NTR- Dasari: 45 ఏళ్ళ 'సర్కస్ రాముడు'

ABN , Publish Date - Mar 01 , 2025 | 10:42 AM

నటరత్న యన్.టి. రామారావు, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ లో రూపొందిన రెండో చిత్రం 'సర్కస్ రాముడు'. అంతకుముందు నటరత్న, దర్శకరత్న కాంబోలో వచ్చిన 'మనుషులంతా ఒక్కటే' ఘనవిజయం సాధించింది.

నటరత్న యన్.టి. రామారావు (NTR), దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) కాంబినేషన్ లో రూపొందిన రెండో చిత్రం 'సర్కస్ రాముడు'. అంతకుముందు నటరత్న, దర్శకరత్న కాంబోలో వచ్చిన 'మనుషులంతా ఒక్కటే' ఘనవిజయం సాధించింది. ఆ సినిమా తరువాత వీరిద్దరి కలయికలో వస్తోన్న చిత్రంగా మొదటి నుంచీ 'సర్కస్ రాముడు'పై అంచనాలున్నాయి. 1980 మార్చి 1వ తేదీన 'సర్కస్ రాముడు' జనం ముందు నిలచింది. ఈ చిత్రాన్ని అత్యంత భారీగా కోవై చెళియన్ నిర్మించారు. తమిళంలో ఎమ్జీఆర్, శివాజీగణేశన్, జెమినీగణేశన్ తో చిత్రాలు నిర్మించిన కోవై చెళియన్ తెలుగులో యన్టీఆర్ తో ఒక్క సినిమా అయినా తీయాలని ఆశించేవారు. అలా 1979లో ఆయనకు యన్టీఆర్ కాల్ షీట్స్ ఇచ్చారు. అంతకు ముందు యన్టీఆర్ నటించిన 'అడవిరాముడు' సినిమా జంగ్లీ మూవీగా తెరకెక్కి సౌత్ ఇండియాలోనే ఆల్ టైమ్ హిట్ గా నిలచింది. ఈ నేపథ్యంలోనే అలాంటి ఓ జంగ్లీ మూవీని రామారావుతో తీయాలని కోవై చెళియన్ ఆశించారు. అందువల్ల ఖర్చుకు వెనుకాడకుండా 'సర్కస్ రాముడు' చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కథలో ఏ మాత్రం కొత్తదనం కనిపించదు. ఎందుకంటే అంతకు ముందు యన్టీఆర్ నటించిన 'రాముడు-భీముడు' వంటి అనేక డ్యుయల్ రోల్ మూవీస్ కథలనే కలగాపులగం చేసి 'సర్కస్ రాముడు' తెరకెక్కించినట్టుగా ఉంటుంది. అయితే ఈ సినిమాకు మొదటి నుంచీ ఉన్న హైప్ ను బట్టి ఓపెనింగ్స్ భలేగా వచ్చాయి. సినిమా మాత్రం థియేటర్లలో ఎక్కువ రోజులు చిందేయలేకపోయింది.


యన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో జయప్రద, సుజాత నాయికలు. రావు గోపాలరావు ప్రతినాయకుడు. గోపాలరావు పాత్ర అచ్చు 'రాముడు-భీముడు'లో రాజనాల పాత్రను పోలినట్టుగా ఉంటుంది. యన్టీఆర్ సరసన సుజాత నాయికగా నటించిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం! తరువాతి రోజుల్లో యన్టీఆర్ చెల్లెలిగా 'మహాపురుషుడు'లో నటించారు సుజాత. దాసరి పలు చిత్రాల్లో నటించిన మోహన్ బాబు ఇందులో ఓ ఛోటా రౌడీగా కనిపిస్తారు. కేవీ మహదేవన్ స్వరకల్పనలో వేటూరి రాసిన ఏడు పాటలూ అలరించాయి.


'అడవిరాముడు' చిత్రీకరణ జరుపుకున్న ముదుమలై ఫారెస్ట్ లోనే ఈ సినిమా కూడా షూటింగ్ జరుపుకుంది. అయితే ఆ సినిమాలో లాగా మొత్తం కాకుండా, కొన్ని పాటలు, కొన్ని సీన్స్ మాత్రమే అడవుల్లో చిత్రీకరించారు. "ఓ బొజ్జ గణపయ్య..." అంటూ సాగే పాటలో ఏనుగులను ఉపయోగించారు. టైటిల్ 'సర్కస్ రాముడు' కావడంతో పలు సీన్స్ ను సర్కస్ లో రూపొందించారు. అప్పట్లో 'భారత్ సర్కస్' విశేషాదరణ చూరగొంటూ ఉండేది. 'భారత్ సర్కస్'లోనే 'సర్కస్ రాముడు' షూటింగ్ జరిగింది. క్లయిమాక్స్ ఫైట్ ను, రెండు పాటలను అందులో తెరకెక్కించారు. "రాముడంటే రాముడు... సర్కస్ రాముడు..." అనే టైటిల్ సాంగ్ ను, "ఆకలి మీద ఆడపులి..." అంటూ సాగే యన్టీఆర్, జయమాలిని పాటను సర్కస్ లోపల, బయట చిత్రీకరించారు. అంతకు ముందు రాజ్ కపూర్ నటించిన 'మేరా నామ్ జోకర్' కూడా ఎక్కువ భాగం సర్కస్ లో చిత్రీకరణ జరుపుకుంది. ఆ సినిమా పరాజయం పాలయింది. దానిని పోలుస్తూ టాప్ స్టార్స్ కు సర్కస్ అచ్చిరాదన్నారు. కానీ, 'సర్కస్ రాముడు' థియేటర్లలో రన్నింగ్ సరిగా చూడలేకపోయినా, నిర్మాత కోవై చెళియన్ ను నష్టాల పాలు కాకుండా కాపాడేలా వసూళ్ళు రాబట్టింది. తరువాతి రోజుల్లో కమల్ హాసన్ 'విచిత్ర సోదరులు' కూడా సర్కస్ లోనే చిత్రీకరణ జరుపుకొని విజయం సాధించడం గమనార్హం!

Also Read: Progress Report: ఫిబ్రవరి మాసం 'తండేల్' చిత్రానిదే!

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 01 , 2025 | 10:42 AM