K viswanath: నటరత్న - నటసమ్రాట్ తో విశ్వనాథ్
ABN , Publish Date - Feb 19 , 2025 | 03:57 PM
మహానటులు నటరత్న యన్.టి.రామారావు (NTR), నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (ANR) ఇద్దరితోనూ కళాతపస్వి కె.విశ్వనాథ్ కు విడదీయరాని అనుబంధం ఉంది.
మహానటులు నటరత్న యన్.టి.రామారావు (NTR), నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (ANR) ఇద్దరితోనూ కళాతపస్వి కె.విశ్వనాథ్ కు విడదీయరాని అనుబంధం ఉంది. తాను బి.యస్సీ, పూర్తి చేసి రాగానే విజయా-వాహినీ సంస్థలో ప్రముఖ సౌండ్ ఇంజనీర్ ఎ.కృష్ణన్ (A.Krishnan) వద్ద అసిస్టెంట్ రికార్డిస్ట్ గా చేరారు విశ్వనాథ్. అలా యన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం 'షావుకారు'కు పనిచేశారు విశ్వనాథ్. ఆ చిత్రానికి పి.వి.కోటేశ్వరరావు (PV Koteswara Rao) అనే రికార్డిస్ట్ ఉండేవారు. అలాగే 'షావుకారు' చిత్రంలో కీలక పాత్ర పోషించిన వి. శివరామ్ (V.Sivaram) కూడా రికార్డిస్ట్ గా చేసేవారు. వారి వద్ద అసిస్టెంట్ గా విశ్వనాథ్ తన సినీజీవితం ఆరంభించారు. విజయా సంస్థ నిర్మించిన అనేక చిత్రాలకు సౌండ్ విభాగంలో పనిచేశారు విశ్వనాథ్. అంతేకాదు, ఆయన తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం విజయ సంస్థ ప్రతినిధిగా వారు నిర్మించే చిత్రాల షూటింగ్ వ్యవహారాలు, పంపిణీ చేసే సినిమాల విడుదల చూసుకొనేవారు. అలా విజయా సంస్థలో ఉండగానే యన్టీఆర్ తో కె.విశ్వనాథ్ కు మంచి అనుబంధం ఏర్పడింది. యన్టీఆర్ కూడా 'మా పంతులుగారబ్బాయి' అంటూ విశ్వనాథ్ ను ఎంతో గౌరవించేవారు.
సౌండ్ ఇంజనీర్ గా పనిచేసిన తరువాత విశ్వనాథ్ ఎడిటింగ్ లోనూ కాస్త పరిజ్ఞానం పెంచుకున్నారు. దాంతో ఎడిటర్-డైరెక్టర్ అయిన ఆదుర్తి సుబ్బారావు (Adurthi Subba Rao)కు బాగా నచ్చారు. ఆదుర్తి తెరకెక్కించిన "చదువుకున్న అమ్మాయిలు, మూగమనసులు" వంటి చిత్రాలకు అసోసియేట్ గా పనిచేశారు. ఆ సినిమాల సమయంలోనే 'అన్నపూర్ణ' సంస్థాధినేత దుక్కిపాటి మధుసూదనరావు (D.Madhusudana Rao)కు దగ్గరయ్యారు విశ్వనాథ్. అలాగే అన్నపూర్ణ సంస్థ ఛైర్మన్ అయిన ఏయన్నార్ తోనూ మంచి అనుబంధం ఏర్పడింది. వారి ప్రోత్సాహంతోనే 'ఆత్మగౌరవం' చిత్రంతో దర్శకునిగా పరిచయం అయ్యారు విశ్వనాథ్.
యన్టీఆర్ తో విశ్వనాథ్ తెరకెక్కించిన తొలి చిత్రం 'కలిసొచ్చిన అదృష్టం'. ఇందులోనే యన్టీఆర్ ను వైవిధ్యంగా చూపించే ప్రయత్నం చేశారు విశ్వనాథ్. తరువాత "నిండు హృదయాలు, చిన్ననాటి స్నేహితులు, నిండుదంపతులు" వంటి చిత్రాలనూ యన్టీఆర్ హీరోగా రూపొందించారు విశ్వనాథ్. ఈ సినిమాల్లో 'నిండుహృదయాలు' మంచి విజయం సాధించింది. 'నిండుదంపతులు' పరాజయం పాలయింది. ఆ తరువాత మళ్ళీ యన్టీఆర్, విశ్వనాథ్ తో కలసి పనిచేయలేదు. బహుశా, యన్టీఆర్ కు తగ్గ కథతో విశ్వనాథ్ ఆయనను కలిసింది లేదనే చెప్పాలి. అయితే తన తొలి సినిమా 'ఆత్మగౌరవం' హీరో ఏయన్నార్ తోనూ విశ్వనాథ్ అంతగా పనిచేయలేదు. మొదటి సినిమా తరువాత దాదాపు 23 ఏళ్ళకు గాని ఏయన్నార్ తో సినిమా తీయలేదు విశ్వనాథ్. 1989లో 'సూత్రధారులు'తోనే మళ్ళీ ఏయన్నార్ ను డైరెక్ట్ చేశారు విశ్వనాథ్. అయితే విశ్వనాథ్ 'శంకరాభరణం' తెరకెక్కించి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచగానే యన్టీఆర్, ఏయన్నార్ ఎంతగానో ఆయనను అభినందించారు. 'శంకరాభరణం' గొప్పతనాన్ని ప్రశంసిస్తూ రామారావు, నాగేశ్వరరావు ఆయనకు ఆశీస్సులు అందించారు.
యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ (Balakrishna) హీరోగా విశ్వనాథ్ 'జననీ జన్మభూమి' అనే చిత్రం రూపొందించారు. ఆ తరువాత బాలకృష్ణ హీరోగా రూపొందిన "నరసింహనాయుడు, సీమసింహం, లక్ష్మీనరసింహ" వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు విశ్వనాథ్. ఏయన్నార్ తనయుడు నాగార్జున (Nagarjuna) ఏ చిత్రానికీ విశ్వనాథ్ దర్శకత్వం వహించలేదు. కానీ, నాగార్జునతోనూ కలసి "వజ్రం, సంతోషం" వంటి చిత్రాలలో నటించారు విశ్వనాథ్. చివరిదాకా యన్టీఆర్, ఏయన్నార్ నటనను, వారి క్రమశిక్షణను పలు సందర్భాల్లో గుర్తు చేసుకుంటూనే ఉండేవారు విశ్వనాథ్.