NT Ramarao: తెలుగులో తొలి సైన్స్ ఫిక్షన్ 'దొరికితే దొంగలు'

ABN , Publish Date - Feb 26 , 2025 | 03:23 PM

1965లో ఎన్టీఆర్ నటించిన 12 చిత్రాలు విడుదల కాగా, ఎనిమిది చిత్రాలు డైరెక్ట్ గా శతదినోత్సవాలు జరుపుకున్నాయి. అందులో ఒకటి 'దొరికితే దొంగలు'.

తెలుగు చిత్రసీమలో తొలి సైంటిఫిక్ ఫిక్షన్ గా నిలచిన చిత్రం 'దొరికితే దొంగలు'. యన్టీఆర్ (NTR), జమున (Jamuna) జంటగా రూపొందిన ఈ చిత్రం అరవై ఏళ్ళ క్రితం భలేగా అలరించింది. ఆ యేడాది యన్టీఆర్ నటించిన 12 చిత్రాలు విడుదల కాగా, అందులో 8 సినిమాలు డైరెక్ట్ గా శతదినోత్సవం జరుపుకున్నాయి. మిగిలిన నాలుగు చిత్రాలు కూడా మంచి ఆదరణ పొందాయి. అందులో సైంటిఫిక్ ఫిక్షన్ గా రూపొందిన 'దొరికితే దొంగలు' కూడా ఉంది.

వైవిధ్యమైన కథాంశం వినిపిస్తే చాలు నటరత్న యన్టీఆర్ మరో మాట లేకుండా సదరు ప్రాజెక్ట్ కు ఓకే చెప్పేవారు. అప్పటి దాకా తెలుగులో వెలుగు చూడని సైంటిఫిక్ ఫిక్షన్ తో రూపొందిన 'దొరికితే దొంగలు' చిత్రాన్ని అలాగే అంగీకరించారు యన్టీఆర్. పి.సుబ్రహ్మణ్యం (P. Subrahmanyam) దర్శకత్వంలో చందమామ ఫిలిమ్స్ పతాకంపై డి.యల్. నారాయణ (D L Narayana) 'దొరికితే దొంగలు' నిర్మించారు... ఈ చిత్రం 1965 ఫిబ్రవరి 26న జనం ముందు నిలచింది. కథ ఏమిటంటే - ఇద్దరు శాస్త్రవేత్తల్లో ఒకరేమో ప్రాచీనపద్ధతుల్లో ప్రయోగాలు చేస్తూంటే, మరొకరు ఆధునిక మార్గాల్లో ఎక్స్పెరిమెంట్స్ నిర్వహిస్తూంటారు. వీరిద్ధరి మధ్య కథ సాగుతున్నా దేశద్రోహులను పట్టుకొనే పనిలో ఉన్న సి.ఐ.డి.లు ఓ ఆడ, ఓ మగ ప్రధాన పాత్రలు పోషిస్తారు.మొదట్లో వారిమధ్య కీచులాటలు సాగినా, చివరకు వారిద్దరూ ప్రేమించుకుంటారు.వారే దేశద్రోహులను పట్టుకోవడం జరుగుతుంది. ఆ జంటను ప్రభుత్వం సత్కరించడంతో కథ ముగుస్తుంది.


అంతకు ముందు మన దేశంలో 'మిస్టర్ ఎక్స్ ఇన్ బాంబే' వంటి సైంటిఫిక్ ఫిక్షన్స్ వచ్చాయి. కిశోర్ కుమార్ హీరోగా వచ్చిన ఆ సినిమాలోనే ఆకాశంలో ఎగురుతూ సాగే ఓ డ్యుయట్ ఉంటుంది. దాని స్ఫూర్తితోనే 'దొరికితే దొంగలు'లోనూ ఓ యుగళ గీతం తెరకెక్కింది.'దొరికితే దొంగలు'లో మనుషులు మాయమై పోవడం, ఓ మందు ప్రభావం వల్ల గాల్లోకి ఎగరడం వంటి అంశాలు చోటుచేసుకొని భలేగా అలరించాయి. ఆరుద్ర, దాశరథి, సి.నారాయణ రెడ్డి పాటలు పలికించగా యస్.రాజేశ్వరరావు స్వరకల్పన చేశారు. ఈ సైంటిఫిక్ ఫిక్షన్ లో సంప్రదాయ గీతాలు కూడా చోటు చేసుకోవడం విశేషం! ఇందులోని "శ్రీవేంకటేశా... ఈశా... శేషాద్రిశిఖరవాసా... " సాంగ్ ఈ నాటికీ భక్త కోటిని మురిపిస్తూ ఉంటుంది.


'దొరికితే దొంగలు' చిత్రం మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రం విడుదలైన వారానికే యన్టీఆర్, జమున జంటగా నటించిన జానపద చిత్రం 'మంగమ్మశపథం' జనం ముందు నిలచింది. దాంతో ప్రేక్షకులు అటువైపు కూడా పరుగులు తీశారు. ఆ ఉరుకుల పరుగుల మధ్య 'దొరికితే దొంగలు' నేరుగా 70 రోజుల దాకానే థియేటర్లలో సాగింది. నిర్మాత డి.యల్. కు మాత్రం మంచి లాభాలనే చూపించిందీ చిత్రం. తరువాతి రోజుల్లో కృష్ణ 'అఖండుడు', బాలకృష్ణ 'ఆదిత్య 369' వంటి సైంటిఫిక్ ఫిక్షన్స్ కు స్ఫూర్తిగా నిలచింది.

a copy.jpg

యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణ నటించిన 'ఆదిత్య 369' కేవలం సైంటిఫిక్ ఫిక్షన్ కాకుండా మరో అడుగు ముందుకేసి హిస్టారికల్ ఫాంటసీని జత చేసుకుంది. ఆ తరహా చిత్రం ఇప్పటి దాకా రాలేదు. త్వరలోనే 'ఆదిత్య 369' రీ-రిలీజ్ కానుంది. ఏది ఏమైనా అరవై ఏళ్ళ నాటి 'దొరికితే దొంగలు' అప్పట్లో ఎంతగానో అలరించింది. రిపీట్ రన్స్ లోనూ మురిపించింది. అడపా దడపా బుల్లితెరపై కనువిందు చేస్తూ ఉంటుంది.

Updated Date - Feb 26 , 2025 | 03:23 PM