Actor: రావు గోపాలరావు డైరెక్షన్
ABN , Publish Date - Apr 12 , 2025 | 02:02 PM
ప్రముఖనటుడు, స్వర్గీయ రావు గోపాల రావు మంచి నటుడే కాదు... దర్శకుడు కూడా. రంగస్థల దర్శకుడైన రావు గోపాలరావు ఓ సినిమాలో దర్శకుడిగా నటించడం విశేషం.
నటవిరాట్ రావు గోపాలరావు (Rao Gopala Rao) అనగానే ఆయన ధరించిన అనేక విలక్షణమైన పాత్రలు మనల్ని ముందుగా పలకరిస్తాయి. అయితే చిత్రసీమలో అడుగుపెట్టకముందు పలు నాటకాలలో రావు గోపాలరావు నటించడమే కాదు దర్శకత్వం వహించీ అలరించారు. గోపాలరావు మనసు సినిమాలవైపు పరుగు తీయడానికి కారణం ప్రముఖ దర్శకనిర్మాత గుత్తా రామినీడు (G.Ramineedu) అనే చెప్పాలి. రావు గోపాలరావు ఒడ్డూ పొడుగూ మేని ఛాయ చూసి సినిమాలకు పనికి వస్తావని రామినీడు అన్నారు. అలా అన్న మాటలే గోపాలరావును మద్రాసు వెళ్ళేలా చేశాయి. రామినీడు దగ్గరే ఉండేవారు. రామినీడు దర్శకత్వం వహించే చిత్రాలకు అసోసియేట్ గా పనిచేశారు గోపాలరావు. సదరు చిత్రాల్లోనే చిన్న వేషాలూ వేసేవారు. అలా రామినీడు తెరకెక్కించిన 1966 నాటి 'భక్త పోతన' (Bhakta Potana)లో మామిడి సింగనామాత్యుని పాత్ర పోషించారు. గుమ్మడి పోతనగా, శ్రీనాథునిగా ఎస్వీరంగారావు నటించిన 'భక్త పోతన' ఘోరపరాజయం పాలయింది. ఆ తరువాత రామినీడు తెరకెక్కించిన 'బంగారు సంకెళ్ళు'కు కూడా రావు గోపాలరావు అసోసియేట్ గా పనిచేశారు. అందులో సినిమా డైరెక్టర్ గానే ఓ పాత్ర పోషించారు. జమున, హరనాథ్, రామకృష్ణ నటించిన ఈ చిత్రం కూడా అంతగా మెప్పించలేదు. ఏవో బిట్ రోల్స్ వేసుకుంటూ సాగారు రావు గోపాలరావు. ఆ సమయంలో కె.విశ్వనాథ్ తెరకెక్కించిన 'కాలం మారింది'లోని కోటేశు పాత్ర, 'శారద'లోని బాబాయ్ పాత్ర గోపాలరావుకు మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. విశ్వనాథ్ లాగే బాపు కూడా గోపాలరావును ప్రోత్సహించారు. 'ముత్యాలముగ్గు'లో రావు గోపాలరావు పోషించిన కాంట్రాక్టర్ పాత్ర, 'భక్త కన్నప్ప'లో ధరించిన కైలాసనాథ శాస్త్రి పాత్రలతో జనం మదిలో తిష్ట వేసుకున్నారు గోపాలరావు. ఆ తరువాత వచ్చిన 'యమగోల'తో కేరెక్టర్ యాక్టర్ గా, విలన్ గా, కమెడియన్ గా యమ బిజీ అయిపోయారు. రోజుకు మూడు షిఫ్టులు చేస్తూ సాగారు. యన్టీఆర్ సినిమాల్లోనే కాదు, తరువాతి తరం హీరోలయిన కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వాళ్ళ నెక్ట్స్ జనరేషన్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మోహన్ బాబు సినిమాల్లోనూ రావు గోపాలరావు నటన నభూతో నభవిష్యతి అన్నట్టుగా సాగింది.
సినిమా రంగంలో అడుగుపెట్టక ముందు కొన్ని నాటకాలకు దర్శకత్వం వహించిన రావు గోపాలరావు 1963లో 'విక్రాంతి' అనే డ్రామాకు డైరెక్టర్ గా వ్యవహరించారు. ఆ యేడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ సూర్యకళామందిరంలో ఆ నాటికను ప్రదర్శించారు. డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు రాసిన నాటిక అది. తన మిత్రులు హెరాల్డ్, ఐవీయస్ శర్మ సహకారంతో ఆ నాటికను రక్తి కట్టించారు రావు గోపాలరావు. దాదాపు 62 ఏళ్ళ నాటి 'విక్రాంతి' నాటిక కరపత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. సినిమా రంగంలో ముందుగా దర్శకత్వ శాఖలో అడుగుపెట్టిన రావు గోపాలరావు నటుడైన తరువాత డైరెక్షన్ ఊసు ఎత్తుకోలేదు. సొంత చిత్రాలు నిర్మించే సమయంలోనూ ఆ మాటే గుర్తు చేసుకోలేదు.
Also Read: Priya Prakash Varrier: కన్నుగీటే పిల్ల ఎమోషనల్ పోస్ట్
Also Read: Raid -2: నిషా కళ్ళతో నషా నింపుకుని తినేయమంటున్న తమన్నా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి