Krishnaveni Vs Anr: 75 ఏళ్ళ నాడే భలే పోటీ!
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:23 PM
ఏడున్నర దశాబ్దాల క్రితం ఒకే కథాంశంతో తెరకెక్కిన రెండు సినిమాలు పోటాపోటీగా ఒకేసారి విడుదలయ్యాయి. ఒకదానిలో కృష్ణవేణి నటించగా, మరో చిత్రంలో అంజలీదేవి నటించారు. మరి ఎవరిది పైచేయి అయ్యింది!?
ఒకే ఇతివృత్తంతో తెరకెక్కిన రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల కావడం అన్నది నిస్సందేహంగా అరుదైన అంశమే! అలాంటి అరుదైన విషయానికి తొలిసారి వేదికను ఏర్పాటు చేసిన ఘనత 'శ్రీలక్ష్మమ్మ కథ', 'లక్ష్మమ్మ' చిత్రాలకు దక్కింది. ఈ రెండు సినిమాలు 1950 ఫిబ్రవరి 26న విడుదలయ్యాయి.
'శ్రీలక్ష్మమ్మ కథ'ను ప్రతిభా పిక్చర్స్ పతాకంపై ఘంటసాల బలరామయ్య నిర్మించి, దర్శకత్వం వహించారు. ఇందులో అంజలీదేవి (Anjali Devi), అక్కినేని నాగేశ్వరరావు (ANR) జంటగా నటించారు. మరోవైపు మీర్జాపురం రాజా, ఆయన సతీమణి కృష్ణవేణి కలసి 'లక్ష్మమ్మ' ను రూపొందించారు. త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మమ్మ'లో కృష్ణవేణి (Krishna Veni), సిహెచ్. నారాయణరావు (Ch.Narayana Rao) భార్యాభర్తలుగా అభినయించారు. నిజానికి నిజజీవితంలో మీర్జాపురం రాజా, ఘంటసాల బలరామయ్య మంచి మిత్రులు. మరి వీరిద్దరూ ఒకే ఇతివృత్తంతో పోటీపడి చిత్రాలు నిర్మించడానికి కారణమేమిటి అంటారా? అప్పటికే ఏయన్నార్ అంజలీదేవి జంటగానే బలరామయ్య 'స్వప్నసుందరి' అనే జానపదాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే లక్ష్మమ్మ కథను రాజావారు తీస్తున్నారని తెలియగానే, తామూ అదే ఇతివృత్తంతో సాగాలని బలరామయ్య ఆశించారు. ఎందుకంటే ఆ సమయంలో భక్తిభావం తొణికిసలాడే చిత్రాలకు ఆదరణ ఉందని ఆయన భావించారు. ఈ విషయం రాజావారికీ తెలియజేశారు. అలాగే కానీయండి అంటూ ఇద్దరు మిత్రులు పోటీపడి చిత్రాలు నిర్మించారు.
తెలుగునేలపై మహాభక్తులను సైతం దేవతలుగా ఆరాధించడం కొత్తకాదు. అలా లక్ష్మమ్మ కూడా పూజలు అందుకుంటున్నారు. ఆమె భర్త వ్యసనపరుడై, భార్యను అనుమానించి చంపుతాడు. అతని కళ్ళు పోతాయి. అతని తల్లి, సోదరి చెప్పుడు మాటలు విని భార్యను చంపుకున్నానని, తానెంతో పాపం చేశానని వాపోతాడు. పతివ్రత అయిన లక్ష్మమ్మ దేవతగా కొలువై, భర్తకు చూపును ప్రసాదిస్తుంది. రెండు సినిమాల్లోనూ ఒకే కథ. అయినా జనం మీర్జాపురం రాజావారు నిర్మించిన 'లక్ష్మమ్మ'నే ఆదరించారు. ఈ చిత్రానికి గోపీచంద్ స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకొనేలా సాగింది. సినిమాకు స్క్రీన్ ప్లే ఎంత ముఖ్యమో ఆ రోజుల్లో 'లక్ష్మమ్మ' చాటి చెప్పిందని ఈ నాటికీ అప్పటి అభిమానులు చెబుతూనే ఉంటారు. తరువాతి రోజుల్లోనూ దేవతలుగా కొలువైన మహా ఇల్లాళ్ళ గాథలతో కొన్ని సినిమాలు రూపొంది అలరించాయి.