Megastar: ఒకేరోజు రెండు సినిమాలతో మెస్మరైజ్ చేసిన చిరు

ABN , Publish Date - Mar 07 , 2025 | 08:19 PM

మెగాస్టార్ కాకముందే చిరంజీవి పలు చిత్రాలతో బిజీగా ఉండేవారు. కెరీర్ ప్రారంభంలోనూ పలు చిత్రాలలో ఆయన కీలక పాత్రలు పోషించారు. అలా చిరంజీవి నటించిన రెండు సినిమాలు 45 సంవత్సరాల క్రితం ఒకేరోజున విడుదలయ్యాయి.

తెలుగు చిత్రసీమలో టాప్ స్టార్స్ ఎవరూ తాము నటించిన రెండు చిత్రాలను ఒకే రోజున రిలీజ్ చేయడానికి ఇష్టపడరు. ఆ మాటకొస్తే ఇప్పటి హీరోలు ఒకే సంవత్సరంలో రెండు సినిమాల్లో నటించడానికే వెనకాముందూ ఆడుతున్నారు. అయితే స్టార్ హీరోస్ గా మారిన తరువాత కూడా కొందరు సాహసవంతులు ఒకే రోజున తాము నటించిన రెండు సినిమాలను విడుదల చేసి అభిమానులను అలరించారు. అలాంటి ఫీట్ చేయడంలోనూ ముందున్నానని నటరత్న యన్టీఆర్ (NTR) చాటుకున్నారు. ఆయన నటించిన "ఇంద్రజిత్, పెండ్లిపిలుపు" చిత్రాలు 1961 మే 5వ తేదీన విడుదలై రెండు చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. అలా స్టార్ హీరో అయ్యాక ఒకే రోజు రెండు సినిమాలు విడుదల చేసిన వారిలో నటశేఖర కృష్ణ (Krishna) కూడా ఉన్నారు. ఆయన శోభన్ బాబు (Sobhan Babu)తో కలసి నటించిన 'ఇద్దరు దొంగలు', కృష్ణంరాజు (Krishnam Raju)తో స్క్రీన్ షేర్ చేసుకున్న 'యుద్ధం' రెండూ 1984 జనవరి 14న విడుదలయ్యాయి. వీటిలో 'ఇద్దరు దొంగలు' వందరోజులు చూసింది. రెండూ మల్టీస్టారర్స్ కావడం విశేషం! ఇక ఇలాంటి ఫీట్ ను తనదైన స్టైల్ లో చేసి చూపించన స్టార్ హీరో బాలకృష్ణ (Balakrishna). 1993లో బాలయ్య రెండు చిత్రాల్లోనే నటించి, ఆ రెండు సినిమాలను సెప్టెంబర్ 3వ తేదీన రిలీజ్ చేసి విజయం సాధించారు. ఆ సినిమాలేవంటే 'నిప్పురవ్వ', 'బంగారుబుల్లోడు'. ఈ రెండు సినిమాలు కూడా నూరు రోజులు చూడడం విశేషం! అలాగే చిరంజీవి (Chiranjeevi) నటించిన రెండు సినిమాలు ఒకే రోజున వచ్చిన సందర్భాలు రెండు సార్లు చోటు చేసుకున్నాయి.

Also Read: Mythri Movie Makers: 'కిస్ కిస్ కిస్సక్'గా 'పింటూ కీ పప్పీ'


తన చిత్రాలను ఓ పద్ధతి ప్రకారం విడుదల చేయడంలో ఎంతో నిష్ణాతులు అని పేరొందారు మెగాస్టార్ చిరంజీవి. అలాంటి చిరంజీవి నటించిన రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్‌ కావడమా? అందునా రెండు సార్లు అలా జరిగిందా అన్న అనుమానం, ఆశ్చర్యం కలుగక మానవు. అక్షరాలా జరిగింది. 1980 మార్చి 7వ తేదీన మొదటిసారి జరిగింది. అప్పట్లో చిరంజీవి వర్ధమాన నటుడు. అందువల్ల తనకు లభించిన ప్రతిపాత్రకు న్యాయం చేయాలని తపించేవారు. అలా ఆయన నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదలయ్యాయి. అందులో ఒకటి కృష్ణ హీరోగా రూపొందిన 'కొత్తపేట రౌడీ'. రెండోది శోభన్ బాబు హీరోగా తెరకెక్కిన నవలాచిత్రం 'చండీప్రియ'. ఈ రెండు సినిమాల్లోనూ జయప్రద నాయికగా నటించడం విశేషం కాగా, రెండింటిలోనూ చిరంజీవిపై పాటలు చిత్రీకరించడం మరో విశేషం!


'కొత్తపేట రౌడీ'లో చిరంజీవి ఓ ప్రభుత్వోద్యోగిగా కనిపించారు. ఆయనను లోబరచుకోవడానికి ప్రతినాయకుడు ఓ అందమైన అమ్మాయిని ఎరగా వేస్తాడు. ఈ నేపథ్యంలో చిరంజీవి, జ్యోతిలక్ష్మిపై "పరువాల లోకం..." అంటూ సాగే పాటను రూపొందించారు. ఇక 'చండీప్రియ'లో టైటిల్ సాంగ్ ను చిరంజీవి, జయప్రదపై తెరకెక్కించడం విశేషం! ఇందులో "ఓ ప్రియా... చండీప్రియా..." అంటూ సాగే పాటను చిరంజీవి, జయప్రదపై రూపొందించారు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. కాకపోతే 'చండీప్రియ' నవలా చిత్రం కావడంతో మహిళలను ఆకర్షించింది. ఇందులో హీరో తమ్మునిగా, హీరోయిన్ ను ఆరాధించేవానిగా చిరంజీవి కనిపించి మంచి మార్కులు పోగేశారు.

Also Read: Kingston Review: జీవీ ప్రకాశ్‌ 25వ సినిమా ఎలా ఉందంటే...

ఇక చిరంజీవి వర్ధమానకథానాయకుడుగా రాణిస్తున్న రోజుల్లో ఆయన నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదలయ్యాయి. అవి ఏవంటే - తాతినేని ప్రసాద్ తెరకెక్కించిన 'టింగురంగడు', మౌళి రూపొందించిన 'పట్నం వచ్చిన పతివ్రతలు'. ఈ రెండు సినిమాలు 1982 అక్టోబర్ 1న విడుదలయ్యాయి. 'పట్నం వచ్చిన పతివ్రతలు'లో మోహన్ బాబు కూడా ఓ హీరోగా నటించారు. ఈ రెండు సినిమాల్లో 'పట్నం వచ్చిన పతివ్రతలు' కాస్త ఎక్కువగా జనాన్ని ఆకట్టుకుంది. అయితే స్టార్ హీరో అయిన తరువాత చిరంజీవి ఏ నాడూ తాను నటించిన రెండు చిత్రాలను ఒకే రోజున విడుదల చేయలేదు. ఈ మధ్యకాలంలో ఇలా ఒకే రోజున నాని నటించిన 'జెండాపై కపిరాజు', 'ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రాలు 2015 మార్చి 21న విడుదలయ్యాయి. వీటిలో 'జెండాపై కపిరాజు' నాని తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం. కాగా విజయ్ దేవరకొండతో కలసి 'ఎవడే సుబ్రమణ్యం'లో నాని నటించారు. వీటిలో 'ఎవడే సుబ్రహ్మణ్యం' మెల్లగా పుంజుకుంది. ఆ యేడాది నాని హీరోగా నటించిన 'భలే భలే మగాడివోయ్' కూడా రిలీజయింది. ఏది ఏమైనా 45 ఏళ్ళ క్రితం ఒకే రోజు జనం ముందు నిలచిన 'చండీప్రియ', 'కొత్తపేట రౌడీ' చిత్రాల ద్వారా చిరంజీవి నటునిగా జనాన్ని ఆకట్టుకోగలిగారు అన్నది నిర్వివాదాంశం.

Also Read: Chai - Sobhita: హనీమూన్‌‌‌కి చెక్కేసిన జంట

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 07 , 2025 | 08:24 PM