Superstar: మూడు సార్లు కృష్ణ కు చెల్లిగా విజయ నిర్మల

ABN , Publish Date - Feb 20 , 2025 | 07:14 PM

ఒకే యేడాది విడుదలైన మూడు చిత్రాలలో కృష్ణ చెల్లెలుగా విజయనిర్మల నటించారు. ఈ రేర్ ఫీట్ 1969వ సంత్సరంలో జరిగింది. అదే యేడాది కృష్ణ విజయ నిర్మల మెడలో మూడు ముడులు వేయడం విశేషం.

తెలుగు చిత్రసీమలో 'ఎవర్ గ్రీన్ హిట్ పెయిర్'గా రాణించారు నటశేఖర కృష్ణ (Krishna), విజయనిర్మల (Vijayanirmala). వారిద్దరూ కలసి దాదాపు 40 చిత్రాలలో నటించారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ జోడీ కట్టి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు కృష్ణ-విజయనిర్మల. ఈ భార్యాభర్తలను ఆదర్శంగా తీసుకొని టాలీవుడ్ లో పలు జంటలు పెళ్ళి చేసుకొని సక్సెస్ ఫుల్ గా సంసారాలు సాగిస్తున్నారు. అలాంటి కృష్ణ, విజయనిర్మల ఒకరి విజయాలకు ఒకరు అండగా నిలచి జనం మదిని గెలిచారు. తెలుగునాట కృష్ణ సూపర్ స్టార్ గా నిలవడానికి విజయనిర్మల ప్రోత్సాహం ఎంతయినా ఉందని చెప్పవచ్చు. అలాగే ఆయన 350 పై చిలుకు చిత్రాల్లో నటించడానికి కూడా విజయనిర్మల ప్రేమాభిమానాలే అండగా నిలిచాయనీ అభిమానులు చెబుతారు. ఇక విజయనిర్మల అత్యధిక చిత్రాలు రూపొందించిన దర్శకురాలిగా చరిత్ర సృష్టించడానికి కృష్ణ ప్రోత్సాహం అసలు కారణమని అంగీకరించక తప్పదు. అంతలా తమదైన బాణీ పలికించిన సినీజంట మరొకటి తెలుగునాట కానరాదు. అలాంటి కృష్ణ, విజయనిర్మల మూడు చిత్రాలలో అన్నాచెల్లెళ్ళుగానూ నటించి అలరించారు. ఆ చిత్రాలేవంటే "మంచిమిత్రులు (Manchi Mitrulu), బొమ్మలు చెప్పిన కథ (Bommalu Cheppina Katha), ముహూర్తబలం (Muhurtha Balam)"- ఈ మూడు సినిమాలు 1969లోనే విడుదల కావడం విశేషం!


కృష్ణ, విజయనిర్మల అన్నాచెల్లెళ్ళుగా నటించిన మూడు చిత్రాలలో మొట్టమొదటగా జనం ముందు నిలచిన సినిమా ఏదంటే - 'మంచిమిత్రులు'. 1969 జనవరి 12వ తేదీన విడుదలైన ఈ సినిమా తాతినేని రామారావు దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో కృష్ణ, శోభన్ బాబు మిత్రులుగా నటించారు. శోభన్ బాబు నాయికగా విజయనిర్మల ఈ చిత్రంలో కనిపించారు. ఈ మూవీ క్లయిమాక్స్ సీన్ లో కృష్ణ చనిపోతూ, తన చెల్లెలిని శోభన్ కు అప్పగించడం జనాన్ని ఆకట్టుకుంది. కృష్ణకు నటునిగా 'మంచిమిత్రులు' మంచి పేరు సంపాదించి పెట్టింది. తరువాత 1969లోనే ఏప్రిల్ 4వ తేదీన విడుదలైన జానపద చిత్రం 'బొమ్మలు చెప్పిన కథ'లో కాంతారావుకు జోడీగా విజయనిర్మల నటించారు. ఈ సినిమాలో రాయిగా మారిన భర్తను రక్షించుకోవడానికి నాయిక విజయనిర్మల లోతైన ప్రదేశం నుండి నీళ్ళు తెచ్చి ఆ విగ్రహంపై పోయడం హృదయాలను ద్రవింప చేస్తుంది. ఆ సీన్ లోనూ అన్నాచెల్లెళ్ళుగా కృష్ణ, విజయనిర్మల రక్తి కట్టించారు. జి.విశ్వనాథం దర్శకత్వంలో డి.రామానాయుడు సురేశ్ మూవీస్ పతాకంపై 'బొమ్మలు చెప్పిన కథ'ను నిర్మించారు. ఈ సినిమా మంచి ఆదరణ చూరగొంది. ఇక కృష్ణ, విజయనిర్మల అన్నాచెల్లెళ్ళుగా నటించిన చివరి చిత్రం 'ముహూర్త బలం' 1969 జూన్ 13న జనం ముందు నిలచింది. యమ్.మల్లికార్జునరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కృష్ణకు జోడీగా జమున నటించగా, విజయనిర్మలను పెళ్ళాడే పాత్రలో హరనాథ్ నటించారు. ఈ సినిమా అంతగా అలరించలేక పోయింది. తెలుగునాట మరపురాని జంటగా నిలచిన కృష్ణ, విజయనిర్మల అన్నాచెల్లెళ్ళుగా నటించిన ఈ మూడు చిత్రాలు అభిమానులకు ప్రత్యేకమని చెప్పవచ్చు. ఈ సినిమాల్లో 'మంచి మిత్రులు, బొమ్మలు చెప్పిన కథ' రిపీట్ రన్స్ లోనూ అలరించడం విశేషం!

Updated Date - Feb 20 , 2025 | 07:14 PM