NTR: 50 ఏళ్ళ 'కథానాయకుని కథ'

ABN , Publish Date - Feb 21 , 2025 | 01:01 PM

నందమూరి తారక రామారావు కెరీర్ లో ప్రత్యేకమైన చిత్రం 'కథానాయకుని కథ'. దేవీ వర ప్రసాద్ నిర్మాతగా పరిచయం అయిన ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు ఎన్నో... ఎన్నెన్నో...

నటరత్న యన్.టి.రామారావు (NTR) ఎప్పుడూ వైవిధ్యానికి పెద్ద పీట వేసేవారు. తాను అంతకు ముందు ధరించని పాత్రంటూ లభిస్తే మరోమాట లేకుండా ఓకే చెప్పేవారు. కోట్లాది అభిమానులను తన అభినయంతో అలరించిన అన్న యన్టీఆర్, ఓ చిత్రంలో సినిమా స్టార్ గానే కనిపించడం యాభై ఏళ్ళ క్రితం విశేషంగా ముచ్చటించుకున్నారు. ఆ చిత్రమే 'కథానాయకుని కథ'. 1975 ఫిబ్రవరి 21న 'కథానాయకుని కథ' విడుదలై అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంతోనే ప్రముఖ నిర్మాత కె.దేవీవరప్రసాద్ (K. Devi Vara Prasad) పరిచయం కావడం విశేషం! 'తారకరామ పిక్చర్స్' పతాకంపై రూపొందిన ఈ సినిమా పోస్టర్స్ లో కే.డి.వి. ప్రసాద్ గా నిర్మాత పేరు దర్శనమిస్తుంది. టైటిల్ కార్డ్స్ లో మాత్రం కె.దేవీవర ప్రసాద్ అనే వేశారు. డి.యోగానంద్ (D.Yoganand) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వాణిశ్రీ నాయిక కాగా, భారతి మరో ముఖ్యభూమిక పోషించారు.

దేవీవరప్రసాద్ తండ్రి కె.తిరుపతయ్య (K.Tirupataiah) అంతకు ముందు యన్టీఆర్ హీరోగా 'శ్రీకృష్ణావతారం' (1967) చిత్రం నిర్మించారు. ఆ సినిమాకు యన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడైన ఎ.పుండరీకాక్షయ్య కూడా భాగస్వామి. అప్పట్లో తారకరామ పిక్చర్స్ పతాకంపైనే 'శ్రీకృష్ణావతారం' నిర్మించారు. అదే బ్యానర్ తో దేవీవరప్రసాద్ కూడా పరిచయం కావడం విశేషం!


kk ntr.jpg

ఇంతకూ కథ ఏమిటంటే...

యన్టీఆర్ తనకు కొత్తగా అనిపించిన సబ్జెక్ట్ ను ఓకే చేసేస్తారని ఆయన సన్నిహితులకు బాగా తెలుసు. యన్టీఆర్ తో సినిమా అనే సరికి ఓ వైవిధ్యమైన కథను రూపొందించాలని ఆశించారు. రచయిత మోదుకూరి జాన్సన్ సహకారంతో 'కథానాయకుని కథ' స్క్రిప్ట్ రూపొందించారు. ఇందులో పల్లెటూరికి చెందిన రాము పట్నం వెళ్ళి కష్టపడి పనిచేసి ప్రేమించిన అమ్మాయిని పెళ్ళాడాలని ఆశిస్తాడు. అలా వెళ్ళిన అతనికి అదృష్ఠవశాన సినిమా హీరో అయ్యే అవకాశం లభిస్తుంది. ఆ తరువాత పలు పాత్రలు పోషించి సూపర్ స్టార్ అవుతాడు. ఒకప్పుడు పేదవాడని చులకన చేసినవారే రాము స్టార్ డమ్ చూసి చుట్టూ చేరతారు. అతనికే ముప్పు తీసుకు వచ్చే పనీ చేస్తారు. చివరకు స్టార్ హీరో అయిన కథానాయకుడు ప్రేమించిన అమ్మాయిని పెళ్ళాడడంతో కథ సుఖాంతమవుతుంది.

యన్టీఆర్, వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రంలో సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, రాజబాబు, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, పండరీబాయి, జి.వరలక్ష్మి, రమాప్రభ, హేమలత, ఛాయాదేవి, శ్రీవిద్య నటించారు. యన్టీఆర్ ను 'పల్లెటూరి పిల్ల'లో తొలిసారి హీరోగా నటింప చేసిన దర్శక నిర్మాత బి.ఏ.సుబ్బారావు అతిథి పాత్రలో అలరించారు. ఈ చిత్రానికి కేవీ మహదేవన్ స్వరకల్పన చేయగా, కొసరాజు, సి.నారాయణ రెడ్డి, ఆచార్య ఆత్రేయ, దాశరథి పాటలు పలికించారు. అప్పలాచార్య హాస్యరచన చేశారు. ఇందులో ఎనిమిది పాటలున్నాయి. వాటిలో "వేమన్న చెప్పింది వేదమురా...", "చెప్పనా ఒక చిన్న మాటా...", "మగసిరి చూపుల...", "దేవుడే చేస్తాడు పెళ్ళిళ్ళు...", "శ్రీమతిగారూ ఆగండి...", "ఓ చిలిపికళ్ళ బావా..." అంటూ సాగే పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. తరువాతి రోజుల్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా అలరించిన చక్రవర్తి ఈ సినిమాలో "ఓ టైటు ప్యాంటు..." అంటూ సాగే పాటను ఎల్.ఆర్.ఈశ్వరితో కలసి గానం చేశారు.

యన్టీఆర్ హిట్ మూవీస్ క్లిప్స్ తో...

