Chinnanaati Snehithulu: యన్టీఆర్ ఉన్నా... కె.విశ్వనాథ్ పొరపాటు
ABN , Publish Date - Feb 19 , 2025 | 05:57 PM
ప్రముఖ గీత రచయితలు సైతం ఒక్కోసారి చేయని తప్పుకు మాట పడాల్సి వస్తుంది. ఎన్టీఆర్ కథానాయకుడిగా కె. విశ్వనాథ్ తెరకెక్కించిన 'చిన్ననాటి స్నేహితులు' చిత్రంలోని పాట విషయంలో అదే జరిగింది.
పొరపాటు అన్నది మానవసహజం! అయితే తరచూ పొరపాట్లు చేయడం సబబు కాదు. అలా పండితులు సైతం పొరపాట్లు చేసిన సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఈ ముచ్చటంతా ఎందుకంటే తెలుగు భాషపై అన్న నందమూరి తారక రామారావు (NTR)కు ఎంతటి అభిమానమో అందరికీ తెలిసిందే! ఇక దర్శకుడు కె.విశ్వనాథ్ (K.Viswanath) చిత్రాలలో సంగీతసాహిత్యాలకు ఎంతటి పెద్ద పీట వేస్తారో కూడా తెలుగువారికి కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ ఇద్దరి కలయికలో రూపొందిన 'చిన్ననాటి స్నేహితులు' అనే చిత్రంలో ఓ పాటలో ఓ భయంకరమైన నెనరు దొర్లింది. సినిమా విడుదలయ్యాక ఆ పాట రాసిన రచయిత డాక్టర్ సి.నారాయణ రెడ్డి (Dr.C.Narayana Reddy)ని, సంగీత దర్శకుడు టి.వి.రాజు (TV Raju)ను, గానం చేసిన సుశీలమ్మ (P.Suseela)ను అందరూ తిట్టుకున్నారు. ఆ చిత్రంలో యన్టీఆర్ కు నిజజీవితంలోనూ స్నేహితుడైన జగ్గయ్య (Jaggayya) ప్రధాన పాత్ర పోషించారు. ఆయనకు కూడా భాషమీద ఎంతో పట్టుంది. ఇక ఆ చిత్ర నిర్మాత డి.వి.యస్.రాజు (DVS Raju)కు సైతం మాతృభాష తెలుగుపై ఎంతో మమకారం ఉంది. ఇంతమందికి అమ్మ భాషపై ఎంతటి అభిమానమున్నా పాటలో తప్పు దొర్లడం సాహితీ ప్రియులను ఆవేదనకు గురి చేసింది.
ఇంతకూ విషయమేంటంటే - 'చిన్ననాటి స్నేహితులు' చిత్రంలో పిల్లవాణ్ణి ఉయ్యాలలో వేసే సందర్భంలో పాట వస్తుంది. ఆ పాట "నోములు పండగా... నూరేళ్ళు నిండగా..." అంటూ మొదలవుతుంది. నిజానికి 'నూరేళ్ళు నిండడం' అన్న జాతీయాన్ని ఎవరైనా కన్నుమూస్తే ఉపయోగిస్తూ ఉంటాం. లేదా పిన్నవయసులోనే అసువులు బాసిన వారి విషయంలోనూ 'అప్పుడే నీకు నూరేళ్ళు నిండాయా...' అంటూ వాపోవడం చూస్తూంటాం. అందువల్ల ఆ పాట "నూరేళ్ళు నిండగా..." అంటూ వినిపించగానే సాహిత్యం తెలిసిన వాళ్ళు బాధపడుతూ థియేటర్ల నుండి లేచిపోయారట. అంతటి పరిజ్ఞానం లేని ప్రేక్షకులు ఏమీ పట్టించుకోలేదు. అయితే విమర్శకులు మాత్రం పిల్లవాడి బారసాల సమయంలో 'నోములు పండగా...' అన్నది ఎంతో బాగుంది... వెనువెంటనే 'నూరేళ్ళు నిండగా...' అన్న వాక్యం రావడం శుద్ధ తప్పు అన్నారు. ఈ విమర్శ గీత రచయిత సి.నారాయణ రెడ్డి చెవికి సోకింది. ఆయన అప్పుడు తప్పు గ్రహించారు. తాను "నోములు పండగా...నూరేళ్ళు నిండుగా..." అని రాశానని, ట్రాక్ సింగర్స్ ఎవరో తప్పు పాడితే, దానినే గాయని సుశీల కూడా తప్పుగా ఆలపించారని వివరించారు. కానీ, యన్టీఆర్, జగ్గయ్య, కె.విశ్వనాథ్, డి.వి.యస్.రాజు, టి.వి.రాజు, సుశీల ఇంతమంది భాషాభిమానులు ఉండి కూడా తప్పు దొర్లడం క్షమార్హం కాదనే పలువురు అభిప్రాయపడ్డారు. అందుకు తరువాత అందరూ చింతించారు. ఏది ఏమైనా యన్టీఆర్ హీరోగా కె.విశ్వనాథ్ చిత్రంలో ఇంతటి తప్పు దొర్లడాన్ని అభిమానులూ జీర్ణించుకోలేక పోయారు.