగగా రాబోతున్నారు. ఆయన కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జ్యువెల్ థీఫ్’ ( కూకీ గలాటీ, రాబీ గ్రేవాల్ తెరకెక్కిస్తున్నారు. జైదీప్ అహ్లావత్ కీలక పాత్రధారుడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఒక అమూల్యమైన వజ్రాన్ని దోపిడి చేయడానికి సైఫ్ చేస్తున్న ప్రయత్నాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగుతోందీ టీజర్.
అక్కగా కీర్తి సురేష్ (AKKA)
కీర్తి సురేశ్(Keerty suresh) త్వరలో ‘అక్క’గా రాబోతుంది. ఆమె, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్ ఇది. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్‌ను అధికారికంగా ప్రకటిస్తూ.. టీజర్‌ను విడుదల చేశారు. ‘‘ఒక తిరుగుబాటుదారుడు పతనానికి కుట్ర పన్నాడు. పెర్నేరుకు చెందిన ఓ అమ్మాయి అక్కలపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. వేచి ఉండండి ‘అక్క’ త్వరలో వస్తోంది’’ అని పోస్ట్ చేశారు. ప్రతీకారం నేపథ్యంలో రూపొందుతున్న సిరీస్‌లో కీర్తి ఓ శక్తిమంతమైన పాత్రలో కనువిందు చేయనున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.
భార్యభర్త.. వినోదం.. (Toaster)
బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్, సన్యా మల్హోత్రా జంటగా ‘టోస్టర్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా వివేక్ దాస్ చౌదరి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను ప్రకటిస్తూ ఇన్‌స్టాలో టీజర్‌ను పంచుకుంది నెట్‌ఫ్లిక్స్ సంస్థ. ఇద్దరు భార్యభర్తల మధ్య జరుగుతున్న వినోదాత్మక సంభాషణలతో మొదలైన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది. ఈ సినిమాతో రాజ్‌కుమార్ నిర్మాత అవతారమెత్తారు.
వీటితోపాటు ఆర్.మాధవన్, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆప్ జైసా కో’, ‘ఢిల్లీ క్రేౖమ్ 3’, ‘మండలా మర్డర్స్’ లాంటి విభిన్నమైన ప్రాజెక్టులను ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్ సంస్థ.