'కథానాయకుని కథ' పేరుకు తగ్గట్టుగానే రూపొందింది. ఇందులో యన్టీఆర్ నటించిన అనేక చిత్రాల క్లిప్స్ ఉపయోగించుకున్నారు. ఆ క్లిప్స్ అభిమానులను విశేషంగా అలరించాయి. దాంతో చూసిన వారే మళ్ళీ మళ్ళీ 'కథానాయకుని కథ'ను తిలకిస్తూ సాగారు. ఇక ఈ సినిమాలో సందర్భానుసారంగా కథానాయకుడు సినిమా స్టార్ అయిన తరువాత తన ఊరికి తిరిగి వస్తాడు. ఆ సమయంలో అతనికి జనం బ్రహ్మరథం పట్టేలా సీన్ ఉంటుంది. ఆ సన్నివేశాన్ని గుంటూరు నాజ్ సెంటర్ లో చిత్రీకరించగా, అప్పట్లోనే లక్షమందికి పైగా జనం విచ్చేశారు. ఆ రోజుల్లో సినిమా వార్తలకు దినపత్రికల్లో అంతగా ప్రాముఖ్యం ఉండేది కాదు. అయినా యన్టీఆర్ కోసం తరలివచ్చిన జనాన్ని చూసి దినపత్రికలు మెయిన్ పేజీలోనే కథనం ప్రచురించడం విశేషం! ఇక ఈ సినిమాలో హీరోను చూసి దర్శకుని పాత్రలో కనిపించిన బి.ఏ.సుబ్బారావు "చూడు ... నేను చెప్పినట్టు వింటే యన్టీరామారావులా గొప్పహీరో అయిపోతావ్..." అని అంటారు. ఆ సీన్ చూసి అభిమానులు భలేగా ఆనందించారు.

కథానుగుణంగా అమరిన సీన్స్...

ఈ సినిమాలో యన్టీఆర్ హీరోగా నటించిన చిత్రాల్లోని సీన్స్ చూపించడంతో అభిమానుల ఆనందం అంబరమంటింది. 'జయసింహ'లోని హీరో ఫైటింగ్ సీన్, 'భీష్మ'లో సర్వసేనానిగా నియమితులైన భీష్ముడు, దుర్యోధనునికి ఉత్సాహం కలిగించే దృశ్యం, 'సీతారామకళ్యాణం'లో లంకాధీశుని సభ, 'శ్రీకృష్ణావతారం'లో విశ్వరూపం సీన్, 'పాండవవనవాసము'లోని "ధారుణి రాజ్యసంపద..." పద్యం చెప్పే సన్నివేశం, 'శ్రీక్రిష్ణపాండవీయం'లో దుర్యోధనుని పరిచయ దృశ్యం కనిపిస్తాయి. తరువాత 'భలేతమ్ముడు'లోని "నేడే ఈ నాడే..." సాంగ్ లోని కొంత భాగమూ తెరపై తళుక్కుమని పులకింప చేస్తుంది. ఇవన్నీ వరుసగా కనువిందు చేయగానే కథానుగుణంగా 'రక్తసంబంధం'లోని క్లయిమాక్స్ సీన్ చూపించారు.


'దానవీరశూర కర్ణ' (Daana Veera Soora Karna)కు బీజం...

ఇక యన్టీఆర్ కు వీపుపై ఎడమభుజం కింద ఉండే పెద్ద పుట్టుమచ్చను ఆధారం చేసుకొని అనేక చిత్రకథలు రూపొందాయి. అదే తీరున ఇందులోనూ ఓ సీన్ ఉంది. అదే సన్నివేశంలో యన్టీఆర్ కర్ణునిగా కనిపిస్తారు. కర్ణుడు కుంతికి వరమిచ్చే సీన్ అది. అక్కడే యన్టీఆర్ పుట్టుమచ్చ సీన్ ను అద్భుతంగా జోడించారు. అదే సీన్ లో కుంతి పాత్రధారి నోట "దానవీరశూర కర్ణుడివై... యశస్వివై వర్ధిల్లు నాయనా..." అనే మాటలు పలికించారు. అప్పటికే యన్టీఆర్ తాను 'దానవీరశూర కర్ణ' చిత్రం తెరకెక్కిస్తానని ప్రకటించి ఉండడంతో ఆ సినిమాపై ఆసక్తి అక్కడ నుంచే జనాల్లో మొదలయిందని చెప్పవచ్చు. అయితే యన్టీఆర్ హీరోగా బిజీ కావడం వల్ల 'దానవీరశూర కర్ణ' షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదాలు చూసింది. చివరకు 1976లో షూటింగ్ మొదలై, కేవలం 45 పనిదినాల్లో పూర్తయింది. తెలుగులో అతి నిడివిగల చిత్రంగానూ నిలచింది. యన్టీఆర్ త్రిపాత్రాభినయం ఎస్సెట్ గా 'దానవీరశూర కర్ణ' 1977 సంక్రాంతి కానుకగావచ్చి అఖండ విజయం సాధించింది.

'కథానాయకుని కథ' స్ఫూర్తితోనే తరువాతి రోజుల్లో కృష్ణ 'డాక్టర్ సినీ యాక్టర్', రజనీకాంత్ 'కథానాయకుడు' వంటి చిత్రాలు రూపొందాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా 'దానవీరశూర కర్ణ'కు బీజం వేసిన 'కథానాయకుని కథ' చిత్రం మంచి ఆదరణ చూరగొంది. అభిమానులను విశేషంగా అలరించింది. రిపీట్ రన్స్ లోనూ ఫ్యాన్స్ ను మురిపించింది.

Updated Date - Feb 21 , 2025 | 01:29 PM