NTR: 'పాతాళభైరవి' కుక్కల గోల!
ABN , Publish Date - Feb 19 , 2025 | 05:34 PM
'పాతాళ భైరవి' సినిమా ఊసు వచ్చినప్పుడల్లా కళాతపస్వి కె. విశ్వనాథ్ ఓ ముచ్చటను గుర్తు చేసుకునేవారు. అదేంటో తెలుసా!?
'పాతాళభైరవి' చిత్రం 1951 మార్చి 15న విడుదలై విజయఢంకా మోగించింది. ఆ సినిమాతోనే విజయా (Vijaya Productions) సంస్థ తొలి ఘనవిజయం చూసింది. ఆ చిత్రంతోనే తెలుగు సినిమా మొట్టమొదటి స్వర్ణోత్సవం (First Golden Jubilee) చేజిక్కించుకుంది. 'పాతాళభైరవి'తోనే యన్టీఆర్ (NTR) సూపర్ స్టార్ గా మారిపోయారు. ఇక అప్పట్లోనే మొదటి రిలీజ్ లో పది కేంద్రాలలో శతదినోత్సవం చూసిన ఈ సినిమా తరువాత మరో 24 కేంద్రాలలో వందరోజులు ప్రదర్శితమయింది. అలా 34 కేంద్రాలలో నూరు రోజులు, కొన్ని కేంద్రాలలో రజతోత్సవం, కొన్ని సెంటర్స్ లో స్వర్ణోత్సవం చూసింది 'పాతాళభైరవి'. చరిత్రకారులు సైతం తెలుగునాట తొలి బిగ్ హిట్ గా 'పాతాళభైరవి'నే పేర్కొంటారు. తెలుగునేలపై అత్యధిక సార్లు రిపీట్ రన్స్ చూసిన చిత్రంగానూ 'పాతాళభైరవి' నిలచింది. అప్పటి వసూళ్ళ వర్షాలను ఇప్పటి లెక్కలతో బేరీజు వేస్తే ఈ నాటికీ 'పాతాళభైరవి' నంబర్ వన్ మూవీగా నిలుస్తుందని ట్రేడ్ పండిట్స్ చెబుతారు. అంతటి చరిత్ర సృష్టించిన 'పాతాళభైరవి' ఆ నాటి అభిమానులను విశేషంగా అలరించింది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ సౌండ్ విభాగంలో అసిస్టెంట్ గా పనిచేశారు. 'పాతాళభైరవి' సినిమా గుర్తుకు వస్తే అందరికీ అందులోని తోటరాముడు, నేపాల మాంత్రికుడు, రాజకుమారి, అంజి వంటి పాత్రలు గుర్తుకు రావచ్చు- అలాగే ఆ సినిమాలోని మధురమైన గీతాలూ స్ఫురించవచ్చు. కానీ, కె.విశ్వనాథ్ కు మాత్రం ఆ సినిమా పేరు తలచుకోగానే 'అర్ధరాత్రి పూట కుక్కల గోల' గుర్తుకు వస్తుందని చెప్పేవారు. ఏమిటా సంగతి!?
'పాతాళభైరవి'లో తోటరాముడిని నేపాల మాంత్రికుడు పాతాళభైరవి ఉండే భూగర్భ గుహకు తీసుకుపోతాడు. అక్కడ భూగర్భం నుండి కొన్ని మూలుగులు వినిపిస్తూంటాయి. అవి వినిపించగానే మాంత్రికుడు "జై...పాతాళభైరవి..." అంటూ ఉంటాడు. ఆ సీన్ ను ఓ అర్ధరాత్రి పూట చిత్రీకరించారట. విజయవాహినీ స్టూడియోస్ లో ఓపెన్ ప్లేస్ లో వేసిన సెట్ లో ఆ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో 'ఓ...' అంటూ మూలుగులు వినిపించే రికార్డ్ వేసేవారట. ఆ మూలుగులు విని బయట వీధుల్లో ఉన్న కుక్కలు ఒక్కసారిగా గోల చేసేవట.. అప్పట్లో స్పాట్ రికార్డింగ్ ఉండేది. కుక్కలను అదుపు చేయకపోతే వాటి అరుపులు కూడా రికార్డవుతాయని సౌండ్ ఇంజనీర్ ఎ.కృష్ణన్ కంగారు పడేవారు. దాంతో స్టూడియో బయట ఉన్న వీధికుక్కలను తోలే పనిని అసిస్టెంట్ రికార్డిస్ట్ గా ఉన్న కె.విశ్వనాథ్ కు పురామాయించారు. ఆయన, నటుడు బాలకృష్ణ, మరికొందరు వెళ్ళి కుక్కలను తోలేసి వచ్చేవారట. మళ్ళీ షూటింగ్ మొదలు కాగానే, సౌండ్ వినిపించడం కుక్కలు గుమి కూడి మొరగడం జరిగేదట. ఇక లాభం లేదనుకొని విశ్వనాథ్, మరికొందరు స్టూడియో వాళ్ళు కలసి ఆ కుక్కలను వేరే వీధి దాకా సాగనంపి, అవి మళ్ళీ స్టూడియో దరిదాపుల్లోకి రాకుండా కర్రలు పట్టుకొని నుంచున్నారట. అలా కాపలా కాస్తూ ఆ సీన్ షూటింగ్ పూర్తి చేశాక అందరూ ఊపిరి పీల్చుకున్నారట. అందువల్ల ఆ సంఘటనను 'పాతాళభైరవి' మాట వినిపించినపుడల్లా గుర్తు చేసుకొనేవారు విశ్వనాథ్.