Marana Mass OTT: ఓటీటీకి.. ఇంట్రెస్టింగ్ మలయాళ క్రైమ్, డార్క్ కామెడీ థ్రిల్లర్! ఎందులో.. ఎప్పటినుంచంటే?
ABN , Publish Date - May 05 , 2025 | 05:43 PM
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు మరో మలయాళ చిత్రం మరణ మాస్ సిద్ధమైంది. కేవలం తన అనువాద చిత్రాలతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బసిల్ జోసెఫ్ ఈ చిత్ర కథానాయకుడు.
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు మరో మలయాళ చిత్రం మరణ మాస్ (Marana Mass) సిద్ధమైంది. కేవలం తన అనువాద చిత్రాలతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బసిల్ జోసెఫ్ (Basil Joseph) ఈ చిత్ర కథానాయకుడు. ఈ యేడాది ఇప్పటికే ప్రవింకూడు షప్పు (Pravinkoodu Shappu), పొన్‌మ్యాన్ (జోసెఫ్) వంటి రెండు డిఫరెంట్ చిత్రాలతో ఆలరించిన ఆయన మరోమారు ఓ వైవిధ్యభరిత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గత నెల ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. అయితే.. ఈ సినిమాను మరో మలయాళ అగ్ర హీరో టొవినో థామస్ (Tovino Thomas) నిర్మించడం విశేషం. రాజేష్ మాధవన్, అనిష్మా అనిల్కుమార్, సురేష్ కృష్ణ, సిజు సన్నీ, బాబు ఆంటోని కీలక పాత్రల్లో నటించగా శివప్రసాద్ దర్శకత్వం వహించాడు.
కథ విషయానికి వస్తే.. కేరళలోని ఓ మారుమూల గ్రామంలో బనానా కిల్లర్ అనే వ్యక్తి ఊర్లో వయసు మళ్లిన వారిని చంపి వారి నోట్లో ఆరటి పండు పెట్టి పోతుంటాడు. దీంతో పోలీసులు హంతకుడి కోసం రేయింబవళ్లు వెతుకే పనిలో ఉంటారు. మరోవైపు లూక్ అనే వ్యక్తి తన లవ్ ఫెయిల్ అయిన బాధలో ఉంటాడు. అయితే ఓ రోజు లూక్ ప్రేయసి ఓ బస్సులో తనపై అసభ్యంగా ప్రవర్తించిన ఓ ముసలి వ్యక్తిపై పెప్పర్ స్ప్రే చేయగా అనుకోకుండా ఆ వ్యక్తి చనిపోతాడు. అయితే అప్పటికే అ బస్సులో లూక్, ఆ వృద్దుడిని చంపడానికి వచ్చిన బనాన కిల్లర్ కూడా ఉంటారు. వారితో పాటు బస్సు కండక్టర్, డ్రైవర్ కూడా ఉండి చనిపోయిన వ్యక్తిపై ఉన్న టాటూని చూసి తమ తాతే అని అనుకుంటుంటారు. ఇంతకు ఆ తాత వాళ్ల మనిషేనా, అతను నిజంగా ఎలా చనిపోయాడు, బనాన కిల్లర్‌ను పట్టుకో గలిగారా లేదా అనేది కథ.
మరోవైపు అప్పటికే బనాన కిల్లర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ కుక్క తప్పి పోతుంది. దానికి వీరికి ఉన్న లింకు ఇలా ఓ ఐదారు పాత్రల చుట్టూ సినిమా తిరుగుతూ ఆకట్టుకుంటుంది. అక్కడక్కడ బాగా లాగ్ చేసినా ఓ వైరైటీ సినిమా చూసిన ఫీలింగ్ ప్రతి ఒక్కరికీ వస్తుంది. ముఖ్యంగా బస్ కండక్టర్, డ్రైవర్ పాత్రలు చేసిన వారు లీనమై చేసినట్లు కనిపించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు. ఇప్పుడీ సినిమా మే15 నుంచి సోనీలివ్ (Sony Liv) ఓటీటీ (Ott)లో మలయాళంతో పాటు తెలుగ ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవనుంది. ఈ మధ్య ఎక్కువగా వస్తున్న రక్త పాతాలు, రొమాన్స్ సినిమాలకు భిన్నమైన మూవీ చూడాలనుకునే వారు ఈ మరణ మాస్ (Marana Mass) సినిమా చూసి ఎంజాయ్ చేయవచ్చు.