Donga: చిరంజీవిని రెండుసార్లు దొంగ అనిపించిన ఘనుడు
ABN , Publish Date - Mar 14 , 2025 | 11:23 AM
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'దొంగ' చిత్రం విడుదలై నాలుగు దశాబ్దాలు పూర్తవుతోంది. విశేషం ఏమంటే... చిరంజీవి సోలో హీరోగా నటించిన తొలి 'దొంగ' టైటిల్ చిత్రం ఇది. ఈ సినిమాను టి. త్రివిక్రమరావు నిర్మించారు. చిరంజీవి 'దొంగ' చిత్రాలకు సంబంధించిన విశేషాలు ఇవి...
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కెరీర్ లో 'దొంగ' (Donga) టైటిల్ భలేగా సందడి చేసింది. ఆయన తొలిసారి 'దొంగ' అనిపించుకున్నది మాత్రం సోలోగా కాదు. మరో స్టార్ హీరో కృష్ణతో కలసి చిరంజీవి 'తోడుదొంగలు' అనే సినిమాలో నటించారు. అలా కృష్ణ, చిరంజీవి 'తోడుదొంగలు'గా ప్రేక్షకులను పలకరించడంతో చిరు కూడా ఓ దొంగ అయిపోయారు. ఆ తరువాత 'దొంగ, అడవిదొంగ (Adavi Donga), దొంగమొగుడు (Donga Mogudu), జేబుదొంగ (Jebu Donga), మంచిదొంగ (Manchi Donga), కొండవీటి దొంగ (Kondaveeti Donga)' వంటి చిత్రాల్లోనూ దొంగ అనిపించుకున్నారు చిరంజీవి. ఈ సినిమాల్లో ఒక్క 'జేబుదొంగ' మినహాయిస్తే అన్నీ జనాన్ని ఆకట్టుకున్న చిత్రాలే కావడం విశేషం! అయితే ఈ దొంగల చిత్రాలలో ఎవరికీ దక్కని క్రెడిట్ ఓ నిర్మాత పట్టేశారు. ఆయనే విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ అధినేత టి.త్రివిక్రమరావు.
'తోడుదొంగలు' తరువాత చిరంజీవిని సోలోగా 'దొంగ'లా తొలిసారి నిలిపింది టి.త్రివిక్రమరావే. మరో విశేమేంటంటే చిరంజీవి 'దొంగ' టైటిల్ రోల్ లో చివరి సారిగా నటించిందీ టి.త్రివిక్రమ రావు చిత్రంలోనే. అలా కేవలం ఐదేళ్ళ గ్యాప్ లో రెండు సార్లు చిరంజీవిని 'దొంగ'ని చేసిన క్రెడిట్ త్రివిక్రమరావు కొట్టేశారు. చిరంజీవి హీరోగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో టి.త్రివిక్రమరావు నిర్మించిన 'దొంగ' 1985 మార్చి 14న రిలీజయింది. రాధ ఇందులో నాయిక. చక్రవర్తి స్వరకల్పనలో వేటూరి రాసిన పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. ఇందులో మైఖేల్ జాక్సన్ 'థ్రిల్లర్' సాంగ్ స్ఫూర్తితో 'గోలీ మార్...' అంటూ సాగే పాటను చిత్రీకరించారు. ఈ సాంగ్ అప్పట్లో యువతను విశేషంగా అలరించింది. ఈ చిత్రం మంచి వసూళ్ళు చూసింది. శతదినోత్సవం జరుపుకుంది.
తరువాత ఐదేళ్ళకు అంటే 1990లో చిరంజీవి హీరోగానే అదే ఎ.కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో టి.త్రివిక్రమరావు 'కొండవీటి దొంగ' నిర్మించారు. ఈ సినిమా మార్చి 9న రిలీజయింది. ఇందులోనూ రాధ నాయికగా కనిపించగా, మరో హీరోయిన్ గా విజయశాంతి నటించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం పెద్ద ఎస్సెట్ అని చెప్పాలి. 'ఛమకు ఛమకు...' అంటూ సాగే పాటను సీతారామశాస్త్రి రాయగా, మిగిలిన ఆరు పాటలను వేటూరి పలికించారు. చిరంజీవి, రాధపై చిత్రీకరించిన 'శుభలేఖ అందుకున్న...' అంటూ సాగే పాట ఈ నాటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే ఉంది. ఈ సినిమా కూడా వందరోజులు చూసింది.
చిరంజీవిని తొలిసారి 'దొంగ'గా చూపించి, చివరలో 'కొండవీటి దొంగ'గా జనం ముందు నిలిపిన ఘనుడుగా మిగిలిపోయారు టి.త్రివిక్రమరావు. రెండు చిత్రాలనూ ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలోనే నిర్మించడం విశేషం! కాగా, ఈ రెండు సినిమాల్లోనూ రాధ నాయికగా కనిపించడం, ఈ మూవీస్ రెండూ ఐదేళ్ళ గ్యాప్ లో మార్చి నెలలోనే ప్రేక్షకుల ముందు నిలవడం మరింత విశేషం!
Also Read: RAPO: చందూతో సినిమా.. రామ్ రెడీ..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి