Rakesh Varre: ఎట్టకేలకు ఓటీటీలో జితేందర్ రెడ్డి చిత్రం
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:46 PM
జాతీయవాది జితేందర్ రెడ్డి బయోపిక్ గత యేడాది నవంబర్ లో థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడా సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
ఏబీవీపీ, బీజేవైఎం నాయకుడు జితేందర్ రెడ్డి (Jithender Reddy) బయోపిక్ ను అదే పేరుతో ఆయన సోదరుడు ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మించారు. సెన్సార్ కష్టాలను అధిగమించి ఆ సినిమా గత యేడాది నవంబర్ 8న జనం ముందుకు వచ్చింది. 'ఎవరికీ చెప్పొద్దు' చిత్రంలో హీరోగా నటించిన రాకేశ్ వర్రే (Rakesh Varre) 'జితేందర్ రెడ్డి'లో టైటిల్ క్యారెక్టర్ పోషించాడు. రియా సుమన్ , వైశాలి, సుబ్బరాజు (Subbaraju), రవిప్రకాశ్ (Ravi Prakash) ఇందులో కీలక పాత్రలను చేశారు. 'ఉయ్యాల జంపాల, మజ్ను' చిత్రాలను రూపొందించిన విరించి వర్మ (Virinchi Varma) దీనికి దర్శకుడు. గోపీసుందర్ (Gopisunder) సంగీతం అందించాడు. అయితే... ఈ సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన లభించింది.
ఇవాళ పెద్ద, చిన్న అనే తేడా లేకుండా ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలైన మూడు, నాలుగు వారాలకు ఓటీటీలో ప్రత్యక్షమౌతోంది. కానీ 'జితేందర్ రెడ్డి'కి అక్కడా ఎదురుచూపులు తప్పలేదు. ఎట్టకేలకు ఈ సినిమా ఈటీవీ విన్ లో ఈ నెల 20 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాణిశ్రీ తెలిపారు. జాతీయవాది అయిన జితేందర్ రెడ్డిని నక్సలైట్లు అతి కిరాతకంగా హతమార్చారని, అతని జీవితం ఈ తరానికి స్ఫూర్తి నింపాలనే ఉద్దేశ్యంతో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ సినిమాను నిర్మించామని, గురువారం నుండి ఓటీటీలో ప్రసారం కాబోతున్న తమ చిత్రానికి చక్కని ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉందని ఆమె అన్నారు.
Also Read: Singeetam Srinivasa Rao: సింగీతం అందించిన కానుక 'ఆదిత్య 369'
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి