Dhanush Vs Ashwin: థియేటర్లోనే కాదు ఓటీటీలోనూ వార్...

ABN , Publish Date - Mar 19 , 2025 | 02:39 PM

ఫిబ్రవరి 21న థియేటర్లలో పోటీ పడిన రెండు చిత్రాలు ఆ వార్ ను ఓటీటీలో రిపీట్ చేస్తున్నాయి.

ఫిబ్రవరి 21న రెండు తమిళ చిత్రాలు పోటీపోటీగా థియేటర్లలో సందడి చేశాయి. అందులో ఒక దానిని ధనుష్‌ (Dhanush) డైరెక్ట్ చేశాడు. తన మేనల్లుడు పవిష్‌ (Pavish) ను హీరోగా పరిచయం చేస్తూ ధనుష్‌ రూపొందించిన 'నిలవుకు ఎన్ మేల్ ఎన్నాడి కోబం' మూవీ అందులో ఒకటి. ఇది 'జాబిలమ్మ నీకు అంతకోపమా' అనే పేరుతో అదే రోజున తెలుగులోనూ డబ్ అయ్యి విడుదలైంది. అలానే 'లవ్ టుడే' (Love today) మూవీతో దర్శకుడిగా, హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganadhan). అతను హీరోగా, అశ్విన్ మారిముత్తు తెరకెక్కించిన 'డ్రాగన్' (Dragon) మూవీ కూడా అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ డబ్ అయ్యి ఫిబ్రవరి 21నే విడుదలైంది. ఈ రెండు సినిమాలలో జనాలు ప్రదీప్ రంగనాథన్ మూవీవైపు మొగ్గు చూపారు. ఈ సినిమా 150 కోట్ల గ్రాస్ ను కూడా వసూలు చేసింది. అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మిస్కిన్, గౌతమ్ వాసుదేవ మీనన్, కె.ఎస్. రవికుమార్ కీలక పాత్రలు పోషించారు. దీనికి లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించాడు.


ఫిబ్రవరి 21న థియటర్లలో ఒక దానితో ఒకటి పోటీపడిన ఈ రెండు సినిమాలు అదే వార్ ను ఇప్పుడు ఓటీటీలోనూ కొనసాగిస్తున్నాయి. ఈ చిత్రాలు మార్చి 21న ఓటీటీలో స్ట్రీమింగ్ జరుపుకుంటున్నాయి. విశేషం ఏమంటే రెండు బడా ఓటీటీ సంస్థలు ఈ సినిమాల హక్కులను సొంతం చేసుకున్నాయి. 'డాగ్రన్' మూవీ నెట్ ఫ్లిక్స్ లో రాబోతుండగా, 'జాబిలమ్మ నీకు అంతకోపమా' అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మధ్య థియేటర్లలో ఆడని సినిమాలకూ ఓటీటీలో కాస్తంత క్రేజ్ ఏర్పడి వ్యూవర్స్ బాగానే చూస్తున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో పెద్దంతగా ప్రజాదరణ పొందని 'జాబిలమ్మ నీకు అంతకోపమా'ను ఓటీటీలో అయినా జనాలు చూస్తారేమో చూడాలి.

Also Read: Officer On Duty: ఆరు రోజుల్లోనే ఓటీటీలో ఆఫీసర్...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 19 , 2025 | 02:39 PM