NTR: యన్టీఆర్ ఆశీస్సులు పొందిన రికార్డ్ బ్రేక్ గురుశిష్యులు
ABN , Publish Date - Feb 28 , 2025 | 01:30 PM
ప్రతిభ ఎక్కడ ఉన్నా సరే గుర్తించి ప్రోత్సహించడం నటరత్న యన్టీఆర్ (NTR)కు అలవాటు. అలాగే ఆయన అభినందనలు అందుకున్న ఎందరో తరువాతి రోజుల్లో చిత్రసీమలో రాణించారు. ఆయన ఆశీస్సులు పొంది తెలుగునాట రికార్డ్ సృష్టించిన ఇద్దరు గురుశిష్యులు ఉన్నారు.
ప్రతిభ ఎక్కడ ఉన్నా సరే గుర్తించి ప్రోత్సహించడం నటరత్న యన్టీఆర్ (NTR)కు అలవాటు. అలాగే ఆయన అభినందనలు అందుకున్న ఎందరో తరువాతి రోజుల్లో చిత్రసీమలో రాణించారు. ఆయన ఆశీస్సులు పొంది తెలుగునాట రికార్డ్ సృష్టించిన ఇద్దరు గురుశిష్యులు ఉన్నారు. వారే దర్శకరత్న దాసరి నారాయణ రావు (Dasari Narayana Rao), ఆయన శిష్యుడు కోడి రామకృష్ణ (Kodi Ramakrishna). వీరిద్దరూ యన్టీఆర్ నటించిన సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న సమయంలోనే అభినందనలు అందుకున్నవారు. ఆయన ఆశీస్సులు ఫలించి ఇద్దరూ శతాధిక చిత్రాలు రూపొందించి రికార్డ్ సృష్టించారు. 151 సినిమాలకు దర్శకత్వం వహించి గురువు దాసరి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నారు. ఇక శిష్యుడు కోడి రామకృష్ణ తెలుగునాట అత్యధిక స్వర్ణోత్సవ చిత్రాల దర్శకునిగా చరిత్ర సృష్టించారు. అలా ఈ గురుశిష్యులిద్దరూ ఎవరికి వారు తమకంటూ కొన్ని ప్రత్యేక రికార్డులు సొంతం చేసుకోవడం విశేషం!
విషయంలోకి వస్తే - యన్టీఆర్ హీరోగా రూపొందిన 'ఒకే కుటుంబం' (1970) చిత్రానికి ఎ.భీమ్ సింగ్ దర్శకుడు. ఆ చిత్రానికి దాసరి నారాయణరావు కో-డైరెక్టర్ గా పనిచేశారు. ఆ సమయంలో భీమ్ సింగ్ కు దిలీప్ కుమార్ హీరోగా 'గోపి' (1970) అనే హిందీ సినిమా దర్శకత్వం వహించవలసిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఆ విషయం రామారావు దృష్టికి తీసుకురాగా, ఆయన అభినందించి వెళ్ళమన్నారు. అప్పుడు యన్టీఆర్ తో పాటు ఇతరులు నటించిన కొన్ని సీన్స్ ను కో-డైరెక్టర్ అయిన దాసరి నారాయణ రావు చిత్రీకరించారు. ఇందులో యన్టీఆర్, ఆయన తల్లిగా నటించిన నటి రుక్మిణిపై ఓ సన్నివేశాన్ని దాసరి నారాయణరావు షూట్ చేశారు. ఆ సీన్ రషెస్ చూసిన తరువాత చిత్ర నిర్మాణభాగస్వామి అయిన నటుడు నాగభూషణం భలేగా ఉందని భావించారు. ఆ విషయాన్ని యన్టీఆర్ కు చెప్పారు. రామారావు ఆ సీన్ చూసి దాసరిని ఎంతగానో అభినందించారు. అంతేకాదు, 'మీరు సొంతగా డైరెక్ట్ చేసే సినిమాలో నటించాలని ఉందని' అన్నారు యన్టీఆర్. చప్పున రామారావుకు పాదాభివందనం చేశారు దాసరి. అలాగే తరువాతి రోజుల్లో యన్టీఆర్ దీవెన ఫలించి, ఆయనతోనే "మనుషులంతా ఒక్కటే, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు, విశ్వరూపం, బొబ్బిలిపులి" వంటి చిత్రాలు రూపొందించారు దాసరి. ఈ సినిమాల్లో 'సర్కస్ రాముడు, విశ్వరూపం' మినహాయిస్తే మిగిలిన మూడు చిత్రాలు సంచలనం సృష్టించాయి.
నటరత్నతో దర్శకరత్న తెరకెక్కించిన తొలి చిత్రం 'మనుషులంతా ఒక్కటే'. ఆ సినిమా షూటింగ్ సమయంలోనిదే పైన మనం చూస్తున్న స్టిల్. ఈ సినిమాకు కోడిరామకృష్ణ అసోసియేట్ గా పనిచేశారు. ఇందులో పేదవారిని హింసించడం నచ్చక తన జమీందార్ తండ్రితో విభేదించి హీరో యన్టీఆర్ ఇంటి నుండి బయటకు వెళ్ళే సీన్ ఉంది. ఆ సీన్ ను మైసూర్ ప్యాలెస్ లో చిత్రీకరించారు. ఆ సన్నివేశాన్ని కోడిరామకృష్ణ డిజైన్ చేయడం విశేషం! ఇంటి నుండి వెళ్ళిపోతున్న యన్టీఆర్ ను మెట్లపైన, అన్నను ఆగమని చెప్పే చెల్లెలు రాజశ్రీని తలుపు దగ్గర నించోబెట్టి, మనసు మార్చుకోని తండ్రి సత్యనారాయణను గదిలోనే ఉండేలా నిలబెట్టి సీన్ తీశారు. ఆ షాట్ పూర్తి కాగానే అలా ఆర్టిస్టులను పొజిషన్ చేయడం నచ్చిన యన్టీఆర్ దర్శకుడు దాసరిని అభినందించారు. అది తన శిష్యుడు కోడి రామకృష్ణ ఐడియా అని చెప్పగానే, ఆయననూ యన్టీఆర్ ఆలింగనం చేసుకున్నారు. ఒకప్పుడు 'ఒకే కుటుంబం' సమయంలో దాసరికి చెప్పినట్టుగానే కోడి రామకృష్ణతోనూ రామారావు 'మీ డైరెక్షన్ లో నటించాలని ఉంది' అన్నారు. వెంటనే రామారావుకు పాదాభివందనం చేశారు కోడి. అయితే యన్టీఆర్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కోడి రామకృష్ణకు దక్కలేదు. అయితేనేం, యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణతో "మంగమ్మగారి మనవడు, ముద్దుల క్రిష్ణయ్య, ముద్దుల మావయ్య" వంటి గోల్డెన్ జూబ్లీ హిట్స్ తీసి రికార్డు సృష్టించారు కోడి రామకృష్ణ. ఓ హీరోతో ఓ దర్శకుడు ఒకే బ్యానర్ లో మూడు స్వర్ణోత్సవాలు రూపొందించిన ఘనత తెలుగునాట ఒక్క కోడి రామకృష్ణకే దక్కడం విశేషం. అది యన్టీఆర్ నటవారసుడు బాలయ్యతోనే అందుకోవడం మరపురాని అంశమని కోడి రామకృష్ణ చెప్పేవారు.
అలా యన్టీఆర్ అభినందనలు, ఆశీస్సులు అందుకున్న గురుశిష్యులు దాసరి, కోడి ఇద్దరూ తెలుగు చిత్రసీమలో చరిత్ర సృష్టించడం అరుదైన విషయం!